అనుష్క.. మళ్లీ కనిపించేది ఎప్పుడు?
నిజానికి ఘాటీ ప్రమోషన్స్ టైమ్‌లోనే ఇకపై ఇంత గ్యాప్ తీసుకోనని, 2026 నుంచి తనను మరింత తరచుగా చూస్తారని అనుష్క చెప్పారు.
By: M Prashanth | 15 Sept 2026 11:21 AM ISTఘాటీ వచ్చి ఏడాది దాటిపోయింది. ఆ సినిమా తర్వాత అనుష్క నుంచి మరో తెలుగు సినిమా అనౌన్స్‌మెంట్ ఇప్పటివరకు రాలేదు. నిజానికి ఘాటీ ప్రమోషన్స్ టైమ్‌లోనే ఇకపై ఇంత గ్యాప్ తీసుకోనని, 2026 నుంచి తనను మరింత తరచుగా చూస్తారని అనుష్క చెప్పారు. కానీ సెప్టెంబర్ వచ్చేసినా పరిస్థితి మాత్రం పెద్దగా మారలేదు. ఆమె చేతిలో ఉన్న కథనార్ కూడా ఇంకా థియేటర్లకు రాలేదు.
కథనార్ అనుష్కకు మలయాళంలో తొలి సినిమా. జయసూర్య హీరోగా రోజిన్ థామస్ దర్శకత్వంలో భారీ ఫాంటసీగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో అనుష్క నీల అనే పాత్రలో కనిపించనున్నారు. మార్చిలోనే ట్రైలర్ కూడా విడుదల చేశారు. తెలుగు వెర్షన్‌ను కూడా అప్పుడే బయటకు తీసుకొచ్చారు. కానీ సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఇప్పటికీ ఫిక్స్ కాలేదు. ఇటీవల జయసూర్య కూడా సరదాగా దర్శకుడిని రిలీజ్ ఎప్పుడు అంటూ అడిగే పరిస్థితి వచ్చింది.
అనుష్క సినిమాల మధ్య గ్యాప్ రావడం కొత్త విషయం కాదు. బాహుబలి 2 తర్వాత భాగమతి వచ్చింది. ఆ తర్వాత నిశ్శబ్దం కోసం మరో రెండేళ్లు పట్టింది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి వచ్చే సమయానికి ఇంకో మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ సినిమా మంచి ఫలితం ఇచ్చినా వెంటనే మరో సినిమా చేయలేదు. ఘాటీ రావడానికి మళ్లీ రెండేళ్లు పట్టింది. ఇప్పుడు అదే గ్యాప్ మరోసారి మొదలైనట్లే ఉంది.
ఘాటీ విషయంలో మాత్రం అనుష్కకు అనుకున్న ఫలితం రాలేదు. క్రిష్ దర్శకత్వం, శీలావతి పాత్ర, యాక్షన్ కథ అంటూ విడుదలకు ముందు మంచి ఆసక్తి ఉన్నా సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. అయితే ఆ తర్వాత ఆమె ఏ తెలుగు కథకు ఓకే చెప్పారనే సమాచారం కూడా బయటకు రాలేదు. కొత్త దర్శకులతో చర్చలు, వెబ్ ప్రాజెక్టులు అంటూ అప్పుడప్పుడు వార్తలు వస్తున్నా ఏదీ అధికారికంగా ముందుకు వెళ్లలేదు.
అనుష్కకు ఇప్పటికీ స్టార్స్ పక్కన హీరోయిన్‌గా మాత్రమే సినిమా చేయాల్సిన అవసరం లేదు. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి తర్వాత ఆమె పేరు మీదే సినిమా తీసుకెళ్లగల మార్కెట్ ఏర్పడింది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి లో నార్మల్ అమ్మాయి లాంటి పాత్ర కూడా చేయగలరు. కథనార్‌లో మళ్లీ ఫాంటసీ ప్రపంచంలోకి వెళ్లారు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నా సినిమాల సంఖ్య మాత్రం తగ్గిపోవడమే అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.
ప్రస్తుతానికి అనుష్కను మళ్లీ థియేటర్‌లో చూడాలంటే కథనార్ కోసమే ఎదురుచూడాలి. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉందని టీమ్ చెబుతోంది కానీ కొత్త రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. మరోవైపు తెలుగు సినిమా గురించి కూడా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. 2026 నుంచి ఎక్కువగా కనిపిస్తానని అనుష్క చెప్పిన మాట నెరవేరాలంటే, కథనార్ తర్వాత అయినా కొత్త సినిమా వెంటనే మొదలవ్వాలి.
