Begin typing your search above and press return to search.

ఆంధ్రాలో చిత్ర పరిశ్రమ ఉన్నట్లా లేనట్లా?

అస‌లు ఏపీకి టాలీవుడ్ ఉన్న‌ట్టా లేన‌ట్టా? అనే సందేహం నెల‌కొంద‌ని ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి జె.వి.మోహన్ గౌడ్.

By:  Sivaji Kontham   |   19 Nov 2025 1:47 PM IST
ఆంధ్రాలో చిత్ర పరిశ్రమ ఉన్నట్లా లేనట్లా?
X

విభజన జరిగి 12 సంవత్సరాలు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్రపరిశ్రమ ఆశించినంత అభివృద్ధి సాధించ లేకపోయిందనేది క‌ఠిన వాస్త‌వం. ఇప్ప‌టికీ హైద‌రాబాద్ పైనే తెలుగు సినీ ప‌రిశ్ర‌మ వంద‌శాతం ఆధార‌ప‌డి ఉండ‌టం ఆశ్చ‌ర్య‌ప‌రిచే విష‌యం. ఇటీవ‌ల విశాఖ‌లో జ‌రిగిన‌ సీఐఐ స‌మ్మిట్లో 2025 లో కూడా వినోద ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన ఒక్క ఎంవోయూ కూడా కుదుర్చుకోక‌పోవ‌డం నిజంగా నిరాశ‌ప‌రిచింది. ఎవ‌రైనా వ్యాపార‌వేత్త లేదా ఇండ‌స్ట్రియ‌లిస్ట్ సినిమా స్టూడియోలు క‌ట్టేందుకు క‌నీస ప్ర‌తిపాద‌న కూడా చేయ‌లేదు. ఏకంగా 20ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు ఏపీకి త‌ర‌లి వ‌స్తున్నాయ‌ని ప్ర‌భుత్వం చెబుతున్నా, వీటిలో వినోద రంగానికి పెట్టుబ‌డి గుండు సున్నా. అస‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం టాలీవుడ్ గురించి ఆలోచించ‌డం లేదా? అనే సందేహాన్ని కూడా ఇది రాజేసింది.

చిత్రపరిశ్రమకు చెందిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సి.యం. కావడం, సినిమా శాఖ ఆయన క్రింద ఉండటంతో చిత్రపరిశ్రమ అభివృద్ధి చెందుతుందని ఆశించిన ఆశావాహులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో నిరాశతో ఉన్నారని కూడా క‌థ‌నాలొస్తున్నాయి.

అయితే ఏపీలో సినీప‌రిశ్ర‌మ అభివృద్ధి జీరోగా మారిన క్ర‌మంలో ప‌లువురు సినీపెద్ద‌లు దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అస‌లు ఏపీకి టాలీవుడ్ ఉన్న‌ట్టా లేన‌ట్టా? అనే సందేహం నెల‌కొంద‌ని ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి జె.వి.మోహన్ గౌడ్. గతంలో మాదిరిగానే ఇప్పటికీ కూడా ఆంధ్రాకు చెందిన వారు హైదరాబాద్ వెళ్ళి షూటింగులు చేసుకుంటూ ఉండటం బాధగా ఉందని ఆయ‌న‌ తెలిపారు. హైదరాబాద్ నుంచి వస్తున్న సినిమా పెద్దలు టికెట్ రేట్స్ పెంచుకొని వెళ్లిపోతున్నారే తప్ప ఇక్కడ చిత్రపరిశ్రమ అభివృద్ధికి ఎలాంటి సపోర్ట్ చేయడం లేదని అన్నారు. ఆంధ్రాలో చిత్రపరిశ్రమ అభివృద్ధి చెందక పోవడానికి కారణాలను ప్రభుత్వం ఒకసారి అన్వేషించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఛాంబర్ సెక్రటరీగా తన దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని తెలియజేశారు.

ఆంధ్రాలో షూటింగులు చేసుకోవడానికి తగిన అవుట్ డోర్ యూనిట్స్, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ చేసుకోవడానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యూనిట్స్ సరిగా లేవని చాలామంది నిర్మాతలు వాపోతున్నారని తెలిపారు.హైదరాబాద్ నుంచి యూనిట్స్ తీసుకువచ్చి ఆంధ్రాలో షూటింగ్ లు చేసుకోవడం ఖర్చుతో కూడిన పనిగా నిర్మాతలు భావిస్తున్నారని మోహ‌న్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ మాదిరిగా కాకుండా ప్రభుత్వమే వైజాగ్, విజయవాడ, తిరుపతి కేంద్రాలుగా అవుట్ డోర్ యూనిట్స్ ను, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యూనిట్స్ ను ఏర్పాటు చేసి సానుకూల‌మైన‌ ధరలలో అందుబాటులోకి తెస్తే క‌చ్చితంగా ఆంధ్రాలో షూటింగులు చేయడానికి ఇష్టపడతారని తెలిపారు.

ఇకపోతే 8సంవత్సరాల క్రితం చిన్న సినిమాలకు 10లక్షల సబ్సిడీ ఇస్తున్నామంటూ ఇచ్చిన‌ జీ.వో వల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌లేద‌ని, ఇంతవరకు ఏ ఒక్క సినిమాకు సబ్సిడీ రాలేదని, ప్రభుత్వం కారణాలను పరిశీలించి చిన్న సినిమాలకు సబ్సిడీ ఇస్తే క‌చ్చితంగా చిన్న సినిమాలు ఆంధ్రాలో అభివృద్ధి చెందుతాయని తెలిపారు. కొన్నేళ్లుగా ఆగిపోయిన చిత్ర పరిశ్రమకు ఉత్సాహాన్ని, ఉత్తేజాన్నిచ్చే నంది అవార్డ్స్ ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాలని కూడా గౌడ్ సూచించారు.

ఏపీలో చిత్ర‌ప‌రిశ్ర‌మ అభివృద్ధి చెందాలంటే చాలా అడ్డంకులు ఉన్నాయి. వాటన్నింటిని సరిదిద్దాలంటే లోకల్ గా రిజిస్టర్ అయి ఉన్న ఫిలింఛాంబర్ ల సూచనలను కూడా పరిగణలోనికి తీసుకొని అందరితో కలిసి పనిచేసినప్పుడే అది సాధ్యపడుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పైన తెలిపినవన్ని చేయాలంటే FDC కి ఒక చైర్మన్ కావాలి కాబట్టి చైర్మన్ పోస్ట్ ను కూడా త్వరలో భర్తీ చేసి చిత్ర పరిశ్రమ అభివృద్ధికి దోహదపడాలని ప్రభుత్వాన్ని కోరతామని మోహ‌న్ గౌడ్ తెలిపారు.