Begin typing your search above and press return to search.

సిద్ధార్థ్ న‌టించిన వెబ్‌సిరీస్‌పై ఆర్మీ వెట‌ర‌న్ తీవ్ర అభ్యంత‌రం!

1999 కార్గిల్ యుద్ధంలో భారత వైమానిక దళం (IAF) ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాల ఆధారంగా తెరకెక్కిన 'ఆపరేషన్ సేఫ్ద్ సాగర్' వెబ్ సిరీస్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది.

By:  Sivaji Kontham   |   13 Aug 2026 3:16 PM IST
సిద్ధార్థ్ న‌టించిన వెబ్‌సిరీస్‌పై ఆర్మీ వెట‌ర‌న్ తీవ్ర అభ్యంత‌రం!
X

1999 కార్గిల్ యుద్ధంలో భారత వైమానిక దళం (IAF) ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాల ఆధారంగా తెరకెక్కిన 'ఆపరేషన్ సేఫ్ద్ సాగర్' వెబ్ సిరీస్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఆరు ఎపిసోడ్ల సైనిక డ్రామాకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే ఒక ముఖ్యమైన సన్నివేశంలో భారత జాతీయ జెండాను అమర్చిన విధానం `ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా` నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఆర్మీ వేటరన్, శౌర్య చక్ర గ్రహీత కల్నల్ వేంబు శంకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ సిరీస్‌లో అమరవీరుడు స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా (నటుడు సిద్ధార్థ్ పోషించిన పాత్ర) పార్థివదేహాన్ని శవపేటికలో తీసుకెళ్లే సన్నివేశంలో భారత త్రివర్ణ పతాకాన్ని తప్పుడు రీతిలో కప్పారని కల్నల్ శంకర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సైనిక నిబంధనలు- జాతీయ జెండా కోడ్ ప్రకారం శవపేటికపై జెండాను కప్పేటప్పుడు కాషాయ రంగు ఎల్లప్పుడూ తల వైపే ఉండాలి. ఈ సన్నివేశంలో జరిగిన పొరపాటుపై డిజిటల్ కరెక్షన్ చేయాలని.. మేకర్స్ క్షమాపణలు చెప్పాలని... మార్పులు చేసే వరకు ఈ సిరీస్ ప్రసారాలను నెట్‌ఫ్లిక్స్ నుండి నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఒని సేన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సిరీస్‌ను అభిజీత్ సింగ్ పర్మార్- కుశాల్ శ్రీవాస్తవ సృష్టించారు. ఇందులో సిద్ధార్థ్, జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ, మిహిర్ అహూజా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కార్గిల్ సరిహద్దుల్లో శత్రుమూకలకు ఎదురెళ్లిన‌ వైమానిక దళం, భారత ఆర్మీతో కలిసి నిర్వహించిన 47 రోజుల సుదీర్ఘ పోరాటాన్ని, పైలట్ల త్యాగాలను, వ్యూహాత్మక దాడులను ఈ సిరీస్ లో కళ్లకు కట్టినట్లు చూపించింది.

టెక్నికల్ పొరపాటుపై వివాదం నెలకొన్నా కానీ.. ఈ వెబ్ సిరీస్‌లోని ఎమోషనల్ సీన్లు.. వైమానిక పోరాట ఘట్టాలు .. నటీనటుల ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కేవలం యుద్ధ సన్నివేశాలకే పరిమితం కాకుండా సైనికుల వ్యక్తిగత జీవితాలు... వారి త్యాగాలను మానవీయ కోణంలో ఆవిష్కరించిన తీరు ఇటీవలి కాలంలో వచ్చిన ఉత్తమ సైనిక చిత్రాలలో ఒకటిగా దీనిని నిలిపిందని సమీక్షకులు పేర్కొన్నారు.

కళాత్మక స్వేచ్ఛతో సినిమాలు, సిరీస్‌లు తీస్తున్నా.. భారత సాయుధ దళాల గౌరవం .. జాతీయ చిహ్నాల విషయంలో పూర్తి జాగ్రత్తలు వహించాల్సిన బాధ్యత చిత్రబృందాలపై ఉందనే విషయాన్ని ఈ సంఘటన మ‌రోసారి గుర్తుచేస్తోంది. ఆర్మీ వేటరన్ లేవనెత్తిన ఈ అంశంపై చిత్ర నిర్మాతలు లేదా నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో ఆ సన్నివేశాన్ని సరిదిద్దుతారో లేదో వేచి చూడాలి. ఇదే త‌ర‌హాలో సినీహిస్ట‌రీలో గ‌తంలోను కొన్ని పొర‌పాట్లు జరిగిన‌ప్పుడు వాటిని స‌రిదిద్దుకోవాల‌ని కోర్టుకు వెళ్లిన ఘ‌ట‌న‌లు మీడియా హెడ్ లైన్స్ లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.