అనుష్క నెక్స్ట్.. వెండితెరపై దర్శనం ఎప్పుడంటే?
టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి, బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోలతో సమానంగా హిట్స్ అందుకుంటూ వస్తోంది.
By: M Prashanth | 5 Aug 2025 3:33 PM ISTటాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి, బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోలతో సమానంగా హిట్స్ అందుకుంటూ వస్తోంది. ఇక ఆమె వెండితెరపై కనిపించి చాలా కాలమైంది. అయినప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఇక మరోసారి తన స్టామినా చూపించేందుకు రెడీ అవుతున్నారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సక్సెస్ తర్వాత ఆమె కొత్త సినిమాల ఎంపికలో కాస్త గ్యాప్ తీసుకుంది. కానీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అనుష్క కొత్త మూవీ గురించి ఇప్పుడు అధికారిక సమాచారం వచ్చింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ‘ఘాటి’ సినిమాతో మరోసారి భారీ హిట్ కోసం ప్రయత్నిస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ విషయంలో ఫైనల్ గా ఒక క్లారిటీ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఈ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం
అనుష్క కెరీర్ ని పరిశీలిస్తే, స్త్రీ ప్రధాన పాత్రల్లోనే ఆమెకు ఎక్కువ విజయాలు దక్కాయి. ‘అరుంధతి’, ‘భాగమతి’ లాంటి చిత్రాలతో బాక్సాఫీస్ దద్దరిల్లింది. ఈ నేపథ్యంలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఘాటి’పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ‘వేదం’ తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం కావడంతో మరింత హైప్ వచ్చింది. ఈసారి కూడా అనుష్క పవర్‌ఫుల్ పాత్రలో కనపడబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.
మొదటగా ఏప్రిల్ 18నే రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ, షూటింగ్ లో కీలక సీన్లు పెండింగ్ అవడం, వాయిదాలు రావడం వల్ల విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం షూటింగ్ పూర్తయ్యింది. నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకు త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. అదే రోజు అధికారిక విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఆ రోజున రాబోతున్నా ఘాటీ
ఇంతకాలంగా పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాకు చివరికి డేట్ ఫిక్స్ అయ్యింది. నిర్మాత రాజీవ్ రెడ్డి, సాయి బాబా నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈసారి టెక్నికల్ టీమ్ కూడా బలంగా ఉంది. ట్రైలర్ విడుదలకు భారీ ప్లాన్ తో తయారవుతున్నారు. మ్యూజిక్, విజువల్స్, కథ అంచనాలకన్నా పెద్దగా ఉండబోతున్నాయని యూనిట్ చెబుతోంది. ట్రైలర్ విడుదలైన తర్వాతే సినిమా మీద ఓవర్ ఆల్ బజ్ ఇంకొంత పెరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే అనుష్క లుక్ పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
క్రిష్, అనుష్క కాంబో మళ్లీ మేజిక్ చేస్తుందా?
‘వేదం’తో ఓ బోల్డ్ క్యారెక్టర్ ని ఆవిష్కరించిన ఈ కాంబినేషన్.. ఇప్పుడు ‘ఘాటి’ ద్వారా మరోసారి సంచలనానికి తెరతీసే అవకాశం ఉంది. కథ బలంగా ఉందని, అనుష్క పెర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అవుతుందని మేకర్స్ నమ్ముతున్నారు. ‘అరుంధతి’, ‘భాగమతి’ తరహాలో ఘాటి కూడా పవర్ ఫుల్ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ గా నిలుస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక సెప్టెంబర్ 5న అనుష్క ‘ఘాటి’ బాక్సాఫీస్ లో దుమ్ము రేపేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ట్రైలర్‌తో వచ్చే అంచనాలు, ప్రమోషన్ స్ట్రాటజీ బట్టి సినిమా హిట్ రేంజ్ ఎక్కడి దాకా వెళ్లబోతుందో చూడాలి.
