రెహమాన్ హైదరాబాద్ ఈవెంట్.. చుక్కల్లో టికెట్ ధరలు..
అయితే హైదరాబాద్ లైవ్ షో కోసం టికెట్ ధరలతోనే సామాన్యులకు పెద్ద సమస్య ఉంది. టికెట్ ఖరీదు పూర్తిగా సామాన్య- మధ్యతరగతి ప్రజలకు అందుబాలో లేదని ఫిర్యాదులు అందుతున్నాయి.
By: Sivaji Kontham | 30 July 2025 8:56 PM ISTఆస్కార్ అవార్డు గ్రహీత, స్వర మాంత్రికుడు ఏ.ఆర్. రెహమాన్ దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో తన తొలి సంగీత కచేరీని ఏర్పాటు చేయడం సర్వత్రా ఎగ్జయిట్ మెంట్ ను పెంచుతోంది. అభిమానులు ఈ వేడుక కోసం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. హైదరాబాద్ కచేరీ నవంబర్ 8న రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ స్టేడియంలో అభిమానుల సమక్షంలో జరగనుంది. జూలై 14 నుండి టికెట్లు ఆన్‌లైన్ లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయి.
అయితే హైదరాబాద్ లైవ్ షో కోసం టికెట్ ధరలతోనే సామాన్యులకు పెద్ద సమస్య ఉంది. టికెట్ ఖరీదు పూర్తిగా సామాన్య- మధ్యతరగతి ప్రజలకు అందుబాలో లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. వాస్తవంగా టికెట్ ధరలు ఎలా ఉన్నాయి? అన్నది పరిశీలిస్తే.. స్టాండింగ్ గోల్డ్ క్లాస్ టికెట్ ధర -1800, ప్లాటినం చైర్ -రూ.4000, ఎంఐపి కపుల్ టికెట్ -రూ.13,000, ఫేజ్ 3లో కూచుని క్లోజ్ గా చూడాలంటే రూ.24000, ఫ్యాన్ ఫిట్ సెక్షన్ లో వీక్షణకు రూ.5500 లేదా 10,000 ఖర్చవుతుంది.
అయితే టికెట్ ధరలు ఎలా ఉన్నా కానీ బుకింగులు కిటకిటలాడుతున్నాయి. నవంబర్ కి ఇంకా మూడు నెలల సమయం ఉంది. అయినా ఇప్పటికే టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. ఆన్ లైన్ లో టికెట్ బుకింగుల స్పీడ్ చూస్తుంటే రెహమాన్ కి తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఏ రేంజులో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
భారతీయ సంగీత పరిశ్రమలో రెహమాన్ ఒక వేవ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడు ఇప్పటివరకూ అందించిన ప్రతి పాటా దేనికదే ప్రత్యేకం. ప్రతి ఆల్బమ్ యూనిక్ క్వాలిటీతో అలరించినవే. హిందీ, తమిళం, తెలుగు, ఇంగ్లీష్ సహా పలు బాషల సినిమాలకు ఆయన స్వరాల్ని అందించారు. భాషకు అతీతంగా రెహమాన్ కి వీరాభిమానులు ఉన్నారు.
జై హో, చయ్య చయ్య, ఊర్వశి ఊర్వశి, వందే మాతరం ..., ఓ యువ యువ, కొంచెం నిప్పు కొంచెం గరళం, .. ఒకటేమిటి ఎప్పటికీ మర్చిపోలేని పాటలను స్వరపరిచిన స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్. అందుకే ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత కూడా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న `ది వండర్‌మెంట్ టూర్ -2025`కి అంత క్రేజ్ ఏర్పడింది. మూడు దశాబ్ధాల సుదీర్ఘ కెరీర్ లో రెహమాన్ అందుకోని శిఖరం లేదు. ఆయనను ఆరాధించే అభిమానులు అంతకంతకు పెరుగుతున్నారే కానీ తరగడం లేదు. అయితే హైదరాబాద్ లో జరగనున్న లైవ్ కాన్సెర్టును నిర్వాహకులు ఎలాంటి లోటు పాట్లు లేకుండా నిర్వహించాల్సి ఉంటుంది. హైదరాబాద్ కాన్సెర్టులో రామ్‌చరణ్ `పెద్ది` సినిమా నుంచి ఒక పాటను ఎంపిక చేసుకుని రెహమాన్ పాడే అవకాశం ఉందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మెగాభిమానులు కూడా ఈ ఈవెంట్ కి భారీగా పోటెత్తే ఛాన్సుంది.
