Begin typing your search above and press return to search.

యాక్టింగ్ వ‌దిలేసి టైల‌ర్ అవుతానంటోన్న న‌టుడు!

ఇండ‌స్ట్రీలో గుర్తింపు ..స్టార్‌డమ్ లభించిన తర్వాత ఆ రంగంలోనే సుదీర్ఘకాలం కొనసాగాలని భావిస్తారు.

By:  Srikanth Kontham   |   13 Jun 2026 7:00 AM IST
యాక్టింగ్ వ‌దిలేసి టైల‌ర్ అవుతానంటోన్న న‌టుడు!
X

ఇండ‌స్ట్రీలో గుర్తింపు ..స్టార్‌డమ్ లభించిన తర్వాత ఆ రంగంలోనే సుదీర్ఘకాలం కొనసాగాలని భావిస్తారు. కానీ బాలీవుడ్ నటుడు అపర్శక్తి ఖురానా ఆలోచనలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. భవిష్యత్తులో తాను నటనకు గుడ్‌బై చెప్పి సరికొత్త వృత్తిని ఎంచుకోవాలనుకుంటున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ప్రముఖ నటీమణి నేహా ధూపియా- అంగద్ బేడీలు సంయుక్తంగా హోస్ట్ చేస్తున్న టాక్ షో `డబుల్ డేట్లో` తన భార్య ఆకృతి అహుజాతో కలిసి పాల్గొన్న ఆయన భవిష్యత్తు ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్య‌లు చేసారు.

వ‌చ్చే 10 - 12 సంవత్సరాలలో నటనకు పూర్తిగా స్వస్తి చెప్పాలని అనుకుంటున్నట్లు ఈ సందర్భం వెల్లడించారు. గ్లామర్ ప్రపంచానికి దూరంగా జరిగి వస్త్రాల తయారీపై దృష్టి పెట్టాలనేది కోరికగా తెలిపారు. ఏదో వ్యాపారంగా కాకుండా అసలు బట్టలు ఎలా కత్తిరించాలి? వాటిని ఎలా కుట్టాలి? అనే సాంప్రదాయ టైలరింగ్ ప్రక్రియను మొదటి నుండి నేర్చుకోవాలని బలంగా ఉందని తెలిపారు. సినిమా రంగుల ప్రపంచం నుండి పూర్తిగా భిన్నమైన ఈ రంగం వైపు ఆయన మొగ్గు చూపడం వెనుక ఫ్యాషన్ పట్ల ఆయనకున్న మక్కువ ఏంటో తెలుస్తోంది.

ఈ సందర్భంగా ముంబైలో కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న పరిస్థితులను కూడా అపర్శక్తి గుర్తు చేసుకున్నారు. నటుడిగా మారడానికి ముందు ముంబై నగరానికి మారడానికి ఒక మార్గంగా కొన్నాళ్లపాటు స్టైలిస్ట్గా పనిచేశారు. ఒక ప్రముఖ టెలివిజన్ ఛానల్‌లో బాలీవుడ్ షోలను హోస్ట్ చేసే యాంకర్లకు స్టైలింగ్‌ బాధ్యతలు నిర్వర్తించారు. ఫ్యాషన్ పట్ల అపర్శక్తికి ఉన్న ప్రత్యేకమైన అభిరుచిని షోలో అంగద్ బేడీ ప్రశంసించగా.. ఆ జ్ఞాపకాలే తనను భవిష్యత్తులో టైలరింగ్ వైపు నడిపిస్తున్నాయని భావోద్వేగానికి గుర‌య్యారు.

ఇదే ఇంట‌ర్వ్యూలో అపర్శక్తి కెరీర్ ఎదుగుదలలో తన భార్య ఆకృతి అహుజా పోషించిన పాత్రను `లేడీ లక్` ప్రభావాన్ని వివరిస్తూ ఆశ్చర్యకర విషయాలను పంచుకున్నారు. పెళ్లికి ముందు తాను రేడియో జోకీగా, ఢిల్లీ హైకోర్టులో , ఇతర చిన్న ఉద్యోగాలు చేస్తున్నప్పుడు అవకాశాల కోసం ఎందరో దర్శకులకు, కాస్టింగ్ డైరెక్టర్లకు, ప్రొడక్షన్ హౌస్‌లకు నిరంతరం ఈమెయిళ్ళు, సందేశాలు పంపేవాడినన్నారు. అయితే అప్పట్లో ఎవ్వరూ కనీసం ఒక్కసారి కూడా సమాధానం ఇవ్వలేదని గుర్తు చేసుకున్నారు.

కానీ ఆశ్చర్యంగా తాను ఆకృతిని వివాహం చేసుకున్న రోజునే మూడేళ్ల క్రితం తాను పంపిన పాత సందేశాలకు వివిధ ప్రొడక్షన్ల నుండి రిప్లైలు రావడం ప్రారంభ మయ్యాయ‌ని తెలిపారు. తమ షోలకు హోస్ట్‌ల కోసం చూస్తున్నామని, వచ్చి జాయిన్ అవ్వగలరా? అని వారు అడిగారు. అంతకుముందు వరకు తనకు లేడీ లక్ అనే అంశాలపై అస్సలు నమ్మకం ఉండేది కాదని కానీ ఈ సంఘటన తర్వాత జీవితంలో ఇలాంటి అద్భుతాలు కూడా జరుగుతాయని గ్రహించానని అపర్శక్తి సరదాగా వ్యాఖ్యానించారు.