Begin typing your search above and press return to search.

విక్ట‌రీ వెంక‌టేష్ కుమారుడు హీరోగా తెరంగేట్రం?

టాలీవుడ్ నాలుగు మూల‌స్థంభాల్లో విక్ట‌రీ వెంక‌టేష్ ఒక‌రు. మెగాస్టార్ చిరంజీవి, న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ, కింగ్ నాగార్జునల‌తో పాటు ద‌గ్గుబాటి వెంక‌టేష్ టాలీవుడ్ ని ద‌శాబ్ధాల పాటు ఏల్తున్నారు.

By:  Sivaji Kontham   |   9 Dec 2025 9:50 AM IST
విక్ట‌రీ వెంక‌టేష్ కుమారుడు హీరోగా తెరంగేట్రం?
X

టాలీవుడ్ నాలుగు మూల‌స్థంభాల్లో విక్ట‌రీ వెంక‌టేష్ ఒక‌రు. మెగాస్టార్ చిరంజీవి, న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ, కింగ్ నాగార్జునల‌తో పాటు ద‌గ్గుబాటి వెంక‌టేష్ టాలీవుడ్ ని ద‌శాబ్ధాల పాటు ఏల్తున్నారు. ప‌రిశ్ర‌మ‌కు ఈ న‌లుగురు పెద్ద హీరోలు, వారి వార‌సులు చాలా కీల‌కంగా మారారు. చిరంజీవి కుటుంబం నుంచి సుమారు డ‌జ‌ను మంది సినీప‌రిశ్ర‌మ‌కే అంకిత‌మై ప‌ని చేస్తున్నారు. వారి నుంచి నిరంత‌రం సినిమాలు రావ‌డం వ‌ల్ల వంద‌ల మందికి ఉపాధి ల‌భిస్తోంది. వేలాది మంది సినీప‌రిశ్ర‌మ‌పై ఆధార‌ప‌డి జీవించ‌డానికి టాలీవుడ్ లోని అన్ని ఫిల్మీ కుటుంబాలు స‌హ‌క‌రిస్తున్నాయి.

నంద‌మూరి కుటుంబం నుంచి ప‌లువురు స్టార్లు సినీరంగంలో ఉన్నారు. నిర్మాత‌లుగా, న‌టులుగా కొన‌సాగుతున్నారు. బాల‌కృష్ణ న‌ట‌వార‌సుడు మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ గురించి చాలా చ‌ర్చ సాగుతోంది. కింగ్ నాగార్జున న‌ట‌వార‌సులు నాగ‌చైత‌న్య‌, అఖిల్ ప‌రిశ్ర‌మ‌లో రాణిస్తున్నారు. అక్కినేని కుటుంబం నుంచి హీరోలు, నిర్మాత‌లు సినీరంగంలో కొన‌సాగుతున్నారు. అలాగే లెజెండ‌రీ నిర్మాత‌, మూవీ మొఘ‌ల్ రామానాయుడు కుటుంబం నుంచి మూడో త‌రం న‌ట‌వార‌సుల్లో ద‌గ్గుబాటి రానా త‌ప్ప ఇత‌రులు ఎవ‌రూ లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

రామానాయుడు పెద్ద కుమారుడు డి.సురేష్ బాబు స్టూడియో య‌జ‌మానిగా, అగ్ర నిర్మాత కం పంపిణీదారుగా, ఎగ్జిబిట‌ర్ గా ప‌రిశ్ర‌మ‌ను శాసిస్తున్నారు. మ‌రో కుమారుడు వెంక‌టేష్ హీరోగా అజేయ‌మైన కెరీర్ ని కొన‌సాగిస్తున్నారు. డి.సురేష్ బాబు కుమారుడు ద‌గ్గుబాటి రానా హీరోగా, నిర్మాత‌గా లెగ‌సీని న‌డిపిస్తున్నా కానీ, విక్ట‌రీ వెంక‌టేష్ న‌ట‌వార‌స‌త్వం ప‌రిశ్ర‌మ‌లోకి వ‌స్తుందా లేదా? అన్న‌దానిపై ఇంకా స్ప‌ష్ఠ‌త లేదు. డి. సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ ద‌గ్గుబాటి తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టించినా అది ఫ్లాప‌వ్వ‌డంతో ఆ త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉన్నారు.

ప్ర‌స్తుతం వెంక‌టేష్ న‌ట‌వార‌స‌త్వంపై అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. ద‌గ్గుబాటి వంశ లెగ‌సీని ముందుకు న‌డిపించ‌డానికి వెంకీ కుమారుడు అర్జున్ న‌ట‌న‌లోకి వ‌స్తారా? అంటూ మీడియాలో సందేహాలున్నాయి. ఇదే విష‌యాన్ని తాజా ఇంట‌ర్వ్యూలో డి.సురేష్ బాబును ప్ర‌శ్నించ‌గా, దానికి ఆయ‌న ఇచ్చిన జ‌వాబు ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ప్ర‌స్తుతం అర్జున్ అమెరికాలో ఉన్నాడు.. బాగా చ‌దువుకుంటున్నాడు! అని మాత్ర‌మే ముక్త‌స‌రిగా స‌మాధాన‌మిచ్చారు. ఒక‌వేళ అమెరికాలో స్ట‌డీస్ పూర్త‌య్యాక‌, ఘ‌ట్ట‌మ‌నేని కృష్ణ న‌ట‌వార‌సుడు మ‌హేష్ బాబు త‌ర‌హాలోనే అర్జున్ కూడా హీరోగా ఆరంగేట్రం చేస్తాడా అన్న‌ది వేచి చూడాలి.

వెంకటేష్ కుమారుడు అర్జున్ దగ్గుబాటి ప్రస్తుతం అమెరికాలో చదువుతున్నాడు. సినిమాలపై మక్కువ కలిగి ఉన్నాడు... అర్జున్ చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేయడానికి ఆస‌క్తిగానే ఉన్నాడని వెంకటేష్ గ‌తంలో తెలిపారు.

అన్‌స్టాపబుల్ విత్ NBK షో సందర్భంగా, విక్టరీ వెంకటేష్ తన జీవితం, కెరీర్ పిల్ల‌ల‌ గురించి మాట్లాడారు. ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న తన 21 ఏళ్ల కుమారుడు అర్జున్ గురించి మాట్లాడుతూ.. ప్ర‌తిసారీ ప్ర‌జ‌ల నుంచి ఒక‌ ప్ర‌శ్న ఎదుర‌వుతుంది... అర్జున్ న‌ట‌నా కెరీర్ గురించి... అతడు చదువు పూర్తి చేసి తన ఉపాధి మార్గాన్ని ఎంచుకున్న తర్వాత, విధి దాని మార్గం వైపు న‌డిపిస్తుంద‌ని వెంకీ అన్నారు. ఏం జరిగినా అది అతడి కోరికలకు అనుగుణంగా ఉంటుంది! అని తెలిపారు. సినిమాల‌పై అర్జున్ కి స్వ‌త‌హాగానే ఆస‌క్తి ఉంద‌ని అన్నారు.