షూటింగ్ పేరుతో అక్రమంగా దేశాలే దాటించేసారే!
హాలీవుడ్ చరిత్రలో ఓ సినిమా కేవలం వినోదం కోసమే కాదు. ప్రాణాలను కాపాడే ఆయుధాలుగా కూడా మారాయి అన్నది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By: Srikanth Kontham | 7 April 2026 9:15 AM ISTహాలీవుడ్ చరిత్రలో ఓ సినిమా కేవలం వినోదం కోసమే కాదు. ప్రాణాలను కాపాడే ఆయుధాలుగా కూడా మారాయి అన్నది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దశాబ్దాల క్రితం ఇరాన్‌లో చిక్కుకుపోయిన అమెరికన్ దౌత్యవేత్తలను రక్షించడానికి `ఆర్గో` అనే ఒక నకిలీ సైన్స్ ఫిక్షన్ సినిమాను సృష్టించి ప్రపంచాన్నే తలకిందులు చేసిన సాహసోపేతమైన ఆపరేషన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ యథార్థ గాథ ఆధారంగానే బెన్ అఫ్లెక్ దర్శకత్వంలో తెరకెక్కిన `ఆర్గో`ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది.
1979లో ఇరాన్ విప్లవం సమయంలో టెహ్రాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై నిరసనకారులు దాడి చేసినప్పుడు ఆరుగురు దౌత్యవేత్తలు తప్పించుకుని కెనడా రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారు. వారిని సురక్షితంగా దేశం దాటించడం అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ కి సవాలుగా మారింది. అప్పుడే సీఐఏ అధికారి టోనీ మెండెజ్ ఓ అద్భుతమైన ప్లాన్ వేశారు. ఇరాన్‌లో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా షూటింగ్ చేయడానికి వెళ్తున్న చిత్ర బృందంగా ఆ దౌత్యవేత్తలను నమ్మించి దేశం దాటించాలని నిర్ణయించారు.
ఈ ఆపరేషన్ కోసం హాలీవుడ్‌లో నిజంగానే ఒక ప్రొడక్షన్ ఆఫీస్‌ను తెరిచి `ఆర్గో` అనే సినిమా తీస్తున్నట్లు ప్రకటనలు ఇచ్చారు. ఆ సినిమా స్క్రిప్ట్, స్టోరీ బోర్డ్స్ , కాన్సెప్ట్ ఆర్ట్స్ కూడా సిద్ధం చేశారు. ఇరాన్ అధికారులను నమ్మించడానికి ట్రేడ్ మ్యాగజైన్లలో ప్రకటనలు కూడా ఇచ్చారు. ఈ సినిమా కోసం లోకేషన్ల వేటలో ఉన్న కెనడియన్ ఫిల్మ్ క్రూ గా దౌత్యవేత్తలకు నకిలీ పాస్‌పోర్టులు , ఐడెంటిటీ కార్డులను సృష్టించారు.ఈ ప్లాన్ అమలు చేయడం అంత సులభం కాదు. ఇరాన్ భద్రతా దళాల కళ్లు గప్పి విమానాశ్రయం దాటడం అత్యంత ప్రమాదకరమైన పని.
ప్రతి దౌత్యవేత్తకు తమ నకిలీ సినిమా పాత్రల గురించి పూర్తి అవగాహన కల్పించి వారిని నటులుగా , సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దారు. చివరి నిమిషం వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఆపరేషన్‌లో నకిలీ సినిమా బృందంగా నటించిన ఆరుగురు దౌత్యవేత్తలు ఇరాన్ సరిహద్దులు దాటి సురక్షితంగా స్విట్జర్లాండ్ చేరుకున్నారు.
చరిత్రలో నిలిచిపోయిన ఈ క్లాసిఫైడ్ ఆపరేషన్ 1997 వరకు బయటి ప్రపంచానికి తెలియదు. అప్పటి వరకు ఇది ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఆ తర్వాత టోనీ మెండెజ్ ఈ రహస్యాన్ని బయటపెట్టడంతో ప్రపంచం మొత్తం హాలీవుడ్ సృష్టించిన నకిలీ సినిమా మాయాజాలానికి ఫిదా అయింది.
ప్రాణాలను కాపాడటానికి ఒక సినిమాను సాకుగా చూపడం అనేది గూఢచారి చరిత్రలోనే అత్యంత సృజనాత్మకమైన ఆలోచనగా నిలిచిపోయింది. నేటికీ `ఆర్గో` కథ వింటుంటే ఏదో త్రిల్లర్ సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఒక నకిలీ సైన్స్ ఫిక్షన్ సినిమా నిజ జీవితంలో హీరోలను సృష్టించి మృత్యువు అంచున ఉన్నవారిని రక్షించడం అసాధారణమైన విషయం. హాలీ వుడ్ మేకింగ్ స్టైల్ , సీఐఏ గూఢచారి నైపుణ్యం కలిస్తే ఎంతటి అసాధ్యమైన పనినైనా సుసాధ్యం చేయోచ్చని ఈ సంఘటన నిరూపించింది.
