అక్క లక్కీ హీరోయిన్.. మరి తమ్ముడు?
ఇప్పుడు దర్శకుడు శంకర్ కుటుంబంలో అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇప్పటికే చిన్న కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుని లక్కీ బ్యూటీగా పేరు సంపాదించగా.. ఇప్పుడు కొడుకు అర్జిత్ శంకర్ హీరోగా ఎంట్రీ ఇవ్వడంతో ఆసక్తికర చర్చ మొదలైంది.
By: M Prashanth | 19 Jun 2026 8:00 AM ISTసినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, దర్శకుల వారసులు ఎంట్రీ ఇవ్వడం కొత్త విషయం కాదు. అయితే ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన వారసుల్లో ఒకరు సక్సెస్ అయితే, మిగిలిన వారిపై అంచనాలు పెరగడం సహజం. ఇప్పుడు దర్శకుడు శంకర్ కుటుంబంలో అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇప్పటికే చిన్న కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుని లక్కీ బ్యూటీగా పేరు సంపాదించగా.. ఇప్పుడు కొడుకు అర్జిత్ శంకర్ హీరోగా ఎంట్రీ ఇవ్వడంతో ఆసక్తికర చర్చ మొదలైంది.
అయితే శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య శంకర్ మెడిసిన్ పూర్తి చేసి సినిమాలకు దూరంగా ఉన్నారు. కానీ చిన్న కూతురు అదితి శంకర్ మాత్రం తన కెరీర్ ను పూర్తిగా సినిమాల వైపే తీసుకొచ్చారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత సినిమాలపై ఉన్న ఆసక్తితో హీరోయిన్ గా పరిచయమయ్యారు. కార్తీ హీరోగా తెరకెక్కిన విరుమాన్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన అదితి, తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఆ సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించడంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత శివకార్తికేయన్ హీరోగా నటించిన మావీరన్ లో కనిపించారు. ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ సాధించింది. యాక్టింగ్ తోపాటు సింగర్ గా కూడా ఆమె తన టాలెంట్ ను చాటుకున్నారు. కొన్ని చిత్రాల్లో పాటలు పాడి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం తమిళంలో పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల తెలుగులో భైరవం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇక్కడ కూడా గుర్తింపు పొందారు.
ఇక ఇప్పుడు అదే కుటుంబం నుంచి మరో వారసుడు సినీ రంగంలోకి అడుగు పెడుతున్నారు. అర్జిత్ శంకర్ అమెరికాలో ఫిల్మ్ మేకింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. చాలా కాలంగా ఆయన సినీ ఎంట్రీపై ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే తాజాగా ఆ ప్రచారానికి చెక్ పెట్టి హీరోగా తన తొలి సినిమాను అధికారికంగా ప్రారంభించారు. అర్జిత్ నటిస్తున్న తొలి చిత్రానికి లవర్ బాయ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
ఆ సినిమాకు అట్లీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అశోక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. యూత్ ఫుల్ యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమా స్టార్ట్ కావడంతో ఇప్పుడు ఒకే చర్చ వినిపిస్తోంది. అక్క అదితి శంకర్ కెరీర్ ప్రారంభంలోనే హిట్లు అందుకుని లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. మరి తమ్ముడు అర్జిత్ కూడా అదే రేంజ్ లో హిట్స్ అందుకుంటారా? అనే ప్రశ్న ఆసక్తి రేకెత్తిస్తోంది.
అయితే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అవకాశాలు తెచ్చిపెట్టొచ్చు. కానీ సక్సెస్ ను మాత్రం ప్రేక్షకులే నిర్ణయిస్తారు. అదితి తన టాలెంట్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించినట్లే, అర్జిత్ కూడా యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించాల్సి ఉంటుంది. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంటారా? లేక మరికొంత సమయం తీసుకుంటాడా? అనేది చూడాలి. ప్రస్తుతం మాత్రం అక్క లక్కీ హీరోయిన్.. మరి తమ్ముడు? అనే ప్రశ్నకు సమాధానం అంతా ఎదురుచూస్తున్నారు.
