రెహమాన్ 'చిన్ని చిన్ని ఆశ' కాపీ ట్యూనా?
నిజానికి యాన్నీ కంపోజ్ చేసిన వన్ మ్యాన్ డ్రీమ్ లోని పియానో మెలోడియస్ గా ఆకర్షిస్తుంది. `పుదు వెల్లై మళై`(చిన్ని చిన్ని ఆశ) పాటలోని ప్రారంభం బాణీ ఎత్తుగడ వినడానికి చాలా దగ్గరగా అనిపిస్తాయి.
By: Sivaji Kontham | 22 Jan 2026 10:32 PM ISTఏ.ఆర్. రెహమాన్ క్లాసిక్ సాంగ్ `రోజా` సినిమాలోని `చిన్ని చిన్ని ఆశ` (పుదు వెల్లై మళై- తమిళం) పాట ఏళ్ల తరబడి అభిమానుల హృదయాల్లో మార్మోగుతూనే ఉంది. ఇప్పటికీ ఆ పాటను ఎవరూ మరువలేరు. ఈ పాట 90లలో రోజా విడుదలైన సమయంలో ప్రతి ఇంట్లో మార్మోగేది. భారతీయ సినిమా చరిత్రలో ఇది ఒక విప్లవం లాంటిది. ఇది కేవలం ఒక ట్యూన్ మాత్రమే కాదు.. అప్పట్లో వినిపించిన ఒక కొత్త సౌండ్ ఇంజనీరింగ్ అద్భుతం.
కానీ ఈ సినిమా పాటను రెహమాన్ పాశ్చాత్య దేశాల నుంచి కాపీ చేసారని వివాదం చెలరేగింది. గ్రీక్ కంపోజర్ యాన్నీ 1989లో రూపొందించిన ``వన్ మ్యాన్స్ డ్రీమ్` అనే ట్రాక్ నుండి కాపీ చేసారని సామాజిక మాధ్యమాల్లో డిబేట్లు నడిచాయి. అయితే ఇది నిజమా? అంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాలి.
నిజానికి యాన్నీ కంపోజ్ చేసిన వన్ మ్యాన్ డ్రీమ్ లోని పియానో మెలోడియస్ గా ఆకర్షిస్తుంది. `పుదు వెల్లై మళై`(చిన్ని చిన్ని ఆశ) పాటలోని ప్రారంభం బాణీ ఎత్తుగడ వినడానికి చాలా దగ్గరగా అనిపిస్తాయి. రెండూ కూడా ప్రశాంతమైన, మెలోడియస్ నోట్స్‌తో సాగుతాయి.
యాన్నీ ఆల్బమ్ 1989లో విడుదలవ్వగా, `రోజా` సినిమా 1992లో విడుదలైంది. దీంతో రెహమాన్ దాని నుంచి స్పూర్తి పొందారని లేదా కాపీ చేశారని నెటిజన్లు ఆరోపిస్తుంటారు. నిజంగా ఇది కాపీనా? అంటే.. సంగీత విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఇది పూర్తిస్థాయి కాపీ కాదు. పాక్షికంగా స్ఫూర్తి పొందినది అని అనొచ్చు. చిన్ని చిన్ని ఆశ.. పాట శ్రీరంజని లేదా కొన్ని చోట్ల ఖరహరప్రియ రాగ ఛాయల్లో సాగుతుంది. యాన్నీ ట్రాక్ పాశ్చాత్య శాస్త్రీయ సంగీత ధోరణిలో ఉంటుంది. ఈ రెండిటికీ వంద శాతం పోలిక లేదు.
నిజానికి ఇలాంటి సందర్భాలలో ఆ పాట స్ఫూర్తి పొందినదా? కాపీ చేసినదా? అనేది రెహమాన్ అభిమానులకే వదిలేయాలి. రెహమాన్ తన కెరీర్ ఆరంభంలో యాన్నీ సంగీతానికి ఎంతో ఆకర్షితులయ్యారని, ఆ మూడ్ ని క్రియేట్ చేయడానికి ప్రయత్నించారని కొందరు అంటారు. కానీ పాటలోని ట్యూన్, చరణాలు పూర్తిగా స్వతహాగా కంపోజ్ చేసినవే.
ఇప్పటివరకు యాన్నీ వైపు నుండి గానీ, వారి ప్రతినిధుల నుండి గానీ రెహమాన్ పైన ఎటువంటి కాపీరైట్ ఆరోపణలు రాలేదు. భవిష్యత్ లో కూడా ఎవరూ ముందుకు వస్తారని అనుకోలేం.
రెహమాన్ గతంలో దీనిపై స్పందించారా? అంటే.. సాధారణంగా ఇటువంటి వివాదాలపై ఆయన నేరుగా స్పందించరు. కానీ రెహమాన్ ఎప్పుడూ చెప్పే మాట ఏంటంటే.. ప్రతి సంగీతకారుడు ఏదో ఒక దాని నుండి ప్రభావితం అవుతారని, కానీ దానికి తనదైన శైలిని అద్ది కొత్తగా సృష్టించడమే కళ అని.. !
కెరీర్ మ్యాటర్ కి వస్తే... రెహమాన్ ప్రస్తుతం నితీష్ తివారీ `రామాయణం` చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ పెద్ది చిత్రానికి రెహమాన్ బాణీలు అందిస్తున్నారు. థగ్ లైఫ్, రాయన్ తర్వాత రెహమాన్ వరుసగా పలు క్రేజీ ప్రాజెక్టులకు పని చేస్తుండడం ఆసక్తికరం.
