హాట్ టాపిక్ : వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు!
ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు వైసీపీ సభ్యుల హాజరు మరోసారి హాట్ టాపిక్ కు దారితీస్తోంది.
By: Tupaki Political Desk | 12 Aug 2026 2:11 PM ISTఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు వైసీపీ సభ్యుల హాజరు మరోసారి హాట్ టాపిక్ కు దారితీస్తోంది. ఈ నెల 17న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. అదే రోజు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఇదే సమయంలో అసెంబ్లీకి హాజరుకాకుండా వైసీపీ సభ్యులు జీతాలు తీసుకోవడంపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకుండా బయట సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని, అయితే సభకు వచ్చి సీట్లో కూర్చుంటేనే వారి హాజరు పరిగణనలోకి తీసుకుంటామని స్పీకర్ స్పష్టం చేశారు. సభలో సభ్యుల సీట్లకు కెమెరాలు అమర్చామని, వాటి నుంచే హాజరు తీసుకుంటామని స్పీకర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.
వైసీపీ సభ్యుల హాజరుపై స్పీకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అసెంబ్లీకి వరుసగా 60 రోజుల గైర్హాజరు అయినవారిపై అనర్హత వేటు వేస్తామని తొలి నుంచి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హెచ్చరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే వైసీపీ సభ్యులు మాత్రం స్పీకర్ బెదిరింపులను లెక్కచేయడం లేదు. అదే సమయంలో సభకు హాజరైనట్లు రిజిస్టర్లలో సంతకాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే సభలోకి అడుగుపెట్టి చర్చల్లో పాల్పంచుకుంటేనే సభకు వచ్చినట్లు పరిగణిస్తామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
విపక్షాన్ని ఇరుకన పెట్టేందుకే ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేశారా? లేక ఇంకేమైనా రహస్య అజెండా ఉందా? అనే చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం తమకు విపక్ష హోదా ఇవ్వనందున అసెంబ్లీకి హాజరుకామని మాజీ సీఎం జగన్మోహనరెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. సభలో నాలుగు పార్టీలు ఉండగా, మూడు పార్టీలు అధికార కూటమిలో ఉండగా, తాము విపక్షంలో ఉన్నామని తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే అధికార కూటమి మాత్రం వైసీపీకి విపక్ష హోదా ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. నిబంధనల ప్రకారం 18 సీట్లు ఉంటేనే విపక్ష హోదా ఇస్తామని చెబుతోంది.
ఇదే సమయంలో విపక్ష హోదాకు సంబంధం లేకుండా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని కూటమి పార్టీలతోపాటు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరుతున్నారు. ఎమ్మెల్యేలు సభకు రాని పక్షంలో వారి సభ్యత్వం రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా మరోసారి ఈ టాపిక్ హీట్ పుట్టిస్తోంది. ప్రభుత్వం, స్పీకర్ ఏం చేసినా సరే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేవరకు తాము అసెంబ్లీకి వచ్చేది లేదని విపక్ష ఎమ్మెల్యేలు తేల్చిచెబుతున్నారు. దీంతో వారు బయట సంకతాలు చేసి వెళ్లిపోతే హాజరైనట్లు పరిగణనలోకి తీసుకోమని, సభలోకి వచ్చి కూర్చోవాలని స్పీకర్ స్పష్టం చేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం సభలో అడుగుపెట్టే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. దీంతో వైసీపీ సభ్యులపై అనర్హత వేటు వేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తుందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అందుకు రాజ్యాంగం అనుమతి ఇస్తుందా? అనే చర్చ కూడా జరుగుతోంది.
