Begin typing your search above and press return to search.

అనుష్క శెట్టి నిక‌ర సంప‌ద విలువ‌? న‌టించ‌క‌పోయినా నెల‌కు కోటి రెవెన్యూ!

అయితే ఈ 130 కోట్ల పైచిలుకు ఆస్తులు కేవలం పారితోషికాల ద్వారానే రాలేదు. అనుష్కకు తన కుటుంబం నుండి కూడా గణనీయమైన ఆస్తిపాస్తులు సంక్రమించాయి.

By:  Sivaji Kontham   |   10 March 2026 9:42 AM IST
అనుష్క శెట్టి నిక‌ర సంప‌ద విలువ‌? న‌టించ‌క‌పోయినా నెల‌కు కోటి రెవెన్యూ!
X

టాలీవుడ్ `జెజమ్మ`గా, లేడీ సూపర్ స్టార్‌గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న అనుష్క శెట్టి గత రెండు దశాబ్దాలుగా వెండితెరపై తిరుగులేని కథానాయికగా రాణిస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన `సూపర్` సినిమాతో సినీ రంగప్రవేశం చేసిన ఈ యోగా శిక్ష‌కురాలు అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం.. అనుష్క శెట్టి నికర ఆస్తి విలువ సుమారు 133 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ప్ర‌ముఖ జాతీయ మీడియా త‌న క‌థ‌నంలో పేర్కొంది. సినిమాలు తగ్గించినా కానీ.. నెలకు దాదాపు ఒక కోటి రూపాయల వరకు ఆదాయం గడిస్తూ స్వీటీ తన ఆర్థిక సామ్రాజ్యాన్ని పటిష్టంగా ఉంచుకుంది.

అనుష్క కెరీర్ ప్రారంభంలో సాధారణ పారితోషికమే తీసుకున్నా కానీ..`అరుంధతి` సినిమా తర్వాత రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ సినిమా ఘనవిజయంతో టాలీవుడ్‌లో మొదటిసారిగా కోటి రూపాయల పారితోషికం అందుకున్న కథానాయికగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం స్వీటీ ఒక్కో సినిమాకు 6 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తోంది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా ఏడాదికి సుమారు 12 కోట్ల రూపాయల ఆదాయం పొందుతూ తన సంపదను పెంచుకుంటోంది.

అయితే ఈ 130 కోట్ల పైచిలుకు ఆస్తులు కేవలం పారితోషికాల ద్వారానే రాలేదు. అనుష్కకు తన కుటుంబం నుండి కూడా గణనీయమైన ఆస్తిపాస్తులు సంక్రమించాయి. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన స్వీటీ కుటుంబానికి అక్కడ భూములు, తోటలు ఉన్నాయి. వీటికి తోడు త‌న ఆర్థిక ప్ర‌ణాళిక‌, తెలివైన పెట్టుబడులు కూడా నికర ఆస్తులు పెర‌గ‌డానికి తోడయ్యాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో అనుష్క‌ భారీగా పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఖరీదైన విల్లాలు, అపార్ట్‌మెంట్లు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో సొంత ఇళ్లు ఉండగా.. బెంగళూరులో కూడా భారీగా స్థిరాస్తి పెట్టుబడులు ఉన్నాయి.

అనుష్క పెట్టుబడుల విషయానికి వస్తే.. కేవలం రియల్ ఎస్టేట్‌కే పరిమితం కాలేదు. ర‌క‌ర‌కాల‌ వ్యాపారాల్లో షేర్ హోల్డ‌ర్ గా ఉండటంతో పాటు, షేర్ మార్కెట్ .. స్టార్టప్ కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టినట్లు క‌థ‌నాలొచ్చాయి. అనుష్క‌ ప్రారంభంలో పెట్టిన చిన్న పెట్టుబడులు నేడు కోట్లకు పెరిగి పెద్దవయ్యాయి. సినిమాల్లో నటించకపోయినా నెలకు కోటి రూపాయల ఆదాయం వస్తోందంటే.. అది స్వీటీ పక్కా ప్లానింగ్ వ్యాపార దార్శనికతకు నిదర్శనం.

సినిమాల విషయానికి వస్తే.. క్రిష్ దర్శకత్వంలో రూపొందించిన `ఘాటి` ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. దీని తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలో ఓ సినిమాకి సంత‌కం చేసింది. 2026లో విడుదల కానున్న `కథనార్: ది వైల్డ్ సోర్సెరర్` అనే భారీ బడ్జెట్ సోషియో-ఫాంటసీ చిత్రంలో ఆమె నటిస్తోంది. జయసూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా మలయాళంలో స్వీటీకి మొదటి చిత్రం.

నిబద్ధత కలిగిన నటిగా, యోగా టీచర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన అనుష్క.. నేడు 130 కోట్లకు అధిపతిగా ఎదగడం వెనుక త‌న‌ కష్టం, వృత్తిగ‌త‌ నిబ‌ద్ధ‌త‌, క్రమశిక్షణ ఉన్నాయి. గ్లామర్ పాత్రలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ.. సినీరంగంలో నిల‌దొక్కుకున్నారు. మరోవైపు ఆర్థికంగా తనను తాను పటిష్టం చేసుకుంటూ సాగుతున్న స్వీటీ శెట్టి ప్రయాణం ఎందరో యువ నటీమణులకు స్ఫూర్తిదాయకం.

(ప్ర‌ముఖ జాతీయ మీడియాలు, ఇత‌ర సోర్స్ ఆధారంగా ఈ క‌థ‌నం)