Begin typing your search above and press return to search.

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

వెండితెర‌పై త‌మ అద్భుత‌ నటనతో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న నటులు కొందరైతే..నిజ జీవితంలో పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి సమతుల్యత కోసం కృషి చేస్తూ నిజమైన నాయకులుగా నిలిచే న‌టులు మరికొందరు

By:  Sivaji Kontham   |   4 Nov 2026 4:00 AM IST
హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!
X

వెండితెర‌పై త‌మ అద్భుత‌ నటనతో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న నటులు కొందరైతే..నిజ జీవితంలో పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి సమతుల్యత కోసం కృషి చేస్తూ నిజమైన నాయకులుగా నిలిచే న‌టులు మరికొందరు. హాలీవుడ్‌లో బాడీబిల్డింగ్ లెజెండ్, స్టార్ హీరో ఆర్నాల్డ్ ష్వాజ్‌నెగర్ ప్రకృతితో మమేకమై జీవించడం గురించి.. గ్లోబల్ వార్మింగ్‌ను నివారించడం గురించి ప్రపంచ వేదికలపై ప్రచారం చేస్తుంటే.. ఇక్క‌డ‌ దక్షిణ భారత చిత్రసీమలో విల‌క్ష‌ణ న‌టుడు ఆర్.మాధవన్ (మ్యాడీ) సహజ సాగు, పర్యావరణ రక్షణ ప్రాముఖ్యతను చాటిచెబుతున్నారు. భౌగోళిక సరిహద్దులు వేరైనా.. ప్రకృతి పరిరక్షణ -చెట్ల పెంపకం విషయంలో వీరిద్దరి ఆలోచనలు, ఆశయాలు ఒక్కటే కావడం విశేషం.

హాలీవుడ్ దిగ్గజం ఆర్నాల్డ్ ష్వాజ్‌నెగర్ స్థాపించిన `ష్వాజ్‌నెగర్ క్లైమేట్ ఇనిషియేటివ్` ద్వారా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులపై అవగాహన పెంచడంతో పాటు అనేక పర్యావరణ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా `జేన్ గూడాల్ ఇనిస్టిట్యూట్ - ఆస్ట్రియా` సంయుక్తంగా పశ్చిమ ఉగాండాలో చేపట్టిన `కల్చర్ విత్ నేచర్` అనే మూడేళ్ల అటవీ పునరుద్ధరణ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తయింది. స్థానిక సంప్రదాయ `ముటుబా` అత్తి చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ 10 గ్రామాల్లోని 300కి పైగా రైతు కుటుంబాలకు 15,000 ముటుబా చెట్ల కొమ్మలను పంపిణీ చేశారు. చెట్లను నరకకుండానే బెరడు సేకరించే శిక్షణనిస్తూ అడవుల నరికివేతకు అడ్డుకట్ట వేశారు.

అటు ఆఫ్రికన్ అడవులలో పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ఆర్నాల్డ్ ఇనిషియేటివ్ కీలక పాత్ర పోషించింది. `బుడోంగో-బుగోమా కారిడార్` పరిధిలో పెంపొందించిన ఈ ముటుబా అత్తి చెట్లు అంతరించిపోతున్న చింపాంజీల సహజ ఆవాసాలను పరిరక్షించడమే కాకుండా.. వాటికి ప్రధాన ఆహార వనరుగా మారాయి. అంతేకాకుండా చెట్టుకు ఎలాంటి హాని కలగకుండా దాదాపు 40 సంవత్సరాల పాటు బెరడును సేకరించి దుస్తులు తయారుచేసే పురాతన కళను పునరుద్ధరించారు. ఇది పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానిక రైతులకు నిరంతర ఉపాధిని ఇచ్చే స్థిరమైన నమూనాగా నిలిచింది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇలాంటి స్టార్లు మ‌రికొంద‌రు ఉన్నారు. ప్ర‌కృతిని కాపాడాల‌నే త‌ప‌న‌తో ప‌ని చేస్తున్నారు. మరొకవైపు సౌత్ ఇండియాలో స్టార్ హీరో ఆర్. మాధవన్ సైతం ఆర్నాల్డ్ బాటలోనే ప్రకృతి ఆధారిత జీవనశైలికి పెద్దపీట వేస్తున్నారు. స్వయంగా వ్యవసాయంపై మక్కువ ఉన్న మాధవన్ తమిళనాడులోని తన సొంత భూమిలో రసాయనాలు లేని సహజ సాగు పద్ధతుల్లో మంచి పంటలు పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలిచారు. బంజరు భూములను సారవంతమైన సేంద్రీయ తోటలుగా మార్చడంలో ఆయన సాధించిన విజయం.. సమకాలీన వ్యవసాయంలో ఒక విప్లవాత్మక మార్పుగా ప్రశంసలు అందుకుంది. అత‌డు వంద‌లాది ఎక‌రాల‌లో సేంద్రియ ఎరువుల‌తో పంట‌లు పండించి నిర్వీర్యంగా ఉన్న భూమిని కూడా బాగు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్రకృతి వైపరీత్యాలు, నేల క్షీణతను నివారించడానికి ప్రకృతి సిద్ధమైన వ్యవసాయమే మార్గమని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారు. ఈ మోడ‌ల్ ని భార‌త‌దేశ వ్యాప్తంగా విస్త‌రించేందుకు అత‌డు ప్ర‌ణాళిక‌ల్లో ఉన్నాడు.

ఈ విధంగా ఆర్నాల్డ్ అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ క్లైమేట్ ఇనిషియేటివ్స్ ద్వారా అడవుల పునరుద్ధరణకు, జీవవైవిధ్య రక్షణకు కృషి చేస్తుంటే.. మ్యాడీ స్థానిక స్థాయిలో సహజ సాగును.. వృక్షో రక్షతి రక్షితః అనే భావనను ప్రజాదరణ పొందేలా చేస్తున్నారు. నటులుగా భారీగా అభిమానులను సంపాదించుకున్న ఈ ఇద్దరు దిగ్గజాలు తమ గ్లామర్‌ను సామాజిక బాధ్యతతో జోడించి పర్యావరణ సంరక్షకులుగా మారడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ‌త‌కు ఒక గొప్ప ప్రేరణ.