VD (X) మమ్మీ నటుడు: అతడిని కాదు స్క్రిప్టుని నిందించాలి
తమ సినిమాలో ఒక అంతర్జాతీయ స్థాయి స్టార్ నటిస్తే, అది దేశవిదేశాలలో భారీ ప్రాచుర్యం పొందుతుందని భావిస్తున్నారు.
By: Sivaji Kontham | 27 Nov 2025 9:32 AM ISTపాన్ ఇండియా ట్రెండ్ లో చాలా విషయాలు మారిపోయాయి. సినిమా కోసం ఎంపిక చేసుకునే కథ కంటెంట్ తో పాటు, సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టులను కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయి స్టాండార్డ్స్ కావాలని అనుకుంటున్నారు. భారతదేశంలో ఉన్న అన్ని భాషల నుంచి ప్రముఖ నటులను తమ సినిమాకి ఎంపిక చేసుకోవడం ద్వారా భాషా భేధం లేకుండా అన్నిచోట్లా తమ సినిమాకి బాక్సాఫీస్ వసూళ్ల పరంగా మైలేజ్ పెరగాలని మేకర్స్ వ్యూహం రచిస్తున్నారు.
తమ సినిమాలో ఒక అంతర్జాతీయ స్థాయి స్టార్ నటిస్తే, అది దేశవిదేశాలలో భారీ ప్రాచుర్యం పొందుతుందని భావిస్తున్నారు. అయితే ఇలాంటి ఎత్తుగడలు అన్నిసార్లు వర్కవుట్ కాకపోవచ్చు. ఏదైనా ప్లాన్ కొన్నిసార్లు ఫలించవచ్చు.. కొన్నిసార్లు నిరాశపరచవచ్చు. రెండిటికీ మేకర్స్ మానసికంగా సిద్ధపడాల్సి ఉంటుందని గతం నిరూపించింది. ఇటీవలి కాలంలో విజయ్ దేవరకొండ నటించిన `లైగర్` డిజాస్టర్ ఫలితాన్ని ఎదుర్కోవడం అతిపెద్ద నిరాశ. దానికి కారణం ఈ చిత్రంలో అంతర్జాతీయ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఓ కీలక పాత్రను పోషించడం. టైసన్ పాత్ర నుంచి ప్రేక్షకాభిమానులు చాలా ఎక్స్ పెక్ట్ చేస్తే దానిలో ఆశించినది ఏదీ లేదు. దర్శకుడు పూరి జగన్నాథ్ టైసన్ పాత్రను, అతడితో ముడిపడిన సీన్లను, స్క్రిప్టును మలచడంలో ఆశించిన స్టాండార్డ్స్ ని అందుకోలేకపోయారని విమర్శలొచ్చాయి.
`లైగర్` డిజాస్టర్ ఫలితం అందుకోవడంతో అంతర్జాతీయ స్టార్ టైసన్ ప్రవేశం వర్కవుట్ కాలేదంటూ జనం ముచ్చటించుకున్నారు. అందుకే ఇప్పుడు విజయ్ దేవరకొండ మరోసారి అంతర్జాతీయ నటుడిని తన సినిమా కోసం ఎంపిక చేసుకున్నాడని తెలియగానే నెటిజనులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. చాలా మంది పాత డిజాస్టర్ (లైగర్ తో) సెంటిమెంట్ రిపీటవుతుందని, వీడీ తాజా సినిమా విజయం సాధించదని ఆందోళన చెందుతున్నారు. రాహుల్ సాంకృత్యాయన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మమ్మీ నటుడు అన్రోల్డ్ వోస్లూ ఎంపిక ప్లస్సా మైనస్సా అనే చర్చ సాగుతోంది. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ నటుడి రాకతో దేవరకొండ సినిమాకి అంతర్జాతీయంగా గ్రాఫ్ పెరుగుతుందని చిత్రబృందం భావించినా కానీ, అభిమానులు వేరొకలా థింక్ చేస్తున్నారు. మైక్ టైసన్ మాదిరిగానే మమ్మీ నటుడు కూడా తేలిపోతాడనే భయాందోళనలు వారిలో ఉన్నాయి.
అయితే ప్రజలు ఎప్పుడూ భయపడాల్సింది ఆర్టిస్టును చూసి కాదు. ఆ ఆర్టిస్టును సద్వినియోగం చేసుకోలేని దర్శకుడిని, అలాగే అంతగా ఎమోషన్స్ ని కనెక్ట్ చేయలేని స్క్రిప్టు రాసే రచయితను చూసి భయపడాలి. అవి రెండూ కుదిరినప్పుడు ఆర్టిస్టు ఆటోమెటిగ్గా తన పాత్రలో సింక్ అయి పని చేయగలడు. మంచి ఔట్ పుట్ తీసుకోవాల్సిన బాధ్యత దర్శకుడికి ఉంటుంది. ఇప్పుడు రాహుల్ సాంకృత్యాయన్ సీనియర్ దర్శకుడు పూరి జగన్నాథ్ చేసిన తప్పు నుంచి నేర్చుకుని తన స్క్రిప్టును అత్యంత బలంగా రూపొందించి, దానిలో మమ్మీ నటుడి పాత్రను అంతే బలంగా తీర్చిదిద్దాడని ఆశిద్దాం. టాక్సీవాలా లాంటి థ్రిల్లర్ మూవీని తెరకెక్కించిన రాహుల్ స్క్రీన్ ప్లే టెక్నిక్స్ మరోసారి అద్భుతంగా వర్కవుట్ అవ్వాలని భావిద్దాం. సోషల్ మీడియా అభిప్రాయాలకు భిన్నంగా ఆర్నాల్డో లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి టాలీవుడ్ లో నిరూపించాలని కూడా ఆకాంక్షిద్దాం.
