Begin typing your search above and press return to search.

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను చెప్పుకునే అవకాశం పెరిగింది.

By:  Priya Chowdhary Nuthalapti   |   2 Nov 2026 3:30 PM IST
అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!
X

సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను చెప్పుకునే అవకాశం పెరిగింది. ఒక సినిమా, పాట విడుదలైతే చాలు.. నచ్చినవారు ప్రశంసలు కురిపిస్తుంటే… నచ్చని వారు విమర్శలు చేస్తుంటారు. అయితే ఈ విమర్శలు కొన్నిసార్లు హద్దులు దాటి వ్యక్తిగత దూషణలకు దారి తీస్తున్నాయి. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దీనిపైనే కొన్ని స్ట్రాంగ్ వ్యాఖ్యలు చేశారు.

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణం సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని 'మంగళ్ రంగ్' పాట విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ముఖ్యంగా పాటలోని సంగీతం.. ఎలక్ట్రానిక్ మ్యూజిక్‌పై కొందరు విమర్శలు చేశారు.

ఈ విమర్శలపై స్పందించిన రెహమాన్.. ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదని అన్నారు. స్టీవ్ జాబ్స్ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ.. అందరినీ మెప్పించాలనుకుంటే ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలని వ్యాఖ్యానించారు.

సంగీతం అనేది ఒక రోజులో తయారయ్యే విషయం కాదని, ఒక కంపోజిషన్‌ను పూర్తిచేయడానికి చాలా సమయం పడుతుందని ఆయన వివరించారు. తాను చేసే పనికి మొదటి విమర్శకుడిని తానేనని చెప్పారు. కొన్ని పాటలను అర్థం చేసుకోవడానికి కూడా సమయం అవసరమని, పచ్చడి మాదిరిగా కొన్ని సంగీతాలు కాలం గడిచేకొద్దీ మరింత బాగుంటాయని అభిప్రాయపడ్డారు.

నిజానికి ప్రేక్షకులకు ఒక పాట నచ్చకపోతే తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉంటుంది. సినిమా, సంగీతం వంటి కళారంగాల్లో విమర్శలు కూడా అవసరమే. అయితే ఒక పాట నచ్చలేదని సంగీత దర్శకుడిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఎంతవరకు సరైనది అనే ప్రశ్న ప్రస్తుతం చాలామందిలో ఉంది.

ఒకరికి నచ్చిన సంగీతం మరొకరికి నచ్చకపోవచ్చు. ప్రతి ఒక్కరి అభిరుచి ఒకేలా ఉండదు. అలాంటప్పుడు తమ అభిప్రాయమే సరైనదని భావించి ఇతరులపై విమర్శలు చేయడం సరికాదు. ముఖ్యంగా ఈ మధ్యమన్న సోషల్ మీడియాలో ఫ్యామిలీని టార్గెట్ చేసి కూడా కామెంట్లు పెడుతున్నారు. ఈ లెవెల్ కి కామెంట్స్ వెళ్లడం అనేది సరైనది కాదననే చెప్పాలి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ విషయం అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. కొందరు పూర్తి విషయాన్ని అర్థం చేసుకోకుండానే విమర్శలు చేస్తున్నారు. కళాకారులు కూడా ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవించాలి. అదే సమయంలో ప్రేక్షకులు కూడా తమ విమర్శల్లో మర్యాదను పాటించాలి. అలా కాకుండా ఎలా పడితే అలా మాట్లాడటం ముఖ్యంగా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం సరైనది కాదు. ఇది మారినప్పుడే.. చాలామంది బాధకి సోషల్ మీడియా కామెంట్లు కారణం అవ్వడం మానుతుంది.