రెహమాన్.. మరకలు చెరిగిపోతాయా?
ఎట్టకేలకు ఇప్పుడు ‘పెద్ది’ సినిమాతో రెహమాన్ రీఎంట్రీ ఇస్తున్నాడు. రెహమాన్ స్టార్ స్టేటస్ సంపాదించాక ఒక తెలుగు దర్శకుడు తీస్తున్న తెలుగు సినిమాకు సంగీతం అందించడం ఇదే తొలిసారి.
By: Garuda Media | 26 Nov 2025 1:00 AM ISTఏఆర్ రెహమాన్ మూడు దశాబ్దాలుగా పైగా భారతీయ సంగీతాన్ని ముందుకు నడిపిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్. 90వ దశకంలో ‘రోజా’ మూవీతో తన ఆగమనాన్ని ఘనంగా చాటిన రెహమాన్.. ఆ తర్వాతి రెండు దశాబ్దాల్లో అనేక అద్భుతమైన ఆల్బమ్స్ అందించారు. ఇండియన్ ఫిలిం మ్యూజిక్‌ను ఆయన అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాడు. ఐతే ఇటు తమిళంలో, అటు హిందీలో రెహమాన్‌కు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఆయన సంగీతం హిట్ అవడమే కాక.. సినిమాలూ తిరుగులేని విజయాలందుకున్నాయి. కానీ తెలుగులో మాత్రం రెహమాన్‌కు ప్రతిసారీ చేదు అనుభవమే ఎదురైంది. ఇప్పటిదాకా ఆయనకు తెలుగులో పెద్ద హిట్ అంటూ ఒక్కటి లేదు అంటే ఆశ్చర్యం కలగక మానదు.
90వ దశకంలో సూపర్ పోలీస్, గ్యాంగ్ మాస్టర్ లాంటి చిత్రాలకు ఆయన సంగీతం అందించాడు. అవి రెండూ ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్య తెలుగులో తెరకెక్కించిన నాని, పులి చిత్రాలకు రెహమాన్ మ్యూజిక్ చేశాడు. ఈ రెండు ఆల్బమ్స్ హిట్టయ్యాయి. కానీ సినిమాలు మాత్రం డిజాస్టర్లే. తర్వాత రెహమాన్ గౌతమ్ మీనన్ తీసిన ‘ఏమాయ చేసావె’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రాలకు మ్యూజిక్ అందించాడు. ‘ఏమాయ చేసావె’ ఎవర్ గ్రీన్ ఆల్బంగా పేరు తెచ్చుకుంది.
కానీ సినిమా యావరేజ్‌గా ఆడింది. ‘సాహసం శ్వాసగా సాగిపో’లో కూడా పాటలు ఆకట్టుకున్నాయి. కానీ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ‘సైరా’ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ చేయాల్సింది. కానీ కుదరలేదు. ఎట్టకేలకు ఇప్పుడు ‘పెద్ది’ సినిమాతో రెహమాన్ రీఎంట్రీ ఇస్తున్నాడు. రెహమాన్ స్టార్ స్టేటస్ సంపాదించాక ఒక తెలుగు దర్శకుడు తీస్తున్న తెలుగు సినిమాకు సంగీతం అందించడం ఇదే తొలిసారి. ఇందులోంచి రిలీజైన ఫస్ట్ గ్లింప్స్, తొలి పాట (చికిరి) అద్భుతమైన స్పందన తెచ్చుకున్నాయి. రెంటిలోనూ మ్యూజిక్ అదిరిపోయింది.
ఐతే కేవలం ఆల్బంతో హిట్టు కొట్టడమే కాక.. ఈసారి సినిమాతోనూ హిట్ అందుకుని గత మరకలన్నీ రెహమాన్ చెరిపేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
