Begin typing your search above and press return to search.

సంగీత సంచ‌లనం చేతిలో 20 సినిమాలు!

ఇది ఆయనకున్న విపరీతమైన క్రేజ్‌ను సూచిస్తున్నప్పటికీ ఒకేసారి ఇన్ని బాధ్యతలను భుజాన వేసుకోవడం వల్ల ప్రాజెక్టుల మేనేజ్‌మెంట్‌లో సవాళ్లు ఎదురవుతున్నాయి.

By:  Srikanth Kontham   |   14 July 2026 10:00 PM IST
సంగీత సంచ‌లనం చేతిలో 20 సినిమాలు!
X

సంగీత ప్రపంచంలో ఏఆర్ రెహమాన్ ఓ అద్భుతం. ఆయన స్వరకల్పనలో ప్రత్యేకమైన శైలి, వైవిధ్యం ఉంటాయి. ప్రస్తుతం రెహ‌మాన్ తమిళం, హిందీ భాషలలో 20 సినిమాలకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఒక సంగీత దర్శకుడు ఏకకాలంలో ఇన్ని ప్రాజెక్టులను చేపట్టడం అనేది సాధారణ విషయం కాదు. ఇది ఆయనకున్న విపరీతమైన క్రేజ్‌ను సూచిస్తున్నప్పటికీ ఒకేసారి ఇన్ని బాధ్యతలను భుజాన వేసుకోవడం వల్ల ప్రాజెక్టుల మేనేజ్‌మెంట్‌లో సవాళ్లు ఎదురవుతున్నాయి. కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నా? మరికొన్ని ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ఆగిపోతున్నాయి.

సినిమా నిర్మాణంలో సంగీతం కీలక భాగం. రెహమాన్ వంటి దిగ్గజం నుండి పాటలు రావాలంటే ఆ స్వరకల్పనకు సహజంగానే కొంత సమయం అవసరం. దర్శకుల విజన్, నిర్మాణ సంస్థల వేగం, మ్యూజిక్ కంపోజిషన్‌కు పట్టే సమయం వంటి అంశాలు విడుదల తేదీలను శాసిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో కొన్ని ప్రాజెక్టులు అనుకున్న సమయంలో విడుద‌ల‌వ్వ‌డం లేదు. ఇన్ని ప్రాజెక్టుల ఒత్తిడి మధ్య కూడా రెహ‌మాన్ క్వాలిటీ విషయంలో రాజీ పడకపోవడమే ఆలస్యానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రతి సినిమాకు ప్రత్యేకమైన టచ్ ఇవ్వడం రెహమాన్ నైజం.

ఒక్కో సినిమాకు భిన్నమైన సంగీత శైలిని అందించడానికి.. సృజనాత్మకతకు మరింత సమయాన్ని కేటాయిస్తున్నారు. భారీ చిత్రం కోసం కంపోజిషన్ చేస్తున్నప్పుడు మరో సినిమా కోసం అనుకున్న మ్యూజిక్ నేపథ్యాన్ని సరిపోల్చుకోవడం కష్టమైన పని. నిర్మాతలకు ఆయన పేరు బ్రాండ్ ఇమేజ్ లాంటిది. అందుకే ప్రాజెక్టు ఆలస్యమైనా? వేరే సంగీత దర్శకుడి వైపు వెళ్లకుండా రెహమాన్ కోసం నిరీక్షించే వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇన్ని ప్రాజెక్టుల భారం ఉన్నా? రెహ‌మాన్ పనితీరును సమన్వయం చేసుకోవడంలో వినూత్న పద్ధతులను పాటిస్తున్నారు.

ఓవైపు పాత సినిమా పనులను పూర్తి చేస్తూనే.. మరోవైపు కొత్త ప్రాజెక్టులను అంగీకరిస్తూ ముందుకు వెళ్తున్నారు. రాబోయే కాలంలో 20 సినిమాలు వరుసగా విడుదలైతే? మ్యూజికల్ మార్కెట్‌లో రెహ‌మాన్ ప్రభంజనం సృష్టించడం ఖాయం. పాటల నాణ్యత విషయంలో రెహ‌మాన్ నిబద్ధత.. డిలే అవుతున్న సినిమాలపై ప్రేక్షకుల్లో ఉండే అసహనాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఇటీవల తెలుగులో విడుదలైన `పెద్ది` చిత్రానికి ఆయన అందించిన సంగీతం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు మ్యూజికల్‌గా కూడా మంచి విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సక్సెస్‌తో పరిశ్రమలో మళ్ళీ రెహమాన్ హవా పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ కూడా రెహ‌మాన్ మరిన్ని కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నారు.

ఏఆర్ రెహమాన్ ప్రస్థానం అంతుచిక్కని మేధావితనం లాంటింది. 20 సినిమాల బాధ్యత పెద్ద సవాలుగా అనిపిస్తున్నా? సంగీతంపై ఆయనకున్న పట్టుతో వాటిని ఎలాగైనా విజయవంతంగా పూర్తి చేస్తారనే నమ్మకం అభిమానుల్లో ఉంది. ఆయన స్వరపరిచిన ప్రతి పాట కళాఖండంగా మారాల్సిందేననేది అభిమానుల కోరిక. ఈ క్రమంలో జరిగే కాలయాపన కంటే రెహ‌మాన్ అందించే సంగీతంలోని గొప్పతనమే ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది. రెహ‌మాన్ అంత బిజీగా మ‌రే మ్యూజిక్ డైరెక్ట‌ర్ లేద‌న్న‌ది అంతే వాస్త‌వం.