Begin typing your search above and press return to search.

చెన్నైలో కారు ప్రమాదం: గాయాలతో బయటపడిన AR రెహమాన్ కుమారుడు

ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ కుమారుడు, యువ గాయకుడు ఎ.ఆర్. అమీన్ చెన్నైలో జరిగిన ఒక కారు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

By:  Sivaji Kontham   |   10 Aug 2026 11:46 PM IST
చెన్నైలో కారు ప్రమాదం: గాయాలతో బయటపడిన AR రెహమాన్ కుమారుడు
X

ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ కుమారుడు, యువ గాయకుడు ఎ.ఆర్. అమీన్ చెన్నైలో జరిగిన ఒక కారు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సోమవారం తెల్లవారుజామున ఆయన ప్రయాణిస్తున్న లగ్జరీ కారు మరొక క్యాబ్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు -అధికారులు స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని సమాచారం.

ఈ ప్రమాద వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ రోడ్డులో గిండి వైపు అమీన్ తన స్నేహితుడితో కలిసి ప్రయాణిస్తున్నారు. ఒలింపియా టెక్ పార్క్ సమీపంలో ఒక పక్క వీధి నుంచి ప్రధాన రహదారిపైకి హఠాత్తుగా వచ్చిన క్యాబ్‌ను అమీన్ ప్రయాణిస్తున్న వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రభావానికి రెండు వాహనాలు దెబ్బతినగా..కారులోని అమీన్ , ఆయన స్నేహితుడికి స్వల్పంగా దెబ్బలు తగిలాయి.

ప్రమాదం జరిగిన వెంటనే అమీన్ ..అత‌డి స్నేహితుడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారిని పరీక్షించి, ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం డిశ్చార్జ్ చేశారు. మరోవైపు క్యాబ్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి కూడా స్వల్ప గాయాలవ్వడంతో అతడిని కలైజ్ఞర్ శతాబ్ది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సంఘటనపై అడ్యార్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ వింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించింది. తెల్లవారుజామున రోడ్డుపై రద్దీ తక్కువగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో అతివేగం ఏమైనా కారణమా లేదా సిగ్నల్ వైఫల్యమా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. లొకేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రమాదానికి గల క‌చ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంగీత ప్రపంచంలో తన తండ్రి ఎ.ఆర్. రెహమాన్ వారసత్వాన్ని కొనసాగిస్తున్న అమీన్... ప్లేబ్యాక్ సింగర్‌గా పలు సూపర్ హిట్ పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి అమీన్ సురక్షితంగా ఇంటికి చేరుకోవడంతో అభిమానులు, సంగీత ప్రియులు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.