ఉచిత బస్సుకు ఏడాది... మహిళలతో బాబు భేటీ
ఉచిత బస్సుని 2025 ఆగస్ట్ 15న కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కలసి బస్సులో ప్రయాణం చేస్తూ సందడి చేశారు.
By: Satya P | 15 Aug 2026 9:04 AM ISTఉచిత బస్సుని 2025 ఆగస్ట్ 15న కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కలసి బస్సులో ప్రయాణం చేస్తూ సందడి చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఫ్రీ బస్ ని అమలు చేశారు. దానికి స్త్రీ శక్తి పధకం అని పేరు పెట్టారు. ఈ పధకం ద్వారా విద్యార్ధినులు, ఉద్యోగినులు అలాగే చిరు వ్యాపారులు గృహిణులు కూడా ఎంతగానో ఆర్థిక ప్రయోజనం పొందారు. ఏపీలో ప్రారంభించిన ఉచిత బస్సు పధకం అయితే మహిళా ప్రయాణంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
87 కోట్ల ప్రయాణాలు :
ఈ రోజుకు 87 కోట్ల ప్రయాణాలతో ఉచిత బస్సు ఏపీలోనే కాదు పొరు గాష్ట్రాలతో పోల్చితే కూడా రికార్డు సృష్టించింది. ఈ పధకం ద్వారా సగటున రోజుకు 24 లక్షల మంది మహిళలు ప్రయాణం చేసినట్లుగా నివేదికలు ఉన్నాయి. మహిళలకు ఉచిత బస్సు ద్వారా ఆర్ధిక భరోసాతో పాటు ఆత్మ గౌరవాన్ని కూడా అందించామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎన్నిసార్లయినా పరిమితులు లేకుండా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించడంతో మహిళల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది అని అధికార వర్గాల నివేదికలు చెబుతున్నాయి.
ప్రభుత్వం సబ్సిడీగా :
ఇక ఏపీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం రోజుకు 8.53 కోట్ల రూపాయలను సబ్సిడీగా అందిస్తోంది. పథకం అమల్లోకి వచ్చిన ఏడాది కాలంలో ఇప్పటివరకు 3,095 కోట్ల రూపాయలను కేవలం ఈ పథకం కోసం కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఆర్టీసీలోని ఎక్స్‌ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు, పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ.ఇలా ఐదు కేటగిరీల బస్సుల్లో స్త్రీ శక్తి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్రం మొత్తం మీద 9,978 ఆర్టీసీ బస్సులు ఉంటే అందులో 76 శాతం బస్సులు అంటే 7,631 బస్సులను ఈ పథకానికి వినియోగిస్తున్నారు అంతే కాకుండా ఆలయాలకు నడిపే ప్రత్యేక బస్సు సర్వీసుల్లోనూ ఈ సౌకర్యాన్ని మహిళలు వినియోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇక స్త్రీ శక్తి పథకం రాకముందు ఆర్టీసీ బస్సుల్లో మహిళల వాటా 40 శాతం ఉండగా ఇప్పుడు అది 62 శాతానికి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. అలాగే రోజువారీ మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా 9.47 లక్షల నుంచి 24 లక్షలకు చేరుకుంది. ఇక ఈ పథకం అమలవుతున్న బస్సులలొ ఆక్యుపెన్సీ 93 శాతానికి చేరిందని లెక్కలు చెబుతున్నాయి.
మహిళలతో బాబు ప్రయాణం :
ఇదిలా ఉంటే శ్రీ శక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాదైన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు 15న మహిళలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. స్త్రీ శక్తికి సంవత్సరం- రెట్టింపైన ఆత్మగౌరవం అన్న పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. రాజధాని పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర్య దినోత్సవాల కార్యక్రమం ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అంతే కాదు పరేడ్ గ్రౌండ్ నుంచి సీఎం క్యాంప్ కార్యాలయం వరకు స్త్రీశక్తి లబ్దిదారులతో కలిసి బస్సులో బాబు ఈ సందర్భంగా ప్రయాణించనున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో మహిళలతో కలిసి చంద్రబాబు హై టీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. శ్రీ శక్తి పథకం అమలవుతున్న తీరు దాని వల్ల మహిళలకు కలుగుతున్న లబ్ది వంటి అంశాలపై మహిళలతోనే నేరుగా మాట్లాడి చంద్రబాబు వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.
