ఆహారం ధరలా లేక బంగారం ధరలా?
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ ఇటీవలే విలాసవంతమైన రెస్టారెంట్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 13 May 2026 12:00 AM ISTబాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ ఇటీవలే విలాసవంతమైన రెస్టారెంట్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెస్టారెంట్ ఆహార రుచుల కంటే కూడా అక్కడి ధరల కారణంగా వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న మెనూ కార్డును చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. సామాన్య వంటకానికి కూడా ఊహించని స్థాయిలో ధరలు నిర్ణయించడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు నడిపే రెస్టారెంట్లు అంటే అంబియెన్స్ , బ్రాండ్ వ్యాల్యూ కోసం కొంత ఎక్కువ ధర ఉండటం సహజమే.
కానీ అర్పితా ఖాన్ రెస్టారెంట్‌లో పప్పు , రోటీ వంటి పదార్థాలకు కూడా ఐదు నక్షత్రాల హోటళ్లకు మించిన ధరలు ఉండటమే వివాదానికి కారణమైంది. `ఇది ఆహారం ధరలా లేక బంగారం ధరలా` అంటూ కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబం అక్కడ భోజనం చేయాలంటే నెల జీతంలో సగం ఖర్చు చేయాల్సి వస్తోందిట. ఈ ధరల వ్యవహారం కేవలం విమర్శలకే పరిమితం కాలేదు. సరికొత్త చర్చకు దారి తీసింది. సెలబ్రిటీలు సామాన్య ప్రజలకు దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. కానీ వారి వ్యాపారాలు మాత్రం ఉన్నత వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండటం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బ్రాండ్ నేమ్‌ను అడ్డం పెట్టుకుని ఆహార పదార్థాల ధరలను అమాంతం పెంచేయడం సరైన పద్ధతి కాదని భోజన ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఈ ధరలను సమర్థించే వారు కూడా లేకపోలేదు. విలాసవంతమైన ప్రాంతాల్లో రెస్టారెంట్ నిర్వహణ ఖర్చులు, నాణ్యమైన సిబ్బంది, అక్కడ అందించే ప్రత్యేకమైన సర్వీసుల దృష్ట్యా ఆ ధరలు ఉండొచ్చని కొందరు వాదిస్తున్నారు. సెలబ్రిటీ రెస్టారెంట్ అనేది ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే కాదు. అదొక హోదాకు చిహ్నంగా చూసే వారు ఉన్నంత కాలం ఇలాంటి ధరలు ఉంటాయని వారు చెబుతున్నారు.
అయినా సోషల్ మీడియా యుగంలో ఏ చిన్న విషయమైనా ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపుతుంది. అర్పితా ఖాన్ రెస్టారెంట్ ధరలపై వస్తోన్న మీమ్స్ , ట్రోల్స్ సల్మాన్ ఖాన్ అభిమానులను కూడా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఆహారం అనేది ప్రాథమిక అవసరం కాబట్టి కనీసం కొన్ని వంటకాలనైనా అందుబాటు ధరల్లో ఉంచితే బాగుంటుందని నెటిజన్లు సూచిస్తున్నారు. లేకపోతే అది చూడముచ్చటైన హోటల్ గానే మిగిలిపోతుందే తప్ప జనాదరణ పొందలేదని హెచ్చరిస్తున్నారు. సెలబ్రిటీలు వ్యాపారంలోకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామమే. అయినా సామాన్యుల ఆర్థిక స్థితిగతులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అర్పితా ఖాన్ రెస్టారెంట్ ధరల విషయంలో పునరాలోచన చేస్తారో లేదో చూడాలి.
