Begin typing your search above and press return to search.

ఎన్నికల వేడిలో బాక్సాఫీస్: స్థానిక సమరం.. కలెక్షన్ల మైండ్ గేమ్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల శంఖారావం మోగడంతో రాష్ట్రమంతటా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

By:  Srikanth Kontham   |   24 Oct 2026 5:00 AM IST
ఎన్నికల వేడిలో బాక్సాఫీస్: స్థానిక సమరం.. కలెక్షన్ల మైండ్ గేమ్!
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల శంఖారావం మోగడంతో రాష్ట్రమంతటా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ఊరూవాడా ఎన్నికల ప్రచారం, మైకుల హోరు, రాజకీయ వ్యూహాలతో సందడిగా మారాయి. అయితే రాజకీయాల్లో జరిగే ప్రతీ చిన్న పరిణామం చిత్ర పరిశ్రమపై ఏదో ఒక రూపంలో ప్రభావం చూపుతుందనేది బహిరంగ సత్యం. ప్రస్తుతం ఏపీలో ప్రారంభమైన స్థానిక ఎన్నికల హడావుడి.. కొత్త సినిమాల విడుదలపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? నిర్మాతలు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారనేది? టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికల సమయంలో ప్రజల దృష్టి అంతా సహజంగానే రాజకీయ వార్తలు, ప్రచారాలు, అభ్యర్థుల గెలుపో టములపైనే కేంద్రీకృతమై ఉంటుంది. ముల‌ట‌ఖ్యంగా గ్రామీణ -పాక్షిక పట్టణ ప్రాంతాల్లో ప్రజలు థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే ఆసక్తి కొంత మేర తగ్గుతుంది. సాయంత్రం వేళల్లో ఊళ్లలో జరిగే కార్నర్ మీటింగ్‌లు, ప్రచార సభల వల్ల థియేటర్లలో సెకండ్ షో, ఈవినింగ్ షోల ఆక్యుపెన్సీ గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. చిన్న, మధ్య తరహా సినిమాలకు గ్రామీణ ప్రాంతాల వసూళ్లే కీలకం కాబట్టి ఎన్నికల వేడి వల్ల ఆయా చిత్రాల ఓపెనింగ్ కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.

స్థానిక ఎన్నికలు సాధారణంగా గ్రామ స్థాయి, వార్డు స్థాయి వరకు విస్తరించి ఉంటాయి. ఓటింగ్ జరిగే రోజుల్లో స్థానికంగా ఆంక్షలు ఉండటం, భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో థియేటర్లలో కొన్ని ఆటలు రద్దు చేయడం లేదా సమయాలు మార్చడం జరుగుతుంది. అలాగే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, అర్ధరాత్రి కటౌట్లు కట్టడం, ఆర్భాటంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్లు లేదా ర్యాలీలు నిర్వహించడంపై నిబంధనలు కఠినంగా ఉంటాయి. ఇది సినిమాల మాస్ ప్రమోషన్లకు అడ్డంకిగా మారుతుంది.

సినిమా ఎంత బాగున్నా దాన్ని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడానికి ప్రచార సాధనాలు అత్యంత ముఖ్యం. అయితే ప్రస్తుతం డిజిటల్ మీడియా, టీవీ ఛానెళ్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు అన్నీ రాజకీయ నాయకుల ప్రచారాలతో, పోల్ సర్వేలతో నిండిపోయాయి. ఇలాంటి సమయంలో కొత్త సినిమాల టీజర్లు, ట్రైలర్లు, పాటల ప్రమోషన్లు సాధారణ ప్రజల దృష్టిని ఆకర్షించడం కాస్త కష్టమైన పనే. మీడియా దృష్టంతా పొలిక‌ల్ వార్తలపైనే ఉండటంతో చిత్ర బృందాలు ప్రమోషనల్ కంటెంట్‌ను జనాల్లోకి తీసుకెళ్లేందుకు అద‌నంగా శ్ర‌మించాలి.

పోలింగ్.. ఓట్ల లెక్కింపు తేదీలను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు విడుదలను వ్యూహాత్మకంగా ప్లాన్ చేసుకుం టున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలు.. స్టార్ హీరోల సినిమాలు ఈ గందరగోళంలో చిక్కుకోకుండా ఉండేందుకు పోలింగ్ వారాల్లో కాకుండా ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత విడుదల చేసేలా రీ-షెడ్యూల్ చేస్తున్నారు. అలాగే చిన్న చిత్రాల నిర్మాతలు కూడా రిస్క్ తీసుకోకుండా ఎన్నికల వేడి తగ్గాకే బాక్సాఫీస్ బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో రాబోయే వారాల్లో కొత్త విడుదలల సంఖ్య త‌గ్గ‌నుంది.

ఎన్నికల ప్రభావం టాలీవుడ్ బాక్సాఫీస్‌పై తాత్కాలికంగా కొంత ప్రతికూల వాతావరణాన్ని సృష్టించినా? ఇది స్వల్పకాలిక పరిణామమే. ఎన్నికల ప్రక్రియ పూర్తయి ఫలితాలు వెలువడిన అనంత‌రం థియేటర్లు మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయి. రాజకీయ సమరం ముగిశాక ప్రేక్షకులు కూడా వినోదం కోసం థియేటర్ల బాట పడటం ఖాయం.