Begin typing your search above and press return to search.

ద‌శ‌ర‌థ మ‌హారాజు ఆగ‌మ‌నం.. 'రామాయణం'లో ఆయ‌న ప్ర‌వేశం శుభ‌కరం!

ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తుండగా.. యశ్, సన్నీ డియోల్, రవి దూబే వంటి దిగ్గజ నటులు ఇతర ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు.

By:  Sivaji Kontham   |   7 Oct 2026 3:08 PM IST
ద‌శ‌ర‌థ మ‌హారాజు ఆగ‌మ‌నం.. రామాయణంలో ఆయ‌న ప్ర‌వేశం శుభ‌కరం!
X

ఒక తరం మొత్తానికి శ్రీరాముడి పాత్రతో దేవుడిలా కనిపిస్తూ జీవం పోసిన ప్రముఖ నటుడు అరుణ్ గోవిల్ ఇప్పుడు మరోసారి రామాయణ మహాకావ్య ప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. ఈసారి ఆయన రాముడిగా కాకుండా, అయోధ్య చక్రవర్తి దశరథ మహారాజుగా వెండితెరపై కనిపించనున్నారు. గతంలో రాముడి పాత్రను పోషించిన అదే నటుడు.. ఇప్పుడు దశరథుడిలా తండ్రి పాత్రలో కనిపించడం అభిమానులకు ఒక అద్భుతమైన భావోద్వేగ అనుభూతిని ఇస్తోంది.

నితీష్ తివారి ద‌ర్శ‌క‌త్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం `రామాయణ`పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 2026 దీపావళి కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సాంకేతిక హంగులతో, అత్యున్నత నిర్మాణ విలువులతో వస్తున్న ఈ చిత్రం పౌరాణిక కథాంశాలకు సరికొత్త నిర్వచనం ఇస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు.

ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తుండగా.. యశ్, సన్నీ డియోల్, రవి దూబే వంటి దిగ్గజ నటులు ఇతర ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఈ తారాగణంలోకి అరుణ్ గోవిల్ దశరథుడిగా చేరడం సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. పాత టెలివిజన్ తరానికి చెందిన పౌరాణిక జ్ఞాపకాలను, నేటి ఆధునిక సినిమా హంగులతో ఈ పాత్ర చక్కగా అనుసంధానించనుంది.

ఇక ఈ చిత్రానికి సంగీత దిగ్గజాలు ఏ.ఆర్. రెహమాన్ - ఆస్కార్ విజేత హాన్స్ జిమ్మర్ కలిసి పనిచేస్తుండటం విశేషం. ఈ ఇద్దరు సంగీత మాంత్రికుల కలయిక సినిమాలోని భావోద్వేగాలకు ప్రాణం పోయనుంది. ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ డిఎన్‌ఈజి, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సహకారంతో ఐమాక్స్ ఫార్మాట్‌లో రూపొందుతున్న ఈ దృశ్యకావ్యం ప్రేక్షకులకు గొప్ప‌ అనుభూతిని అందించనుంది.

2026 దీపావళి విడుదల కోసం అటు సినీ ప్రేమికులు, ఇటు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అరుణ్ గోవిల్ మళ్లీ రామాయణంలోకి రావడం పట్ల సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న హర్షాతిరేకాలు చూస్తుంటే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. అయోధ్య వైభవాన్ని, రామాయణ కాలపు పవిత్రతను ఈ చిత్రం కళ్ళకు కట్టినట్లు చూపనుంది.