Begin typing your search above and press return to search.

అప్పటి డేరింగ్ డెసిషన్ ఇప్పటికీ వెంటాడుతుందా?

ఒకప్పుడు టాలీవుడ్‌ హీరోలతో వరుస విజయాలు అందుకుని స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన అనుష్క శెట్టి కోసం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

By:  M Prashanth   |   23 Jun 2026 1:00 AM IST
అప్పటి డేరింగ్ డెసిషన్ ఇప్పటికీ వెంటాడుతుందా?
X

ఒకప్పుడు టాలీవుడ్‌ హీరోలతో వరుస విజయాలు అందుకుని స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన అనుష్క శెట్టి కోసం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కెరీర్ లో తీసుకున్న ఒక డేరింగ్ డెసిషన్ ఇప్పటికీ ఆమె సినీ జర్నీపై ఎఫెక్ట్ చూపుతోందా అనే చర్చ వినిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల ఆమె సినిమాల సెలక్షన్, ల్యాంగ్ గ్యాప్‌ లు, కొత్త ప్రాజెక్టులపై క్లారిటీ లేకపోవడం అభిమానులను ఆలోచనలో పడేస్తోంది.

అనుష్క ఇండస్ట్రీలోకి రాకముందు యోగా ట్రైనర్ గా వర్క్ చేసిన విషయం తెలిసిందే. బెంగళూరులో చదువుకున్న ఆమె ఫేమస్ యోగా టీజర్ భరత్ ఠాకూర్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నారు. నటిగా మారాలనే ఆలోచన లేకుండానే జీవితం సాగుతున్న సమయంలో దర్శకుల దృష్టిలో పడిన ఆమె, 2005లో విడుదలైన సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదని చెప్పాలి.

విక్రమార్కుడు, అరుంధతి, భాగమతి వంటి చిత్రాలతో నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క, కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ స్టోరీస్ తో కూడిన చిత్రాల్లోనూ తనదైన క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా బాహుబలి సిరీస్‌ లో దేవసేన రోల్ ఆమెకు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తీసుకొచ్చింది. ఒక జెనరేషన్ ఆడియన్స్ కు ఆమె జేజమ్మ, దేవసేనగా గుర్తుండిపోయారు.

అయితే ఆమె కెరీర్‌ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచిన చిత్రం సైజ్ జీరో. ఆ సినిమాలో రోల్ కోసం అనుష్క బాగా బరువు పెరగడం అప్పట్లో అందరి ప్రశంసలు అందుకుంది. పాత్ర కోసం అంతటి డెడికేషన్ చూపించడం ఆమె ప్రొఫెషనలిజానికి ఎగ్జాంపుల్ గా నిలిచింది. కానీ అదే నిర్ణయం తర్వాత ఆమె కెరీర్‌ పై ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

బరువు తగ్గేందుకు ప్రయత్నించినప్పటికీ గతంలో ఉన్న ఫిట్‌ నెస్‌ ను పూర్తిగా తిరిగి పొందలేకపోయారనే చర్చ సాగుతోంది. ఇటీవలి కాలంలో అనుష్క సినిమాల మధ్య గ్యాప్ కూడా పెరిగింది. రెండు, మూడు సంవత్సరాలకు ఒక సినిమా మాత్రమే చేస్తుండటంతో ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు. గత ఏడాది విడుదలైన ఘాటిపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

దీంతో ఆమె తదుపరి ప్రాజెక్టులపై మరింత ఆసక్తి నెలకొంది. ఘాటి విడుదలై నెలలు గడిచినా ఇప్పటివరకు అనుష్క కొత్త తెలుగు మూవీపై అనౌన్స్మెంట్ రాలేదు. కొన్ని డిజిటల్ ప్రాజెక్టులు, వెబ్ సిరీస్‌ల కోసం చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చినప్పటికీ అవేం నిజం కాదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో కతనార్ అనే మాలీవుడ్ పీరియాడిక్ మూవీ మాత్రమే ఉంది. అయితే ఒకప్పుడు సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో తొలి సెలెక్షన్ అయిన అనుష్కకు ఇప్పుడు ఛాన్సులు తగ్గాయా? లేక సరైన కథ, పాత్ర కోసం ఎదురు చూస్తున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అయితే నటిగా ఆమెకు ఉన్న గుర్తింపు, అభిమానుల్లో క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. మంచి కథతో, స్ట్రాంగ్ రోల్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తే అనుష్క మరోసారి అదరగొడతారనే నమ్మకం అభిమానుల్లో ఉంది. పాత్ర కోసం తీసుకున్న అప్పటి డేరింగ్ నిర్ణయం ఆమె కెరీర్‌ ను ఒకవైపు ప్రత్యేకంగా నిలబెట్టినా, మరోవైపు సవాళ్లు కూడా తెచ్చిపెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి స్వీటీ ఎప్పుడు పవర్‌ ఫుల్ కంబ్యాక్ ఇస్తారన్నది వేచి చూడాలి.