AP ఫిలింఛాంబర్ 10 ఏళ్ల ప్రస్థానంలో ఏం సాధించింది?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ (టాలీవుడ్) పూర్తిగా ఏపీకి తరలివస్తుందని ఎన్నో కలలు కన్నారు.
By: Sivaji Kontham | 7 Oct 2026 11:39 PM ISTఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ (టాలీవుడ్) పూర్తిగా ఏపీకి తరలివస్తుందని ఎన్నో కలలు కన్నారు. అయితే ఆ కలలు ఇప్పటికీ నెరవేరలేదు. అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతున్న ఈ తరుణంలో, ఏపీలోనూ ఒక కొత్త టాలీవుడ్ పరిశ్రమ రూపుదిద్దుకుంటుందని అంతా భావిస్తున్నారు. కానీ ఏపీలో పూర్తిస్థాయి సినీ పరిశ్రమ ఇంకా ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న దశలో ఉన్నా మన రాష్ట్రంలోని విజయవాడలో `ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్` ఏర్పాటై ఇప్పటికే దశాబ్దం పూర్తి చేసుకుందనే విషయం మాత్రం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
తెలుగు సినిమా రంగానికి సంబంధించి కీలక పరిణామాల మధ్య దశాబ్దం క్రితమే స్థాపించబడిన ఏపీ ఫిలిం ఛాంబర్, ఇటీవల తన ప్రయాణంలో విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని మంగళగిరి సమీపంలోని హ్యాపీ రిసార్ట్స్‌లో ఘనంగా దశాబ్ది వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం, ఏపీ నాటక అకాడమి చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ఛాంబర్ పూర్వ అధ్యక్షులు ఎ.యం. రత్నం, కొత్త బసిరెడ్డి, సీనియర్ దర్శకులు రేలంగి నరసింహారావు తదితర ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ వేదికగా సినీ రంగంలో విశేష సేవలందించిన ప్రముఖులను ఘనంగా సత్కరించారు. సినీ పెద్దలు మాగంటి మురళీ మోహన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేయగా.. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన `కమిటీ కుర్రాళ్ళు` నిర్మాత కొణిదెల నిహారిక ఆమె టీమ్‌ను, అలాగే ఉత్తమ బాలల చిత్రంగా అవార్డు గెలుచుకున్న `35 చిన్న కథ కాదు` చిత్ర యూనిట్‌ను ఘనంగా సత్కరించారు. వీరితో పాటు ప్రముఖ నటి లయ, నూతన నటీనటులు, దర్శకులు జో శర్మ, మోహన్ వడ్లపట్ల, `కామాఖ్య` చిత్ర దర్శకుడు అదిరే అభి, సీనియర్ నటుడు శుభోదయం సుబ్బారావు తదితరులతో పాటు పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను ఈ వేడుకలో ఘనంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ, సెక్రటరీ జె.వి. మోహన్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ పి. విజయవర్మ, ట్రెజరర్ కె. రవీంద్రనాధ్ ఠాగూర్, జాయింట్ సెక్రటరీ పి.డి.ఆర్. ప్రసాద్ రెడ్డి , ఈసీ మెంబర్లు ఉప్పాల వెంకట్రావు, పి. రమణారెడ్డి, ఎం.ఎస్. చౌదరి, అనగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఒకవైపు ఘనంగా దశాబ్ది వేడుకలు జరుపుకోవడం, టాలెంటెడ్ నటీనటులను, టెక్నీషియన్‌లను సత్కరించుకోవడం ద్వారా ఛాంబర్ తన ఉనికిని చాటుకుంది.
అయితే ఏపీ ఫిలిం ఛాంబర్ ఏర్పడి 10 ఏళ్లు గడిచినా.. అసలు ఈ దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినిమా పరిశ్రమ పురోభివృద్ధి కోసం ఈ సంస్థ ఏం చేసింది? ఇక్కడ ఎలాంటి సంచలనాత్మక కార్యకలాపాలు సాగాయి? అనే ప్రశ్నలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. కేవలం వేడుకలు, సత్కారాలకే పరిమితం కాకుండా.. ఏపీలో చలనచిత్ర రంగాన్ని అభివృద్ధి చేయడానికి, స్టూడియోల నిర్మాణం - షూటింగ్‌లకు రాయితీలు కల్పించేలా ఛాంబర్ ఏమేం సాధించింది అనే దానిపై భవిష్యత్తులో సరైన జవాబు రావాల్సి ఉంది.
