Begin typing your search above and press return to search.

డాన్ 3 పై అర్జున్ దాస్ సంచలన వ్యాఖ్యలు!

బాలీవుడ్ దర్శకుడు ఫర్హాన్ అక్తర్ తెర‌కెక్కించాల్సిన మోస్ట్ అంటెసిపేటెడ్ ప్రాజెక్ట్ `డాన్3` ఆ మ‌ధ్య ఎంత సంచ‌ల‌న‌మైందో? తెలిసిందే.

By:  Srikanth Kontham   |   3 Oct 2026 4:00 PM IST
డాన్ 3 పై అర్జున్ దాస్ సంచలన వ్యాఖ్యలు!
X

బాలీవుడ్ దర్శకుడు ఫర్హాన్ అక్తర్ తెర‌కెక్కించాల్సిన మోస్ట్ అంటెసిపేటెడ్ ప్రాజెక్ట్ `డాన్3` ఆ మ‌ధ్య ఎంత సంచ‌ల‌న‌మైందో? తెలిసిందే. ప్రాజెక్ట్ నుంచి హీరోగా ర‌ణ‌వీర్ సింగ్ త‌ప్పుకున్న నేప‌థ్యంలో త‌లెత్తిన వివాదాలు అన్ని మీడియా సంస్థ‌ల్లో హాట్ టాపిక్ గా మారాయి. అప్ప‌టి నుంచి `డాన్ 3` పై ప్ర‌తీ అంశం అంత‌కంత‌కు ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ దాస్ ఈ సినిమాపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. `డాన్ 3` చిత్రంలో విలన్ పాత్ర కోసం ఫర్హాన్ అక్తర్ తనను సంప్రదించినట్లు అర్జున్ దాస్ అధికారికంగా ధృవీకరించారు.

ఫర్హాన్ అక్తర్‌తో జరిగిన చర్చలు నిజమేనని స్పష్టం చేశారు. `ఫర్హాన్ సర్ నుంచి నాకు కాల్ రావడం అదృష్టంగా భావించాను. మేం ఇద్దరం భేటీ అయ్యాము. సినిమా గురించి సుదీర్ఘంగా చర్చలు కూడా జరిగాయి. ఈ సినిమా నిజంగానే జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా అది కార్యరూపం దాల్చలేదు` అని అర్జున్ దాస్ పేర్కొన్నారు. అయినా? భవిష్యత్‌లో ఫర్హాన్ అక్తర్‌తో కలిసి పనిచేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప‌ర్హాన్ ట్యాలెంట్ ను కొనియాడారు. పరిశ్రమలో గొప్ప వ్యక్తులలో ప‌ర్హాన్ ఒకరని అర్జున్ అభివర్ణించారు. `డాన్ 3` లో నటించే అవకాశం చేజారినా? ఆ ప్రాజెక్ట్ కోసం జరిగిన చర్చల అనుభవాన్ని అర్జున్ సానుకూలంగా గుర్తు చేసుకున్నారు.

ప్రస్తుతం `డాన్ 3` ప్రాజెక్ట్ వివిధ కారణాల వల్ల ఆలస్యం అవుతుండటం, నటీనటుల ఎంపికలో మార్పులు చోటు చేసుకోవడం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ర‌ణ‌వీర్ సింగ్ త‌ప్పుకున్న నాటి నుంచి ఆ స్థానంలోకి ఏ హీరో వ‌స్తాడు? అన్న‌ది స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌రంగా మారింది. కొంత మంది స్టార్ హీరోల పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి గానీ ఎవ‌ర్నీ ఫైన‌ల్ చేయ‌లేదు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

ఇక అర్జున్ దాస్ వివ‌రాల్లోకి వెళ్తే.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన `ఖైదీ`, `మాస్టర్` వంటి చిత్రాల ద్వారా అర్జున్ దాస్ తనదైన గ్రే షేడ్ పాత్రలు ..బొంగురు గొంతుతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. అర్జున్ కు గల ప్రత్యేకమైన మాస్ అప్పీల్ కారణంగానే డాన్ 2 చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర కోసం మేకర్స్ సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ అనివార్య కార‌ణాల‌తో ఆ కాంబినేష‌న్ సెట్ అవ్వ‌డం లేదు.