కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!
కుమార్తె ఐశ్వర్య అర్జున్‌పై సోషల్ మీడియాలో వస్తున్న నిరాధార ఆరోపణలపై నటుడు అర్జున్ సర్జా తీవ్రంగా స్పందించారు. ఆమెను మద్యానికి బానిసగా చిత్రీకరిస్తూ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ప్రచారం చేస్తున్న వారిపై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలు చేయడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వేర్వేరని స్పష్టం చేశారు.
By: Priya Chowdhary Nuthalapti | 20 Nov 2026 2:40 AM ISTసీతా పయనం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను ఈమధ్య పలకరించింది అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్. ఈ క్రమంలో తాజాగా అర్జున్ సర్జా తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె వ్యక్తిగత జీవితం, వివాహ బంధంపై సోషల్ మీడియాలో వస్తున్న వివాదాస్పద కథనాలపై తీవ్రంగా స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఐశ్వర్య వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
ముఖ్యంగా ఆమెను మద్యానికి బానిసగా చిత్రీకరిస్తూ కొందరు చేస్తున్న ఆరోపణలను అర్జున్ తీవ్రంగా ఖండించారు. ఒక మహిళ వ్యక్తిగత జీవితంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ మంది పడ్డారు.
అసలు విషయానికి వస్తే కొద్ది రోజుల క్రితం అర్జున్ సర్జా చిన్న కుమార్తె అంజనా వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అయితే ఈ పెళ్లి వేడుక తర్వాత అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్ వైవాహిక జీవితం గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు మొదలయ్యాయి. ఐశ్వర్య భర్త ఉమాపతి రామయ్య, ఆయన తండ్రి ప్రముఖ నటుడు తంబి రామయ్య ఈ వివాహ వేడుకలో కనిపించకపోవడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. దీంతో ఐశ్వర్య, ఉమాపతి మధ్య విభేదాలు ఉన్నాయంటూ కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
అంతేకాకుండా నవంబర్‌లో ఉమాపతి పుట్టినరోజు సందర్భంగా ఐశ్వర్య సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేయకపోవడాన్ని కూడా కొందరు ప్రస్తావించారు. ఇక వాళ్ల వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయంటూ ఊహాగానాలు మొదలుపెట్టారు. దీనికి తోడు ఓ యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో అర్జున్ సర్జా ఒక ప్రకటన విడుదల చేశారు. తన చిన్న కుమార్తె వివాహ సమయంలో కుటుంబానికి ప్రేమాభిమానాలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సంతోషకరమైన సమయంలో పెద్ద కుమార్తె గురించి వివరణ ఇవ్వాల్సి వస్తుందని ఊహించలేదని పేర్కొన్నారు. ఐశ్వర్య వ్యక్తిగత విషయాలపై ఆమె అనుమతి లేకుండా తాను మాట్లాడదలుచుకోలేదని స్పష్టం చేశారు. అవసరమైతే ఆమెనే తన విషయాలను వెల్లడిస్తుందని తెలిపారు.
అయితే ఒకరి వ్యక్తిగత జీవితం గురించి ఊహాగానాలు చేయడం వేరు, ఆధారాలు లేకుండా వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేయడం వేరని అర్జున్ అన్నారు. ముఖ్యంగా ఒక మహిళను మద్యానికి బానిసగా ముద్ర వేయడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. సెలబ్రిటీలుగా ఉన్నంత మాత్రాన వారి వ్యక్తిగత జీవితాలపై ఎవరైనా ఇష్టానుసారం ఆరోపణలు చేయవచ్చని భావించకూడదని హెచ్చరించారు.
ఇప్పటివరకు ఇలాంటి విషయాలపై మౌనంగా ఉండటమే సరైన మార్గమని భావించామని, అయితే ఆ మౌనాన్ని అంగీకారంగా తీసుకోకూడదని అర్జున్ స్పష్టం చేశారు. అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై సంబంధిత అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఇకపై ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ప్రతి మహిళకు తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగా గడిపే హక్కు ఉందని, ఆమె గౌరవాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని అర్జున్ పేర్కొన్నారు.
ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రామయ్య వివాహం 2024 జూన్‌లో చెన్నైలో జరిగింది. వీరిద్దరూ 2021లో ఓ రియాలిటీ షో సందర్భంగా పరిచయమయ్యారు. 2023 అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు.
