Begin typing your search above and press return to search.

బ‌యోపిక్స్ లో అనుష్క శెట్టికి అవ‌కాశ‌మే లేదా?

దక్షిణాది చిత్రసీమలో లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న నటి అనుష్క శెట్టి. నాయికా ప్రాధాన్యమున్న చిత్రాలకు చిరునామాగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన ఘనత స్వీటీది

By:  Srikanth Kontham   |   18 Sept 2026 9:00 PM IST
బ‌యోపిక్స్ లో అనుష్క శెట్టికి అవ‌కాశ‌మే లేదా?
X

దక్షిణాది చిత్రసీమలో లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న నటి అనుష్క శెట్టి. నాయికా ప్రాధాన్యమున్న చిత్రాలకు చిరునామాగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన ఘనత స్వీటీది. `అరుంధతి`, `బాహుబలి`, `భాగమతి లాంటి సినిమాలతో గంభీరమైన నటనను ప్రపంచానికి చాటిచెప్పిన అనుష్క కెరీర్‌లో పెద్ద లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ట్రెండ్‌గా మారిన బయోపిక్ చిత్రాల్లో ఇప్పటివరకు అనుష్క‌కు అవకాశం రాకపోవడం..కనీసం ఆమె పేరు పరిశీలనలోకి కూడా లేక‌పోవ‌డం విచారకరం.

కొన్నేళ్లుగా భారతీయ చిత్ర పరిశ్రమలో బయోపిక్స్ హవా నడుస్తోంది. క్రీడాకారులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు , చారిత్రక నటీమణుల నిజ జీవిత కథలను వెండితెరపై ఆవిష్కరించేందుకు దర్శక, నిర్మాతలు పోటీ పడుతున్నారు. తోటి కథానాయికలు నిజ జీవిత పాత్రల్లో ఒదిగిపోతూ జాతీయ అవార్డులు, ప్రశంసలు అందుకుంటుంటే? అనుష్క లాంటి సీనియర్ పేరు ఏ బయోపిక్ రేసులో ఎక్కడా వినిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

గతంలో అనుష్క రుద్రమదేవి చిత్రంలో కాకతీయ వీరనారిగా న‌టించినా? అది చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాటిక్ యాక్షన్ డ్రామాగా మాత్రమే నిలిచింది తప్ప స్వచ్ఛమైన బయోపిక్‌గా గుర్తింపు పొందలేదు. నిజమైన వ్యక్తిత్వాలు, కాలానికి తగిన మానవీయ కోణాలు, మానసిక సంఘర్షణలతో కూడిన బయోపిక్ పాత్రలు స్వీటీ ఖాతాలో పడలేదు. ఇండస్ట్రీలో ప్రాజెక్టుల ఎంపిక విషయంలో అనుష్కను లార్జర్ ద్యాన్ లైఫ్, ఫాంటసీ, రాయల్ పాత్రలకే పరిమితం చేస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది.

ఈ పరిస్థితికి అనేక కారణాలు ఉండొచ్చ‌ని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అనుష్క ఇటీవలి కాలంలో సినిమాల ఎంపికలో వేగం తగ్గించి సెలెక్టివ్‌గా వ్యవహరిస్తుంది. మరోవైపు దర్శకులు కూడా ఆమె స్టార్‌డమ్‌కు తగ్గ బయోపిక్ స్క్రిప్ట్‌లను రూపొందించడంలో విఫలమవుతున్నారు. అనుష్క‌ గంభీరమైన రూపంతో పాటు `విక్ర మార్కుడు`, `వేదం` లాంటి చిత్రాల్లో చూపించిన వైవిధ్యమైన నటనను మర్చిపోయి కాస్ట్యూమ్ డ్రామాలకే ఆలోచించడం దర్శకుల దృష్టి లోపంగానే భావించాలి.

నటిగా అనుష్క సామర్థ్యం ఎలాంటిందో? ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. `సైజ్ జీరో` కోసం శరీరాన్ని మార్చుకున్న తీరు, `వేదం`లో సరోజగా చూపించిన భావోద్వేగాలు ఆమెలోని నటనా పటిమకు నిదర్శనాలు. నిజ జీవిత పాత్రను భుజాలపై మోసి దానికి ప్రాణప్రతిష్ఠ చేయగల అన్ని అర్హతలు, ఆత్మవిశ్వాసం ఆమెకు పుష్కలంగా ఉన్నాయి. అయినా? గొప్ప బయోపిక్‌లో నటించే అవకాశం అనుష్క‌ తలుపు తట్టకపోవడం టాలీవుడ్‌లోనే కాక సౌత్ ఇండియాలోనే ఒక లోటుగా చెప్పొచ్చు.

అనుష్క శెట్టి లాంటి దిగ్గజ నటి కెరీర్ పరిపూర్ణం కావాలంటే ఆమె ఖాతాలో క్లాసిక్ బయోపిక్ చేరడం అవ‌స‌రం. ఇప్పటికైనా దర్శక, రచయితలు మూస ధోరణి పాత్రలకే పరిమితం కాకుండా అనుష్క‌ నటనా పరిణతికి సరిపోయే బయోపిక్ కథలతో ముందుకు రావలసి ఉంది. లేడీ సూపర్‌స్టార్‌గా చరిత్ర సృష్టించిన అనుష్క శెట్టి గొప్ప నిజ జీవిత పాత్ర ద్వారా వెండితెరపై మళ్లీ విశ్వరూపం చూపించాలని అభిమానులు, సినీ ప్రేమికులు ఆశిస్తున్నారు.