రెహ్మాన్ ది గ్రేట్: కాలపరీక్షను తట్టుకుని క్రాఫ్ట్‌లో సత్తా చాటేవాడే సిసలైన క్రియేటర్!
‘రాక్‌స్టార్’ సినిమా సంగీతం నచ్చలేదనే కారణంతో నిర్మాత తన పారితోషికాన్ని ఎనిమిది నెలల పాటు నిలిపివేసినట్లు ఏఆర్ రెహమాన్ వెల్లడించారు. అయితే అదే ఆల్బమ్‌లోని ‘కున్ ఫాయా కున్’, ‘సద్దా హక్’, ‘నాదాన్ పరిందే’, ‘తుమ్ హో’ పాటలు తర్వాత భారీ విజయాన్ని సాధించి క్లాసిక్స్‌గా నిలిచాయి.
By: Sivaji Kontham | 29 Nov 2026 4:29 PM ISTరాక్‌స్టార్ సంగీతం నచ్చలేదన్న కారణంతో నిర్మాత ఎనిమిది నెలల పాటు పారితోషికం నిలిపివేసినట్లు ఏ.ఆర్. రెహమాన్ చెప్పిన విషయం సినీ పరిశ్రమలో క్రియేటివ్ డిఫరెన్సెస్.. బిజినెస్ కోణాలను బహిర్గతం చేస్తుంది. నిర్మాతలు తొలుత సంగీతంపై అసంతృప్తి వ్యక్తం చేయడం.. బాణీలను ప్రశ్నించడం .. ప్రాజెక్టును ఆలస్యం చేయడం వంటి పరిస్థితులు భారతీయ సినీ చరిత్రలో కొన్నిసార్లు కనిపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత అదే సంగీతం ప్రేక్షకులను ఉర్రూతలూగించి.. క్లాసిక్‌గా నిలిచిన ఉదాహరణలు సినీ వర్గాల్లో తరచూ ప్రస్తావనకు వస్తుంటాయి.
సంగీత దర్శకులకు పారితోషికం డిలే చేయడం.. ఆర్థిక ఒత్తిళ్లు ఎదురవడం వెనుక తరచుగా బడ్జెట్ సమస్యలు- ప్రాజెక్ట్ ఆలస్యాలు- డిస్ట్రిబ్యూషన్ లెక్కలు లేదా క్రియేటివ్ అసంతృప్తి వంటి కారణాలు ఉంటాయి. కొందరు నిర్మాతలు ట్యూన్లు విన్న వెంటనే అవి మాస్‌కు కనెక్ట్ అవుతాయా లేదా అన్న సందేహంతో పెదవి విరిచిన సందర్భాలు ఉన్నా.. ప్రతిసారీ పారితోషికాన్ని అదే కారణంతో నిలిపివేయడం అనేది అందరి విషయంలోనూ ఒకేలా జరగదు. అయినా తొలుత సంగీతంపై వచ్చిన అభ్యంతరాలు.. అనుమానాలకు భిన్నంగా.. విడుదల తర్వాత ఆ పాటలు- నేపథ్య సంగీతం భారీ విజయాన్ని అందుకున్న ఘటనలు సంగీత ప్రపంచంలో ఎన్నో ఆసక్తికర కథలుగా నిలిచాయి.
అటువంటి సందర్భాల్లో `రాక్‌స్టార్` ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎందుకంటే తొలుత నిర్మాతకు నచ్చలేదని చెప్పిన ఆల్బమ్‌లోని కున్ ఫాయా కున్, సద్దా హక్, నాదాన్ పరిందే, తుమ్ హో వంటి పాటలు ఆ తర్వాత చరిత్ర సృష్టించాయి. అలాగే ఎన్నో హిట్ సినిమాల్లో తొలుత మేకర్స్‌కు భిన్నంగా అనిపించిన కొన్ని ప్రయోగాత్మక ట్యూన్లు.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్లు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆల్బమ్‌లు ప్రేక్షకుల ఆదరణతో అద్భుత విజయాలు సాధించాయి. సృజనాత్మకతను వెంటనే అంచనా వేయలేకపోవడం వల్ల వచ్చే ఇలాంటి పొరపాట్లు.. కాలక్రమేణా సంగీత దర్శకుడి విజన్‌ను మరింత స్పష్టంగా నిరూపిస్తాయి.
`రాక్‌స్టార్` ఘటన ద్వారా రెహమాన్ షేర్ చేసిన అనుభవం కేవలం ఒక పారితోషికం డిలే అనే సమస్య ఒక్కటే కాదు ఒక కళాకారుడు తన క్రాఫ్ట్‌పై ఉంచిన నమ్మకానికి- నిబద్ధతకు నిదర్శనం. విమర్శలు లేదా సందేహాలు ఎదురైనా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే కాలమే అసలైన సమాధానం చెబుతుందనే విషయాన్ని ఈ తరహా ఘటనలు గుర్తుచేస్తాయి. ఏ.ఆర్.రెహమాన్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కాలపరీక్షకు ఎదురొడ్డి ఎదిగిన ప్రతిభావంతుడు. అతడిని స్ఫూర్తిగా తీసుకుని యువతరం ఎదగాల్సి ఉంటుంది.
