Begin typing your search above and press return to search.

ఏప్రిల్ 28 - టాలీవుడ్ లక్కీ డేట్!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొన్ని తేదీలకు ప్రత్యేకమైన సెంటిమెంట్, చరిత్ర ఉన్నాయి. అలాంటి వాటిలో `ఏప్రిల్ 28` అత్యంత ముఖ్యమైనది.

By:  Srikanth Kontham   |   29 April 2026 6:55 PM IST
ఏప్రిల్ 28 - టాలీవుడ్ లక్కీ డేట్!
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొన్ని తేదీలకు ప్రత్యేకమైన సెంటిమెంట్, చరిత్ర ఉన్నాయి. అలాంటి వాటిలో `ఏప్రిల్ 28` అత్యంత ముఖ్యమైనది. టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను సమూలంగా మార్చివేసిన రెండు చిత్రాలు ఇదే తేదీన విడుదలై సంచలనం సృష్టించాయి. అందులో మాస్ హీరోయిజానికి కొత్త భాష్యం చెప్పిన `పోకిరి` ఒక‌టైతే? మరోటి భారతీయ సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన `బాహుబలి 2`. ఈ తేదీ తెలుగు సినీ ప్రేమికుల గుండెల్లో ఒక మరుపురాని జ్ఞాపకంగా నిలిచిపోయింది. సరిగ్గా 2006 ఏప్రిల్ 28న విడుదలైన `పోకిరి` టాలీవుడ్‌లో సునామీని సృష్టించింది.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ నటించిన ఈ చిత్రం అప్పటివరకు ఉన్న అన్ని బాక్సాఫీస్ రికార్డులను తుడిచిపెట్టేసింది. అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ కథను అత్యంత స్టైలిష్‌గా, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో చూపించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. మహేష్ కెరీర్‌ను ఈ సినిమా మలుపు తిప్పడమే కాదు. మ‌హేష్ ని తిరుగులేని బాక్సాఫీస్ కింగ్ గా నిలబెట్టింది.`పోకిరి` తెచ్చిన మార్పు వసూళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. తెలుగు సినిమాలో హీరో డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్ , యాక్షన్ సీక్వెన్స్‌లలో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది.

`ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా`అనే డైలాగ్ ఇప్పటికీ టాలీవుడ్ ఫేవరెట్ కోట్స్ లో ఒకటిగా నిలిచి ఉందంటే ఆ సినిమా ప్రభావం అర్థం చేసుకోవచ్చు. సుమారు 75 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో `పోకిరి` ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మళ్లీ పదకొండేళ్ల తర్వాత అదే ఏప్రిల్ 28వ తేదీన (2017) `బాహుబలి 2: ది కన్క్లూజన్` ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారతీయ సినిమా స్థాయిని ఆకాశానికి చేర్చింది. దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన ఈ మహాద్భుతం తెలుగు సినిమానే కాకుండా భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు అని ప్రపంచానికి చాటిచెప్పింది.

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు సమాధానం కోసం యావత్ ప్రపంచం థియేటర్ల ముందు క్యూ కట్టింది. `బాహుబలి 2` బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సుమారు 1800 కోట్లకు పైగా వసూళ్లను సాధించి భారతీయ సినిమా మార్కెట్ పరిధులను విస్తరించింది. ప్రభాస్ రేంజ్‌ను ఇంటర్నేషనల్ లెవల్‌కు తీసుకెళ్లిన చిత్రమిది. పాన్ ఇండియా సినిమాలకు అసలైన నిర్వచనం గా నిలిచింది. ప్రాంతీయ భాషా చిత్రాలు కూడా సరైన కంటెంట్ ఉంటే ప్రపంచాన్ని ఏలగలవని నిరూపించింది.

ఈ విజయంతో ఏప్రిల్ 28 అనేది టాలీవుడ్ కు గోల్డెన్ డేట్ గా మారిపోయింది. ఆ ర‌కంగా ఏప్రిల్ 28 అనేది ఒక తేదీ మాత్రమే కాదు. తెలుగు సినిమా ఆత్మవిశ్వాసానికి ప్రతీక. `పోకిరి`తో మాస్ మార్కెట్ సత్తా ఏంటో తెలిస్తే? `బాహుబలి 2`తో గ్లోబల్ మార్కెట్ తలుపులు తెరుచుకున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా కాలానికి మించిన సాంకేతికతతో, కథనంతో ప్రేక్షకులను అలరించాయి. భవిష్యత్తులో కూడా ఇదే తేదీన మరిన్ని అద్భుతమైన చిత్రాలు విడుదలై టాలీవుడ్ కీర్తి పతాకాన్ని మరింత ఎత్తులో ఎగురవేయాల‌ని ఆశీద్దాం.