నీలగా కొత్త ప్రయాణం టాలీవుడ్ లో టర్నింగ్!
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా నీరాజనాలు అందుకున్న అనుష్క శెట్టి సరిహద్దులు దాటి మాలీవుడ్‌లో అడుగుపెడుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 20 March 2026 1:00 AM ISTతెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా నీరాజనాలు అందుకున్న అనుష్క శెట్టి సరిహద్దులు దాటి మాలీవుడ్‌లో అడుగుపెడుతోన్న సంగతి తెలిసిందే. జయసూర్య కథానాయకుడిగా నటిస్తోన్న `కథనార్: ది వైల్డ్ సోర్సెరర్` చిత్రంలో అనుష్క నీల అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రను పోషిచండం టాలీవుడ్‌లోనూ పెద్ద చర్చకు దారితీసింది. ఈ ప్రయాణం టాలీవుడ్ కి పూర్తి భిన్నమైంది. తెలుగు లో బిజీగా ఉన్నంత కాలం పాజిటివ్ పాత్రలే పోషించారు. కానీ తొలిసారి క్రూరమైన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను ఎంచుకోవడం ఆమె కెరీర్‌లోనే అతిపెద్ద టర్నింగ్ పాయింట్ గా చెప్పొచ్చు.
సాధారణంగా ఒకసారి స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత హీరోయిన్లు విలన్ పాత్రలు చేయడానికి సాహసించరు. కానీ అనుష్క ఈ పాత పద్ధతిని బ్రేక్ చేస్తున్నారు. మాలీవుడ్‌లో ఆమె పోషించే నీల పాత్ర గనుక క్లిక్ అయితే తెలుగులోనూ హీరోయిన్ల పాత్రల చిత్రణలో భారీ మార్పులు వచ్చే అవకాశం లేకపోలేదు. కేవలం గ్లామర్ లేదా సాఫ్ట్ రోల్స్ మాత్రమే కాకుండా కథను మలుపు తిప్పే బలమైన ప్రతినాయిక పాత్రలు చేయడానికి టాలీవుడ్ అగ్ర తారలకు ఇది ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. అనుష్క తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్‌లో ఆమె తదుపరి సినిమాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఒక నటిగా తనలోని విలనిజాన్ని ఎంత ప్రభావవంతంగా పండించగలరో ‘కథనార్’ నిరూపిస్తే? తెలుగులోని అగ్ర దర్శకులు ఆమె కోసం ప్రత్యేకంగా నెగటివ్ టచ్ ఉన్న లేడీ ఓరియంటెడ్ కథలను సిద్ధం చేసే అవకాశం ఉంది. `బాహుబలి`లో దేవసేనగా అనుష్క ప్రదర్శించిన పగను ఆ పాత్రకే వన్నే తీసుకొచ్చింది. అదే పగ ఓ విలనీగా పండిస్తే అది వేరే లెవల్లో ఉంటుంది. ఆమె నటనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించినట్లే అవుతుంది.
ప్రస్తుతం ఇండియన్ సినిమాలో విలన్ పాత్రలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హీరోలకు సమానంగా విలన్లకు ప్రాధాన్యత లభిస్తోంది. అనుష్క వంటి స్టార్ నటి విలన్‌గా మారడం వల్ల టాలీవుడ్‌లో మల్టీస్టారర్ ట్రెండ్‌కు కొత్త అర్థం రావచ్చు. అంటే? ఒక పెద్ద హీరో సినిమాలో అనుష్క విలన్‌గా నటిస్తే ఆ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇది తెలుగు సినిమాల మార్కెట్ పరిధిని పెంచుతుంది అనడంలో సందేహం లేదు.
మాలీవుడ్ ఎప్పుడూ నటనకు ప్రాధాన్యత ఇచ్చే పరిశ్రమ. అక్కడ అనుష్క చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్ అయితే టాలీవుడ్ మేకర్స్ ఆమెను కేవలం `జేజమ్మ` ఇమేజ్ లోనే చూడకుండా? ఎలాంటి పాత్ర అయినా పోషించగల కంప్లీట్ యాక్టర్ గా గుర్తిస్తారు. దీనివల్ల ఆమెకు సెకండ్ ఇన్నింగ్స్‌లో మరిన్ని వైవిధ్యమైన, ప్రయోగా త్మకమైన అవకాశాలు వెల్లువెత్తుతాయి. ఒక రకంగా చెప్పాలంటే నీల పాత్ర అనుష్క తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేస్తున్నట్లే. టాలీవుడ్ హీరోయిన్ల భవిష్యత్తుకు ఒక కొత్త మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది. టాలీవుడ్‌లో అనుష్క స్థానం మరింత సుస్థిరం అవుతుంది. హీరోయిన్ అంటే కేవలం కథానాయకుడి వెనుక ఉండే పాత్ర కాదు. కథను శాసించే విలనీ కూడా అవ్వొచ్చని నిరూపించే రోజులు దగ్గర పడినట్లే. అనుష్క చేస్తోన్న ఈ తెగింపు టాలీవుడ్ లో ఓ కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని చెప్పొచ్చు.
