Begin typing your search above and press return to search.

ఇలా రాసేది జ‌ర్న‌లిజం కాదు.. పెళ్లి పుకార్ల‌పై అనుష్క సీరియ‌స్!

తాజాగా స్వీటీ అనుష్క శెట్టి టీమ్ దీనిపై స్పందించింది. అనుష్కకు పెళ్లి అంటూ ఇటీవ‌ల ఊహాగానాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు.

By:  Sivaji Kontham   |   19 March 2026 11:21 AM IST
ఇలా రాసేది జ‌ర్న‌లిజం కాదు.. పెళ్లి పుకార్ల‌పై అనుష్క సీరియ‌స్!
X

స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క శెట్టికి తొంద‌ర్లోనే పెళ్లి అంటూ సోష‌ల్ మీడియాల్లో ప్ర‌చారం హోరెత్తిపోతోంది. అంతేకాదు.. అనుష్క‌పై అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డం రొటీన్ గా మారింది. స్వీటీ వ‌య‌సు కాస్త ఎక్కువేనంటూ కొంద‌రు అన‌వ‌స‌ర కామెంట్లు చేస్తున్నారు. ఒక మ‌హిళ వ్య‌క్తిగ‌త విష‌యాల‌పై గోప్య‌త‌ను గౌర‌వించ‌కుండా ఇష్టానుసారం సామాజిక మాధ్య‌మాల‌లో ప్ర‌చారం చేయ‌డం స‌రైన‌దేనా? అంటే ఇది వంద‌శాతం త‌ప్పు. ఇక సైబ‌ర్ సెక్యూరిటీ నియ‌మాల ప్ర‌కారం.. త‌ప్పుడు ప్ర‌చారం చేసి ఎదుట వ్య‌క్తికి డ్యామేజ్‌ క‌లిగిస్తే అధిక మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దు..

తాజాగా స్వీటీ అనుష్క శెట్టి టీమ్ దీనిపై స్పందించింది. అనుష్కకు పెళ్లి అంటూ ఇటీవ‌ల ఊహాగానాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. కానీ ఇవ‌న్నీ కేవ‌లం త‌ప్పుడు క‌థ‌నాలేన‌ని అనుష్క వ్య‌క్తిగ‌త బృందం ఖండించింది. వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రించి రాసేది ఎప్పుడూ జ‌ర్న‌లిజం కాదు.. ఒక‌రి వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను ఇలా య‌థేచ్ఛ‌గా ఇష్టానుసారం రాసేయ‌డం స‌రికాద‌ని అనుష్క‌ టీమ్ ఖండించారు. ఎలాంటి అధికారిక ధృవీక‌ర‌ణ లేకుండా హెడ్ లైన్ కోసం పాకులాడ‌టం స‌రి కాద‌ని వాస్త‌వాలు తెలుసుకోవాల‌ని కూడా స్వీటీ బృందం కోరింది.

ముఖ్యంగా అనుష్క వ‌య‌సు గురించి చేస్తున్న రాద్ధాంతం లేదా ప్ర‌చారాన్ని కూడా త‌న టీమ్ త‌ప్పు ప‌ట్టింది. నిజానికి మ‌గ తార‌ల‌తో పోలిస్తే ఎందుకు మ‌గువ‌ల‌ వ‌య‌సు గురించి ఇష్టానుసారం రాసేస్తున్నారు. ఇరువురికీ ఇది స‌మాన‌మే క‌దా! అని కూడా ఆందోళ‌న‌ను వ్య‌క్త‌ప‌రిచారు. మహిళా నటులనే టార్గెట్ చేయ‌డం స‌రికాద‌ని అభిప్రాయం వ్య‌క్త‌మైంది.

ఇక స్వీటీ అనుష్క కెరీర్ మ్యాట‌ర్ ని ప్ర‌స్థావిస్తూ...స్వీటీ ఎప్పుడూ ప్ర‌చార స్టంట్స్ ని న‌మ్మ‌ద‌ని.. అలాగే వ్య‌క్తిగ‌తంగా స్వేచ్ఛ‌గా త‌న జీవితాన్ని తాను గుట్టుగా గ‌డిపేందుకు ఇష్ట‌ప‌డ‌తార‌ని కూడా త‌న టీమ్ వెల్ల‌డించింది. వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి రాసేప్పుడు లేదా ప్ర‌చురించేప్పుడు మ‌మ్మ‌ల్ని అడిగి అధికారికంగా ధృవీక‌రించుకోండి. ఇలా అన‌వ‌స‌ర ప్ర‌చారం సాగించ‌డం స‌రికాదు! అని ఘాటుగా త‌మ ప్ర‌క‌ట‌న‌లో ప్ర‌స్థావించారు. పెళ్లి నిశ్చితార్థం వంటివి వ్య‌క్తిగ‌త విష‌యాలు.. ఇవి మీకు వ‌చ్చే క్లిక్ ల కోసం కాదు! అని కూడా ఖండించారు.

ఇప్ప‌టివ‌ర‌కూ అనుష్క‌పై సాగిన‌దంతా నిరాధార‌మైన ఫేక్ ప్ర‌చారం. దీనిని ఆపండి... వ్య‌క్తిగ‌త జీవితంపై వార్త‌లు ప్ర‌చురిస్తే అది గోప్య‌త‌కు భంగం క‌లిగించ‌డ‌మేన‌ని తెలిపారు. ఏదైనా ఒక వార్త రాసేముందు లేదా ప్ర‌చారం చేసే ముందు అధికారిక ప్ర‌క‌ట‌న కోసం వేచి ఉండ‌టం లేదా జ‌ర్న‌లిస్టు నేరుగా సెల‌బ్రిటీకి ఫోన్ చేసి మాట్టాడ‌టం చాలా చాలా ముఖ్యం.. ఇది జ‌ర్న‌లిజం మౌళిక సూత్రం. కానీ ఇలాంటి సూత్రాల‌కు విరుద్ధంగా కొంద‌రు సామాజిక మాధ్య‌మాల‌లో, ఇత‌ర‌ విజువ‌ల్ మాధ్య‌మంలోను ఇష్టానుసారం ప్ర‌చారం చేయ‌డం వ‌ల్ల‌నే ఇలా తాఖీదులు అందుకోవ‌డానికి కార‌ణ‌మ‌వుతోంది. అనుష్క కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. క‌థ‌నార్- ది వైల్డ్ సార్స‌ర‌ర్ అనే చిత్రంలో న‌టిస్తోంది.