తండ్రీ కూతుళ్ల సింప్లిసిటీకి అందరూ ఫిదా
టాలీవుడ్‌లో అర్జున్‌కు ఉన్న పరిచయాలు, గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అనుకుంటే టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్‌లను పెద్ద ఎత్తున నిర్వహించవచ్చు.
By: Sravani Lakshmi Srungarapu | 10 Feb 2026 10:25 PM ISTయాక్షన్ కింగ్ అర్జున్.. సౌత్ ఇండియన్ సినీ ఆడియన్స్‌కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. యాక్షన్, స్టైల్, డిసిప్లిన్, ప్రొఫెషనలిజం.. ఈ నాలుగు లక్షణాల కలయికగా అర్జున్ కెరీర్ కొనసాగింది. దశాబ్దాల పాటు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, డైరెక్టర్ గా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు మరో కీలకమైన పాత్రలోకి అడుగుపెడుతున్నారు. అదే దర్శకుడిగా తన కూతురు ఐశ్వర్యా అర్జున్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేయడం.
ఫిబ్రవరి 14న సీతాపయనం రిలీజ్
ఐశ్వర్యా అర్జున్ నటించిన సీతా పయనం సినిమా ఫిబ్రవరి 14న, వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ తండ్రిగా, ఓ డైరెక్టర్ గా ఇది అర్జున్‌కు ఎంతో భావోద్వేగమైన సినిమా అని చెప్పాలి. సాధారణంగా స్టార్ కిడ్స్ లాంచ్ అంటే భారీ ఈవెంట్లు, సెలబ్రిటీ అటెండెన్స్, గ్లామరస్ ప్రమోషన్స్ తప్పనిసరి అన్నట్టుగా మారిన ఈ రోజుల్లో, అర్జున్ మాత్రం పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు.
కూతురి లాంచ్ విషయంలో సైలెంట్ గా వ్యవహరిస్తున్న అర్జున్
టాలీవుడ్‌లో అర్జున్‌కు ఉన్న పరిచయాలు, గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అనుకుంటే టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్‌లను పెద్ద ఎత్తున నిర్వహించవచ్చు. ప్రముఖ హీరోలు, దర్శకులు, నిర్మాతలను ఆహ్వానించి ఐశ్వర్యా లాంచ్‌ను గ్రాండ్ ఈవెంట్‌గా మార్చవచ్చు. కానీ అర్జున్ అలా చేయలేదు. ప్రమోషన్స్ విషయంలో కూడా చాలా సింపుల్‌గా, కంటెంట్‌పై నమ్మకం ఉంచి ముందుకు వెళ్తున్నారు.
అడగడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది
ఈ విషయంలో అర్జున్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఎవరి దగ్గరైనా ఏదైనా అడగాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుందని ఆయన చెప్పిన మాటలు ఆయన వ్యక్తిత్వాన్ని అద్దంలా చూపిస్తున్నాయి. కూతురి కోసమే కదా అడగొచ్చు అని కొందరు సూచించినా, అర్జున్ మాత్రం నవ్వుతూ ఊరుకున్నారు. ఈ సింప్లిసిటీ, ఆత్మగౌరవం, స్వాభిమానమే ఆయనను మిగతా వారితో పోల్చితే ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.
టాలెంట్ తో గుర్తింపు తెచ్చుకోవాలని ఐశ్వర్య ప్రయత్నాలు
మార్కెట్ పరంగా చూస్తే, ఈ నిర్ణయం ఓ రిస్క్‌లా అనిపించవచ్చు. కానీ మరో యాంగిల్ లో చూస్తే, ఇది ఐశ్వర్యా కెరీర్‌కు మంచి పునాది కూడా కావచ్చు. స్టార్ డాటర్ ట్యాగ్ కంటే, ఒక కొత్త హీరోయిన్‌గా తన టాలెంట్‌తోనే గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆలోచన ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. సినిమాపై నమ్మకం ఉంటే, హడావిడి లేకపోయినా ప్రేక్షకులు ఆదరిస్తారన్న విశ్వాసం అర్జున్ నిర్ణయంలో ప్రతిబింబిస్తోంది. మొత్తానికి, సీతా పయనం కేవలం ఓ హీరోయిన్ లాంచ్ సినిమా మాత్రమే కాదు. ఓ తండ్రి ఆలోచనలకి, ఓ దర్శకుడి విలువలకు ప్రతీకగా నిలిచే ప్రయత్నం. అర్జున్ సింప్లిసిటీకి, నిజాయితీకి ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు.
