Begin typing your search above and press return to search.

మసక చీకటిలో..మైనస్ 7 డిగ్రీల చలిలో!

సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘మాతృ భూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ షూటింగ్‌లో ఆయన చూపిన అంకితభావాన్ని దర్శకుడు అపూర్వ లఖియా ప్రశంసించారు. మైనస్ 7 డిగ్రీల చలి, వర్షంలో 14 వేల అడుగుల ఎత్తులో ఎలాంటి అదనపు ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా షూటింగ్‌లో పాల్గొన్నారని తెలిపారు. కొండపైకి పరుగెత్తే కఠినమైన సన్నివేశాన్ని సింగిల్ టేక్‌లో పూర్తి చేశారని వెల్లడించారు. సినిమా డిసెంబర్ 4న విడుదల కానుంది.

By:  Srikanth Kontham   |   16 Nov 2026 1:42 PM IST
మసక చీకటిలో..మైనస్ 7 డిగ్రీల చలిలో!
X

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ క‌ష్టం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆరు ప‌దుల వ‌య‌సులో సైతం స‌ల్మాన్ ఖాన్ అంతే ఉత్సాహంతో తెర‌పై మెరుస్తుంటారు. ఎలాంటి పాత్ర‌లోనైన‌నా..ఆ పాత్రం ట‌ఫ్ గా ఉన్నా? లీన‌మై ప‌ని చేయ డం ఆయ‌న‌కే చెల్లింది. 60 ఏళ్ల వ‌య‌సులోనూ స‌ల్మాన్ ఖాన్ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో చూపిస్తున్న ఉత్సాహానికి ఎవ‌రైనా ఫిదా అవ్వాల్సిందే. యాక్ష‌న్ స‌న్నివేశాలు ఎంత రియ‌లిస్టిక్ గా ఉంటే? అంత గొప్ప‌గా సినిమా విజ‌యం సాధిస్తుంద‌ని బ‌లంగా న‌మ్మే హీరో అత‌డు. ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం `మాతృ భూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్` షూటింగ్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం వెలుగులోకి వచ్చింది.

2020 గల్వాన్ లోయ ఘర్షణల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ పడిన కష్టాలను.. ఆయన చూపించిన‌ తెగింపును అపూర్వ లఖియా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. వెండి తెర‌పై వినోదం పంచడమే కాక ఓ సైనికుడి నిజమైన పోరాటాన్ని చూపించడానికి సల్మాన్ ఎలాంటి కష్టనష్టాలనైనా భరించారనే విషయాన్ని బయటపెట్టారు.

`సినిమాలో కీలక సన్నివేశాలను సముద్ర మట్టానికి 14000 అడుగుల ఎత్తున ఉన్న అత్యంత దుర్భరమైన వాతావరణంలో చిత్రీకరించాం. అక్కడ ఉష్ణోగ్రత ఏకంగా మైనస్ 7 డిగ్రీలకు పడిపోయింది. దీంతో పాటు విపరీతమైన వర్షం కూడా కురుస్తోంది. సాధారణంగా అంత ఎత్తుకు వెళ్లినప్పుడు శరీరం వాతావరణానికి అలవాటు పడటానికి కొన్ని రోజులు సమయం పడుతుంది. అయితే షెడ్యూల్ కారణంగా సల్మాన్ ఖాన్ లొకేషన్‌కు చేరుకున్న మరుసటి రోజే సెట్‌లోకి దిగిపోయారు. ఎలాంటి అదనపు ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా కనీసం వాతావరణానికి శరీరం అలవాటు పడే అవకాశం కూడా ఇవ్వకుండా మైనస్ 7 డిగ్రీల చలిలో.. వర్షంలోనే షూటింగ్‌లో పాల్గొనడం విశేష‌మ‌ని` తెలిపారు.

అలాగే ఎముకలు కొరికే చలిలో సైనికులు కొండపైకి పరిగెత్తే క‌ఠిన‌మైన సన్నివేశాన్ని స‌ల్మాన్ ఎలాంటి ఫిర్యాదు చేయకుండా సింగిల్ టేక్ లో పూర్తి చేశార‌న్నారు. అలాంటి కఠినమైన పరిస్థితుల్లోనూ సల్మాన్ ఏమాత్రం అసహనం వ్యక్తం చేయకుండా అంకితభావంతో పూర్తి చేశారని ద‌ర్శ‌కుడు ప్రశంసించారు. వెండితెరపై సైనికుల త్యాగాలను అద్భుతంగా ఆవిష్కరించేందుకు నటీనటులు పడే శ్రమకు ఈ సంఘటనే నిదర్శనంగా నిలుస్తోందని చెప్పొచ్చు. ఇప్ప‌టికే సినిమాకు సంబంధించి అన్ని ప‌నులు పూర్త‌య్యాయి. సెన్సార్ విష‌యంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగ‌మంచి ఎట్ట‌కేల‌కు డిసెంబ‌ర్ 4న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి రెడీ అవుతున్నారు.