Begin typing your search above and press return to search.

అల్లరోడిని ఇలా తట్టుకోగలరా?

By:  Tupaki Desk   |   22 Feb 2023 3:23 PM GMT
అల్లరోడిని ఇలా తట్టుకోగలరా?
X
అల్లరి నరేష్ పేరెత్తగానే ఒకప్పుడు అందరి ముఖాల్లో చిరు నవ్వు పులుముకునేది. 'అల్లరి'తో మొదలుకుని అతను చేసినవన్నీ కామెడీ సినిమాలే. మధ్య మధ్యలో 'ఫిట్టింగ్ మాస్టర్' లాంటి కొన్ని సీరియస్ సినిమాలు పడ్డా.. అవి ప్రేక్షకులకు అస్సలు రుచించలేదు. దీంతో కామెడీనే నమ్ముకుని ముందుకు సాగిపోయాడతను. కానీ అతడి కామెడీ సినిమాలు ఒక మూసలో సాగడంతో ప్రేక్షకులకు మొహం మొత్తేసి వాటిని తిరస్కరించడం మొదలుపెట్టారు.

దీంతో అల్లరోడు రూటు మార్చక తప్పలేదు. 'మహర్షి' సినిమాలో సీరియస్ రోల్ చేయడమే కాక.. 'నాంది' లాంటి ఫుల్ సీరియస్ మూవీతో హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు. ఇవి రెండూ మంచి ఫలితాన్నే అందించాయి. ముఖ్యంగా 'నాంది' హీరోగా అల్లరోడి కెరీర్‌కు ఊపిరి పోసింది. ఈ చిత్రంలో తన నటనతో నరేష్ కంటతడి పెట్టించేశాడు.

ఇప్పుడు అల్లరోడి నుంచి 'ఉగ్రం' రాబోతోంది. 'నాంది' దర్శకుడు విజయ్ కనకమేడలనే ఈ చిత్రాన్ని కూడా రూపొందించాడు. ఈ రోజే టీజర్ రిలీజ్ చేయగా.. పేరుకు తగ్గట్లే ఇందులో అల్లరోడు ఉగ్రరూపం చూపించేశాడు. కెరీర్లో ఇంతకుముందెన్నడూ నరేష్ ఇలాంటి పాత్రలో కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. మాస్ హీరోల మాదిరి ఎలివేషన్లు, సీరియస్ డైలాగులతో నరేష్ చాలా కొత్తగా కనిపించాడు.

చివర్లో నరేష్ నోటి నుంచి ఒక బూతు మాట కూడా వినిపించడం గమనార్హం. కానీ మరీ ఇంత సీరియస్నెస్, ఇంటెన్సిటీ, యాక్షన్, ఎలివేషన్ ఉన్న పాత్రలో అల్లరోడిని చూసి ప్రేక్షకులు జీర్ణించుకోగలరా.. అతడి ఇమేజ్‌కు ఇవన్నీ సూటవుతాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. కానీ 'నాంది'లో ఏడిపించే పాత్ర చేసినపుడు కూడా ఇలాంటి డౌట్లే వ్యక్తమయ్యాయి. కానీ ఆ పాత్రలో అతను మెప్పించాడు. నరేష్‌కు ఆ రకమైన మేకోవర్ ఇచ్చిన విజయే.. ఇప్పుడు ఇంకో రకమైన మేకోవర్ ఇస్తున్నాడు. ఈసారి కూడా అలాంటి ఫలితమే పునరావృతం అవుతుందేమో చూద్దాం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.