Begin typing your search above and press return to search.

సౌండ్ హీలింగ్ డోమ్: సంగీతంతో రోగులకు చికిత్స చేసే రెహమాన్ అద్భుత సృష్టి

కేరళలోని కాలికట్‌లో సంగీతానికీ, వాస్తుశిల్పానికీ ఉన్న అనుబంధాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద `సౌండ్ హీలింగ్ డోమ్` సిద్ధమైంది.

By:  Sivaji Kontham   |   12 April 2026 6:00 AM IST
సౌండ్ హీలింగ్ డోమ్: సంగీతంతో రోగులకు చికిత్స చేసే రెహమాన్ అద్భుత సృష్టి
X

కేరళలోని కాలికట్‌లో సంగీతానికీ, వాస్తుశిల్పానికీ ఉన్న అనుబంధాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద `సౌండ్ హీలింగ్ డోమ్` సిద్ధమైంది. మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ పర్యవేక్షణలో రూపొందిన ఈ వినూత్న నిర్మాణం.. కేవలం ఒక కట్టడంగా మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి చికిత్స అందించే ఒక ఔషధశాలగా ప్రాచుర్యం పొందుతోంది. కాలికట్‌లోని `ది గ్రేట్ సెల్ఫ్ రిట్రీట్ సెంటర్‌`లో నిర్మించిన ఈ డోమ్.. శబ్దం ద్వారా మనిషి మనస్సును, శరీరాన్ని ఎలా పునరుజ్జీవింపజేయవచ్చో ప్రపంచానికి చాటిచెబుతోంది.

ఈ ప్రాజెక్ట్ వెనుక రెహమాన్ దార్శనికత ఎంతో గొప్పది. సంగీతం అంటే కేవలం వినోదం మాత్రమే కాదని.. అది ఒక హీలింగ్ థెరపీలా పనిచేయాలని ఆయన భావించారు. ఈ డోమ్ అకౌస్టిక్ ఇంజనీరింగ్‌ను రెహమాన్ స్వయంగా పర్యవేక్షించి లోపల కూర్చున్న ప్రతి ఒక్కరికీ శబ్దం సమానంగా స్పష్టంగా వినిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అత్యాధునిక సౌండ్ సిస్టమ్స్.. సహజమైన ప్రకంపనలు కలిసి సందర్శకులకు ఒక విభిన్నమైన ధ్యాన అనుభవాన్ని అందిస్తాయి.

ఈ డోమ్ నిర్మాణ శైలి ఒక భారీ గోళాకారంలో ఉండి లోపల ఉత్పన్నమయ్యే ధ్వని తరంగాలు బయటకు పోకుండా.. బాహ్య శబ్దాలు లోపలికి రాకుండా ప్రత్యేక ఇన్సులేషన్ గోడలతో రూపొందించారు. శబ్దం లోపల ప్రతిధ్వనించే విధానం వల్ల అది శరీరంలోని చక్రాలను ప్రేరేపిస్తుందని తద్వారా తీవ్రమైన ఒత్తిడి, యాంగ్జైటీ వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రక్రియలో లైటింగ్ - విజువల్స్ కూడా ధ్వనికి అనుగుణంగా మారుతూ ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తాయి.

విశ్వంలోని శూన్యం, నాదం అనే అంశాల నుండి స్ఫూర్తి పొంది రూపొందించిన ఈ డోమ్ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించ‌డం ఆస‌క్తిక‌రం. స్థానిక కళాకారులు, అంతర్జాతీయ ఇంజనీర్ల సమన్వయంతో రూపొందిన ఈ కట్టడం ఒకేసారి వందలాది మందికి చికిత్స అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ నిర్మాణ సవాళ్లను అధిగమిస్తూ ఎక్కడా శబ్దం వక్రీకరణ కాకుండా అత్యంత సహజమైన రీతిలో శబ్దాన్ని వినేలా దీనిని తీర్చిదిద్దడం విశేషం.

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత కోసం వెతుకుతున్న వారికి ఈ సౌండ్ హీలింగ్ డోమ్ ఒక వరంలా మారింది. కేవలం పర్యాటక ఆకర్షణగానే కాకుండా భవిష్యత్తులో `హీలింగ్ ఆర్కిటెక్చర్`కు ఇది ఒక ఆదర్శంగా నిలవనుంది. ఆర్కిటెక్చర్ - మ్యూజిక్ కలయికతో రూపొందిన ఈ అద్భుత సృష్టి.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో ఇటువంటి కేంద్రాల ఏర్పాటుకు మార్గదర్శకంగా నిలుస్తుందని రెహమాన్ ఆకాంక్షిస్తున్నారు.