పవన్ డిప్యూటీ CM.. విజయ్ CM.. యాక్షన్ కింగ్ అర్జున్ ఏమవుతారు?
అయితే తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ అంతగా డబ్బు ఖర్చు పెట్టకుండానే కేవలం తన ఇమేజ్‌తో సీఎం అయ్యారు కదా అని జర్నలిస్టు గుర్తు చేయగా అర్జున్ ఎంతో నిజాయితీగా సమాధానమిచ్చారు.
By: Sivaji Kontham | 25 May 2026 10:17 PM ISTదక్షిణాది చిత్ర పరిశ్రమకు.. రాజకీయాలకు ఎప్పుడూ విడదీయరాని బంధం ఉంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా గెలిచారు. తమిళనాడులో దళపతి విజయ్ ముఖ్యమంత్రి (సీఎం) పీఠాన్ని అధిరోహించారు. వారికున్న అపారమైన ఫ్యాన్ బేస్, ప్రజాదరణే వారిని చట్టసభల్లోకి నడిపించి ఈ అద్భుత విజయాలను అందించాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక మూలాలు ఉండి, కన్నడ ప్రజల్లో బోలెడంత ఫాలోయింగ్ ఉన్న యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా? ఆయన చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం ఉందా? అనే ఆసక్తికరమైన ప్రశ్న.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ నేరుగా ప్రశ్నించగా.. యాక్షన్ కింగ్ అర్జున్ తనదైన శైలిలో సరదాగా స్పందించారు. ``ఈయనకు నేను ఇలా ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేనట్టుంది!`` అంటూ నవ్వేశారు. రాజకీయ రంగ ప్రవేశంపై ఆయనకు ఎలాంటి ఆశలు లేవనే విషయాన్ని ఆ నవ్వుతోనే హింట్ ఇచ్చారు. ప్రస్తుతం అర్జున్ కేవలం నటనకే పరిమితం కాకుండా.. దర్శకుడిగా, నిర్మాతగా బహుముఖ పాత్రలను పోషిస్తూ సినీ పరిశ్రమలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. అంతేకాకుండా తన కుమార్తె ఐశ్వర్యను నటిగా ప్రమోట్ చేస్తూ.. తను ప్రధాన పాత్రధారిగా వరుస సినిమాలను నిర్మిస్తూ లైఫ్ జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు.
రాజకీయాల్లోకి రాకపోవడానికి అసలు కారణాలను అర్జున్ చాలా ఓపెన్‌గా విశ్లేషించారు. ఎవరికైనా రాజకీయాలు చేయాలంటే ఆ తపన లోపలి వైపు నుంచి బలంగా ఉండాలని.. కానీ తనకు ఆ ఆలోచనే లేదని స్పష్టం చేశారు. దాంతో పాటు ప్రాక్టికల్ రీజన్స్ కూడా చెబుతూ.. ``అయినా ఈ రోజుల్లో రాజకీయాలు చేయాలంటే చాలా డబ్బుండాలి.. నా దగ్గర అంత డబ్బు లేదు! విలువలకు తిలోదకాలివ్వలేను`` అని అర్జున్ సర్జా కుండబద్దలు కొట్టారు. నేటి ఎన్నికల రాజకీయాల్లో డబ్బు పాత్ర ఎంతగా పెరిగిపోయిందో చెప్పడానికి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఒక చేదు నిజంగా నిలుస్తాయి.
అయితే తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ అంతగా డబ్బు ఖర్చు పెట్టకుండానే కేవలం తన ఇమేజ్‌తో సీఎం అయ్యారు కదా అని జర్నలిస్టు గుర్తు చేయగా అర్జున్ ఎంతో నిజాయితీగా సమాధానమిచ్చారు. ``ఆయనకు (విజయ్‌కు) ఉన్నంత పేరు, క్రేజ్ ఇప్పుడు నాకు లేదు కదా!`` అని ఒప్పుకున్నారు. ఏ స్టార్ అయినా సరే తనకు మార్కెట్‌లో పీక్ రేంజ్ నేమ్ అండ్ ఫేమ్ ఉన్నంత కాలమే ప్రజల్లో రాజకీయాలు అయినా చెల్లుతాయనే అంతర్గత సత్యాన్ని ఆయన అంగీకరించారు. విజయ్ ప్రస్తుత క్రేజ్ వేరని.. తన సినీ కెరీర్ గ్రాఫ్ వేరని ఆయన చాలా ప్రాక్టికల్‌గా మాట్లాడారు.
కన్నడ నాట అర్జున్‌కు మంచి గుర్తింపు ఉన్నా రాజకీయాల కంటే తనకు నచ్చిన సినీ రంగాన్నే ఆయన ఉత్తమమైనదిగా భావిస్తున్నారు. పవన్ కల్యాణ్, విజయ్ లాంటి సమకాలీన స్టార్స్ రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తున్నా.. తాను మాత్రం కెమెరా వెనుక స్క్రీన్ ముందే సంతోషంగా ఉంటానని క్లియర్ కట్‌గా తేల్చిచెప్పారు. అధికార దాహం, అనవసరపు రాజకీయ వివాదాల కంటే స్వచ్ఛమైన కళారంగమే మిన్న అనే యాక్షన్ కింగ్ నిర్ణయాన్ని అభిమానులు సైతం అభినందిస్తున్నారు.
