Begin typing your search above and press return to search.

పెద్ది సీక్రెట్ వెప‌న్ అత‌నేనా?

రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది ప్రీమియర్ షోలతో ప్రేక్షకుల ముందుకు రావ‌డానికి సిద్ధ‌మైంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   3 Jun 2026 2:00 PM IST
పెద్ది సీక్రెట్ వెప‌న్ అత‌నేనా?
X

రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది ప్రీమియర్ షోలతో ప్రేక్షకుల ముందుకు రావ‌డానికి సిద్ధ‌మైంది. మ‌రికొన్ని గంట‌ల్లో పెద్ది బాక్సాఫీస్ వ‌ద్ద హంగామా సృష్టించ‌బోతున్నాడు. అయితే ప్రస్తుతం సినీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్న డిస్క‌ష‌న్ ఏఆర్ రెహ్మాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించే. గ్రామీణ నేపథ్యంతో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన పెద్ది మూవీ స‌క్సెస్‌ను నిర్ణయించడంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషించబోతోందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

ముఖ్యంగా 1990ల కాలం నాటి పల్లెటూరి వాతావరణాన్ని తెరపై చూపిస్తూ, అదే సమయంలో నేటి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఆధునిక సౌండ్ డిజైన్‌ను అందించాలనే డైరెక్ట‌ర్ బుచ్చిబాబు ఆలోచ‌నే ఆలోచనే పెద్ది సంగీతాన్ని ప్రత్యేకంగా నిలబెట్టిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. స్పోర్ట్స్ డ్రామాల విషయంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రభావం ఎంత ముఖ్యమో గతంలో ఎన్నో సినిమాలు నిరూపించాయి. ఆటలోని ఉత్కంఠ, ఆటగాడి భావోద్వేగాలు, విజయానికి చేసే పోరాటం వంటి అంశాలను ప్రేక్షకుడి హృదయానికి చేరవేయడంలో సంగీతం ప్రధాన పాత్ర పోషిస్తుంది.

అందుకే పెద్ది విషయంలో కూడా పాటల కంటే ఎక్కువగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై అంద‌రి దృష్టి కేంద్రీకృతమైంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ మంచి రెస్పాన్స్ రావడం టీమ్ కు తొలి విజయాన్ని అందించినప్పటికీ, అసలు పరీక్ష మాత్రం థియేటర్లలోనే ఉండబోతోంది. మ్యాచ్ సీన్స్, ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు, రామ్ చరణ్ క్యారెక్ట‌ర్ తాలూకా ఎలివేషన్స్ వంటి కీలక క్షణాల్లో రెహ్మాన్ స్కోర్ ఎలా పనిచేస్తుందన్న ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. ఒక స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకుడిలో స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూస్తున్న అనుభూతిని కలిగించాలంటే సంగీతం బలంగా నిలవాల్సిందే. ఈ విషయంలో రెహ్మాన్ గతంలో ఎన్నోసార్లు తన టాలెంట్ ను నిరూపించుకున్నారు.

అయితే పెద్ది విషయంలో అంద‌రినీ మ‌రింత ఎగ్జైట్ చేస్తున్న అంశం డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా, రెహ‌మాన్‌పై, ఆయ‌న మ్యూజిక్ పై చూపిస్తున్న నమ్మకం. సినిమా కథ 90ల‌ నేపథ్యంలో సాగుతున్నప్పటికీ, సంగీతం మాత్రం పూర్తిగా పాతకాలపు ధోరణిలో కాకుండా, నేటి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఉండాలని ఆయన కోరుకున్నట్లు సమాచారం. గ్రామీణ భావోద్వేగాలకు ఆధునిక సౌండ్‌ను జోడించడం అంత సులభమైన పని కాదు. కానీ అదే రెహ్మాన్ ప్రత్యేకత కూడా. స్థానిక సంస్కృతి, పల్లెటూరి ఆత్మను కోల్పోకుండా గ్లోబల్ స్థాయి సౌండ్‌ను అందించగలిగే సంగీత దర్శకుల్లో ఆయన ముందుంటారు. ఈ నేప‌థ్యంలో పెద్ది కోసం రెహ్మాన్‌ను ఎంచుకోవడం వెనుక బుచ్చిబాబు ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది. డైరెక్ట‌ర్ పలుమార్లు ఈ సినిమాకు సంగీతం మరో స్థాయిని తీసుకెళ్లిందనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఇప్పుడు అందరి దృష్టి థియేటర్లలో వినిపించే ఆ స్కోర్‌పైనే ఉంది. ఒకవేళ రెహ్మాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోగలిగితే, అది కేవలం పెద్ది విజయానికే కాదు, బుచ్చిబాబు విజన్‌కు కూడా పెద్ద ముద్ర వేయనుంది. అప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు రామ్ చరణ్ యాక్టింగ్ తో పాటు రెహ‌మాన్ సంగీతం కూడా ప్రధాన చర్చాంశంగా మారడం ఖాయం.