Begin typing your search above and press return to search.

న‌టితో ఎఫైర్.. ఆధారం లేని వార్త‌లు రాసిన మీడియాకు గట్టి కౌంట‌ర్!

సినీ, టీవీ రంగాల్లో సెలబ్రిటీల మధ్య ఉండే స్నేహబంధాలను రొమాంటిక్ రిలేషన్స్‌గా చిత్రీకరించడం సోషల్ మీడియా యుగంలో నిత్యకృత్యంగా మారిపోయింది.

By:  Sivaji Kontham   |   18 July 2026 7:47 PM IST
న‌టితో ఎఫైర్.. ఆధారం లేని వార్త‌లు రాసిన మీడియాకు గట్టి కౌంట‌ర్!
X

సినీ, టీవీ రంగాల్లో సెలబ్రిటీల మధ్య ఉండే స్నేహబంధాలను రొమాంటిక్ రిలేషన్స్‌గా చిత్రీకరించడం సోషల్ మీడియా యుగంలో నిత్యకృత్యంగా మారిపోయింది. తాజాగా ప్రముఖ టెలివిజన్ నటుడు అర్జున్ బిజ్లానీ.. తన లాంగ్ టైమ్ ఫ్రెండ్ మౌనీ రాయ్‌తో తనకు ముడిపెడుతూ వస్తున్న రూమర్లపై తీవ్రంగా స్పందించారు. ఈ వార్తలను పూర్తిగా బేస్‌లెస్ అని కొట్టిపారేసిన ఆయన.., కేవలం వ్యూస్ - క్లిక్స్ కోసం 15 ఏళ్ల పవిత్రమైన స్నేహ బంధాన్ని తప్పుగా చిత్రీకరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై కథనాలు రాసేటప్పుడు మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు.

ఈ గాసిప్స్‌పై అర్జున్ బిజ్లానీ స్పందిస్తూ.. బాధ్యతాయుతమైన జర్నలిజం అనేది నమ్మకాన్ని పెంచుతుంది.. కానీ క్లిక్‌బైట్ -కేవలం క్లిక్కుల కోసం పెట్టే థంబ్‌నైల్స్, టైటిల్స్ వార్తలు నమ్మకాన్ని పోగొడుతాయి! అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎలాంటి నిజాలు తెలుసుకోకుండా.. కేవలం ఊహాగానాలతో తప్పుడు కథనాలను ప్రచురించే ముందు కనీస నిజాలను వెరిఫై చేసుకోవాలని మీడియా సంస్థ‌ల‌ను కోరారు. రూమర్లపై అర్జున్ అంత ఓపెన్‌గా.. ధైర్యంగా స్పందించి మీడియాకు చురకలు అంటించిన విధానాన్ని ఆయన అభిమానులు ఎంతో అభినందిస్తున్నారు. హానెస్ట్ జర్నలిజం కోసం అత‌డు గొంతు విప్పడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఇష్యూపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. 21వ శతాబ్దంలో ఉన్నా ఇంకా సమాజంలో ఒక స్త్రీ - పురుషుడి మధ్య ఉండే ప్యూర్ ఫ్రెండ్‌షిప్‌ను అర్థం చేసుకోలేని సంకుచిత మానసిక స్వ‌భావం ఇంకా కొనసాగుతుండటం విచారకరమని పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఒకరితో ఒకరు క్లోజ్‌గా ఉన్నంత మాత్రాన... నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన వారి మధ్య అక్రమ సంబంధం ఉందన్నట్లుగా ప్రచారం చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో.. వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటి రూమర్లు వారిని మరింత మానసిక క్షోభకు గురిచేస్తాయని సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది.

అర్జున్ బిజ్లానీ, మౌనీ రాయ్ ఇద్దరూ బుల్లితెరపై ఎన్నో సూపర్ హిట్ ప్రాజెక్ట్స్‌లో కలిసి నటించారు. కెరీర్ ప్రారంభం నుండి ఇండస్ట్రీలో ఒకరికొకరు సపోర్ట్‌గా ఉంటూ బెస్ట్ ఫ్రెండ్స్‌గా కొనసాగుతున్నారు. ఒక బలమైన స్నేహ బంధం .. ఒకరిపై ఒకరికి ఉండే గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటాయని.. వాటిని తప్పుడు కోణంలో చూడటం ఆపాలని అభిమానులు కోరుతున్నారు. అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ మీడియా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారడమే కాకుండా... క్లిక్స్ కోసం సెలబ్రిటీల జీవితాలతో ఆడుకునే కొన్ని వెబ్‌సైట్ల ధోరణిని ఎండగట్టేలా ఉన్నాయి.

ఎంతటి సెలబ్రిటీలైనా సరే.. వారి ప్రైవసీని.. స్నేహాలను గౌరవించాల్సిన కనీస బాధ్యత సమాజానికి, మీడియాకు ఉంటుంది. ఈ రూమర్లకు అర్జున్ బిజ్లానీ పెట్టిన ఫుల్‌స్టాప్‌తోనైనా ఇలాంటి అసత్య ప్రచారాలు ఆగుతాయని ఆశిద్దాం. ఫ్రెండ్‌షిప్ విలువ తెలియని ఈ తరం సోషల్ మీడియా కల్చర్‌లో అర్జున్ ఇచ్చిన ఈ క్లారిటీ ఒక మంచి మార్పుకు కారణం కావాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.