Begin typing your search above and press return to search.

'ది మ‌మ్మీ' విల‌న్‌తో దేవ‌ర‌కొండ ఫేసాఫ్.. గ్లోబ‌ల్ రీచ్ ఇంకెంతో దూరంలో లేదు!

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ `రణబాలి`. ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌.

By:  Sivaji Kontham   |   10 Sept 2026 12:40 PM IST
ది మ‌మ్మీ విల‌న్‌తో దేవ‌ర‌కొండ ఫేసాఫ్.. గ్లోబ‌ల్ రీచ్ ఇంకెంతో దూరంలో లేదు!
X

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ `రణబాలి`. ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా నుంచి ఇటీవల విడుదలైన టీజర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ రఫ్‌ అండ్ ఇంటెన్స్ లుక్‌తో ఆకట్టుకోగా.. అంతకుమించి టీజర్‌లో ప్రేక్షకులకు అసలైన సర్‌ప్రైజ్ ఇచ్చింది మాత్రం హాలీవుడ్ దిగ్గజ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ. హాలీవుడ్ పాప్ కల్చర్‌లో అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన‌ విలన్‌గా పేరుగాంచిన అత‌డు ఈ చిత్రంలో పవర్‌ఫుల్ ప్రతినాయకుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతుండటంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.

గతంలో `లైగర్` చిత్రం ద్వారా బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌ను టాలీవుడ్‌కి పరిచయం చేసిన విజయ్ దేవరకొండ, ఈసారి ఏకంగా హాలీవుడ్ ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ విలన్‌ను తన చిత్రంలోకి దింపడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించిన ది మమ్మీ (1999), ది మమ్మీ రిటర్న్స్ (2001) చిత్రాలలో భయంకరమైన హైప్రీస్ట్ ఇమ్‌హోటెప్ పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఆర్నాల్డ్ వోస్లూ..`రణబాలి` ద్వారానే తొలిసారిగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. టీజర్‌లో ఆయన చూపించిన క్రూరత్వం- విలనిజం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

దక్షిణాఫ్రికాకు చెందిన ఆర్నాల్డ్ వోస్లూ తన కెరీర్‌ను థియేటర్ ఆర్టిస్ట్‌గా ప్రారంభించి `హామ్‌లెట్`, `ట్వెల్త్ నైట్` వంటి క్లాసిక్ నాటకాల ద్వారా గుర్తింపు పొంది అనేక పురస్కారాలు అందుకున్నారు. ఆ తర్వాత హాలీవుడ్‌కు మారిన ఆయనను ప్రముఖ డైరెక్టర్ జాన్ వూ ఒక నాటకంలో చూసి జీన్-క్లాడ్ వాన్ డామ్‌ హీరోగా తీసిన `హార్డ్ టార్గెట్` (1993) చిత్రంలో మెయిన్ విలన్‌గా అవకాశం ఇచ్చారు. ఆపై `డార్క్ మేన్` సీక్వెల్స్‌తో పాటు పాపులర్ టీవీ సిరీస్ 24లో ఉగ్రవాది హబీబ్ మర్వాన్‌గా.. జి.ఐ. జో సిరీస్‌లో జార్టాన్‌గా...`బ్లడ్ డైమండ్` వంటి చిత్రాలలో నటించి గ్లోబల్ ఆడియన్స్‌ను మెప్పించారు.

ఇప్పుడు అలాంటి అంతర్జాతీయ స్థాయి నటుడు మొదటిసారిగా టాలీవుడ్ సినిమాలో క్రూరమైన విలన్‌గా నటిస్తుండటంతో `రణబాలి`కి ప్రధాన బలంగా మారుతుంద‌ని, ఈ ప్రాజెక్టుకు ఇంట‌ర్నేష‌న‌ల్ రీచ్ ఉంటుంద‌ని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. టీజర్‌లో విజయ్ దేవరకొండ ఎనర్జీకి పోటీగా ఆర్నాల్డ్ వోస్లూ చూపించిన సీరియస్ అండ్ డార్క్ పెర్ఫార్మన్స్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసింది. ఒక వైపు విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ యాక్షన్... మరోవైపు అంతర్జాతీయ స్థాయి విలనిజంతో ఆర్నాల్డ్ వోస్లూ మధ్య వచ్చే ఫేసాఫ్ సన్నివేశాలు వెండితెరపై మాస్ జాతరను తలపించడం ఖాయమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మొత్తానికి `రణబాలి` రూపంలో టాలీవుడ్ మరోసారి అంతర్జాతీయ నటీనటులను తమ సినిమాల్లోకి తీసుకొచ్చి భారతీయ సినిమా స్థాయిని పెంచుతోంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో విజయ్ దేవరకొండ- ఆర్నాల్డ్ వోస్లూ ఎదురెదురుగా ఢీ కొట్టే హై-వోల్టేజ్ సీన్లు థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త విజువల్ ఫీస్ట్‌ను అందించనున్నాయి. హాలీవుడ్ విలనిజాన్ని మన దేశీయ కథనానికి జోడించి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎటువంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!