Begin typing your search above and press return to search.

హాలీవుడ్ ను వణికిస్తున్న మనోడు

By:  Tupaki Desk   |   3 Oct 2015 9:30 AM GMT
హాలీవుడ్ ను వణికిస్తున్న మనోడు
X
మనోజ్ నైట్ శ్యామలన్.. హాలీవుడ్ హార్రర్ థ్రిల్లర్స్ చూసే వాళ్లకి ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ది సిక్స్త్ సెన్స్ - అన్ బ్రేకబుల్ - సైన్స్ - విలేజ్ లాంటి సినిమాలతో హాలీవుడ్ లో ప్రకంపనలు రేపిన మనోజ్.. భారత సంతతికి చెందిన వాడన్న సంగతి చాలామందికి తెలియదు. అతను కేరళవాడు. ఐతే చిన్నప్పుడే అతడి కుటుంబం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది. ‘ది సిక్స్త్ సెన్స్’ సినిమాతో హాలీవుడ్ లో అతడి పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత ఆ స్థాయిలో సినిమాలు తీయలేకపోయాడు మనోజ్. ఐతే ఇప్పుడు అతడి కొత్త సినిమా ‘ది విజిట్’ హాలీవుడ్ ను వణికించేస్తోంది.

చాలా తక్కువ బడ్జెట్ లో.. కేవలం రూ.33 కోట్లతో మనోజ్ తెరకెక్కించిన ఈ హార్రర్ థ్రిల్లర్.. హాలీవుడ్ లో కలెక్షన్ ల వర్షం కురిపిస్తోంది. రెండు వారాల్లోనే రూ.400 కోట్లకు పైగా వసూలు చేసి హాలీవుడ్ ట్రేడ్ పండిట్ లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మనోజ్.. విల్ స్మిత్ హీరోగా ఇంతకుముందు తీసిన ‘ఆఫ్టర్ ఎర్త్’ పెద్ద ఫ్లాపవడంతో ఈసారి తక్కువ బడ్జెట్ లో తనదైన శైలిలో హార్రర్ థ్రిల్లర్ తీశాడు మనోజ్. గంటన్నర పాటు తీవ్ర ఉత్కంఠకు, భయానికి గురి చేస్తున్న ఈ సినిమా చూసి ప్రేక్షకులు షాకైపోతున్నారు. పెద్దగా ప్రమోషన్ కూడా లేకుండా విడుదలైన ఈ సినిమా మౌత్ పబ్లిసిటీతోనే పెద్ద హిట్టయింది. త్వరలోనే ఇండియాలోనూ ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అలా వచ్చినపుడు.. మనోడు తీసిన ఈ సెన్సేషనల్ మూవీని చూడ్డం మరిచిపోకండే.