Begin typing your search above and press return to search.

AP నంది అవార్డుల కోసం ద‌ర‌ఖాస్తు విధానం- మార్గ‌ద‌ర్శ‌కాలు!

ఇక టెలివిజన్ రంగానికి సంబంధించి 2025 సంవత్సరానికి నంది టి.వి. చిత్ర నిబంధనల ప్రకారం ఉత్తమ టి.వి. చిత్ర నిర్మాతలు, కళాకారులు, సాంకేతిక నిపుణులను సత్కరించనున్నారు.

By:  Sivaji Kontham   |   23 Sept 2026 11:37 AM IST
AP నంది అవార్డుల కోసం ద‌ర‌ఖాస్తు విధానం- మార్గ‌ద‌ర్శ‌కాలు!
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్ - నాటకరంగ అభివృద్ధి సంస్థ (విజయవాడ) 2025 సంవత్సరానికి సంబంధించిన `చలనచిత్ర నంది బహుమతులు - 2025` , TV నంది బహుమతులు - 2025` కోసం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమను, టెలివిజన్ రంగాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం ఈ పురస్కారాలను అందజేస్తోంది. అర్హులైన నిర్మాతలు, కళాకారులు, సాంకేతిక నిపుణుల నుండి దరఖాస్తులను సంస్థ ఆహ్వానించింది.

చలనచిత్ర విభాగంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది చలనచిత్ర నిబంధనలను అనుసరించి 2025 సంవత్సరానికి ఉత్తమ ఫిల్మ్ నిర్మాతలు, ఉత్తమ కళాకారులు.. ఉత్తమ సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. తెలుగు భాషలో భారతదేశంలో ఎక్కడైనా నిర్మించి.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ -సీబీఎఫ్‌సీ ద్వారా థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించిన చిత్రాలు, జాతీయ సమైక్యతపై చిత్రాలు, బాలల‌ చిత్రాలు, డాక్యుమెంటరీలు, విద్యాసంబంధమైన చిత్రాలు అలాగే తెలుగు సినిమా మీద వచ్చిన పుస్తక రచనలు, రచయితలు, నిర్మాతలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఇక టెలివిజన్ రంగానికి సంబంధించి 2025 సంవత్సరానికి నంది టి.వి. చిత్ర నిబంధనల ప్రకారం ఉత్తమ టి.వి. చిత్ర నిర్మాతలు, కళాకారులు, సాంకేతిక నిపుణులను సత్కరించనున్నారు. టెలిఫిల్మ్స్, టి.వి. ఫీచర్స్, టి.వి. మెగాసీరియల్స్, డైలీ సీరియల్స్, బాలల‌ చిత్రాలు, డాక్యుమెంటరీ చిత్రాలు, సామాజిక అంశాలు, విద్య సంబంధిత‌ చిత్రాల రూపకర్తలు ఈ బహుమతుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఈ అవార్డులకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు.. ఇతర వివరాలను సంస్థ అధికారిక వెబ్‌సైట్ www.apsftvdc.in ద్వారా తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను పొందుపరుచుటకు చివరి తేదీగా 12.10.2026ను నిర్ణయించారు. ఆన్‌లైన్ ద్వారా సమర్పించిన దరఖాస్తుల ప్రింట్ ప్రతులను సంబంధిత డాక్యుమెంట్లతో జతపరిచి నిర్దేశిత గడువులోగా అందజేయాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తుల హార్డ్ కాపీలను `మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ, 4వ అంతస్తు, ఎన్.టి.ఆర్. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, పండిత్ నెహ్రూ బస్ కాంప్లెక్స్, విజయవాడ - 520013` చిరునామాకు పంపడానికి చివరి తేదీ 16.10.2026గా ఖరారు చేసినట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్, ఐ.ఏ.ఎస్., తెలిపారు. కళాకారులు - నిర్మాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సంద‌ర్భంగా అధికారులు కోరారు.