Begin typing your search above and press return to search.

మెగాస్టార్ విన్నపం...కూటమి సమ్మతం

ఉమ్మడి ఏపీ నుంచి నంది అవార్డులు ఇవ్వడం జరుగుతోంది. దానికి ఆరు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. అయితే చివరి సారిగా 2017లో ఏపీలో నంది అవార్డులు నిర్వహించారు.

By:  Satya P   |   22 March 2026 9:15 AM IST
మెగాస్టార్ విన్నపం...కూటమి సమ్మతం
X

ఉమ్మడి ఏపీ నుంచి నంది అవార్డులు ఇవ్వడం జరుగుతోంది. దానికి ఆరు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. అయితే చివరి సారిగా 2017లో ఏపీలో నంది అవార్డులు నిర్వహించారు. ఆ తరువాత వివిధ కారణాల వల్ల నిలిపి వేశారు. అయితే తెలంగాణాలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక గద్దర్ అవార్డుల పేరుతో వాటిని పునరుద్ధరించారు. దాంతో ఏపీ ప్రభుత్వం కూడా నంది అవార్డులు ఇస్తామని చాలా కాలంగా చెబుతోంది. ఇక లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి అయితే గద్దర్ అవార్డుల వేదిక మీద నుంచి కూటమి ప్రభుత్వానికి ఒక విన్నపం చేశారు. ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమను ప్రోత్సహించడంతో వెనుకంజలో ఉందని అన్నారు. అక్కడ కూడా నంది అవార్డులు ఇవ్వాలని ఆయన సూచించారు.

త్వరలోనే అంటూ :

అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ విధంగా కోరిన నేపథ్యంలో ఏపీలో కూటమి ప్రభుత్వం దానికి తగిన విధంగానే స్పందించింది. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తాజాగా ఈ విషయంలో తన స్పందనను తెలియచేశారు. తొందరలోనే నంది అవార్డులను ఏపీలో కూడా ఇస్తామని ఆయన ప్రకటించారు కేవలం సినిమాలకు మాత్రమే కాకుండా టీవీ నాటక రంగానికి చెందిన కళాకారులకు కూడా నంది అవార్డులను అందిస్తామని ఆయన ప్రకటించడం విశేషం.

వారిని అండగా :

ఏపీలో కూటమి ప్రభుత్వం కళాకారులకు అండగా ఉంటుందని మంత్రి చెప్పారు. వారికి తగిన గుర్తింపు గౌరవం అందించడంతో ఎపుడూ ముందు ఉంటుందని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ విషయంలో తగిన కసరత్తు కూడా చేస్తున్నామని మంత్రి వెల్లడించడం విశేషం. దాంతో నంది అవార్డులు తొందరలోనే ఏపీ ప్రభుత్వం కూడా ఇస్తుంది అన్న ప్రచారం అయితే మొదలైంది.

సినీ పరిశ్రమ కోసం :

ఏపీలో కూడా సినీ పరిశ్రమ అభివృద్ధి చెందేలా తమ ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. విశాఖలో ఎన్నో మంచి లోకేషన్స్ ఉన్నాయని కందుల దుర్గేష్ గుర్తు చేశారు. అంతే కాదు సినిమా నిర్మాణానికి తగిన ప్రోత్సాహం తమ ప్రభుత్వం కల్పిస్తోంది అని చెప్పారు. రానున్న కాలంలో నిర్మాణ సంస్థలను ఏపీకి ఆహ్వానిస్తామని మంత్రి చెప్పడం విశేషం. ఇదిలా ఉంటే తొందరలోనే నంది నాటకోత్సవాలని కూడా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. మొత్తం మీద చూస్తే కనుక నంది అవార్డులకు సంబంధించి విధి విధానాలను ప్రభుత్వం వీలైనంత త్వరగా ప్రకటిస్తుంది అని అంటున్నారు. దాంతో ఏపీ కూడా నందులతో సినీ పరిశ్రమకు కను విందు చేయనుంది అని అంతా అంటున్నారు