Begin typing your search above and press return to search.

26 కోట్ల‌తో స్టార్ హీరోయిన్ అపార్ట్‌మెంట్ కొనుగోలు- ప్ర‌ముఖ గాయ‌కుడు త‌గ్గేదేలే!

ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో బాలీవుడ్ సెలబ్రిటీల హవా రోజురోజుకూ పెరుగుతోంది.

By:  Sivaji Kontham   |   7 Oct 2026 9:31 AM IST
26 కోట్ల‌తో స్టార్ హీరోయిన్ అపార్ట్‌మెంట్ కొనుగోలు- ప్ర‌ముఖ గాయ‌కుడు త‌గ్గేదేలే!
X

ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో బాలీవుడ్ సెలబ్రిటీల హవా రోజురోజుకూ పెరుగుతోంది. కేవలం విలాసవంతమైన విల్లాలకే పరిమితం కాకుండా.. భవిష్యత్తు పెట్టుబడుల కోసం ప్రముఖులు గేటెడ్ కమ్యూనిటీలు - కమర్షియల్ ప్రాపర్టీలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన తల్లిదండ్రులతో కలిసి ముంబైలో భారీ ప్రాపర్టీని కొనుగోలు చేయగా.. మరోవైపు స్టార్ సింగర్ సోను నిగమ్ సైతం తన కుటుంబ భవిష్యత్తు కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ఆస్తులను సొంతం చేసుకోవడం ప్రస్తుతం సినీ, రియల్ ఎస్టేట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ముంబైలోని ప్రతిష్టాత్మక ప్రాంతమైన వెర్సోవాలోని యారీ రోడ్డులో గోద్రెజ్ ప్రాపర్టీస్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న `గోద్రెజ్ స్కైషోర్` ప్రాజెక్ట్‌లో అనుష్క శర్మ కుటుంబం భారీ పెట్టుబడి పెట్టింది. క్రె మెట్రిక్స్ రికార్డుల ప్రకారం.. ఈ అండర్-కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్‌లో అనుష్క శర్మ తన తల్లిదండ్రులతో కలిసి ఏకంగా రూ. 25.8 కోట్ల విలువైన రెండు లగ్జరీ అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేశారు. టవర్-ఎ లోని 24వ అంతస్తులో ఉన్న ఈ ప్రాపర్టీస్‌లో అనుష్క తన పేరిట సుమారు రూ. 14.9 కోట్ల విలువైన ఫ్లాట్‌ను దక్కించుకోగా..అదే టవర్‌లో ఆమె తల్లిదండ్రులు మరో రూ. 10.91 కోట్ల విలువైన ఫ్లాట్‌ను సంయుక్తంగా కొనుగోలు చేశారు.

ఈ రెండు ప్రాపర్టీల కొనుగోలుకు సంబంధించి స్టాంప్ డ్యూటీల రూపంలోనే భారీ మొత్తాన్ని చెల్లించినట్లు అధికారిక పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. కార్పెట్ ఏరియా పరంగా చూస్తే చదరపు అడుగు ధర దాదాపు రూ. 73,500 నుండి రూ. 73,600 వరకు పలికింది. నిర్మాణ మైలురాళ్లకు అనుగుణంగా చెల్లింపులు జరిపే ఈ ప్రాజెక్ట్ ఒప్పందం ప్రకారం 2031 జూన్ 30 నాటికి లేదా అంతకంటే ముందే ఈ లగ్జరీ అపార్ట్‌మెంట్ల పొజిషన్ చేతికి రానుంది. ఒకే కుటుంబం కోసం ముంబై ప్రైమ్ లోకేషన్‌లో ఏకకాలంలో ఇన్ని కోట్లు వెచ్చించి ప్రాపర్టీస్ తీసుకోవడం గమనార్హం.

మరోవైపు ప్రముఖ గాయకుడు సోను నిగమ్ సైతం రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ ముంబైలోని అంధేరి వెస్ట్ ప్రాంతంలో భారీ పెట్టుబడి పెట్టారు. సుందర్వన్ కాంప్లెక్స్‌లోని `ఆస్టన్` భవనంలో సోను నిగమ్ ఏకంగా మూడు కమర్షియల్ యూనిట్లను కొనుగోలు చేశారు. ఈ మూడు యూనిట్ల సంయుక్త విలువ సుమారు రూ. 17 కోట్లుగా ఉండగా.. మొత్తం 4,144.10 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాను కలిగి ఉన్నాయి. ఈ డీల్‌లో భాగంగా ఆయనకు నాలుగు పార్కింగ్ స్థలాలు కూడా లభించాయి. చదరపు అడుగు ధర సుమారు రూ. 41,021 చొప్పున ఈ క‌మ‌ర్షియ‌ల్ ఆస్తులను ఆయన సొంతం చేసుకున్నారు. గ‌తంలో ముంబైలోని ఖ‌రీదైన ఏరియాలో అమితాబ్, అభిషేక్, సోన‌మ్ క‌పూర్ స‌హా ప‌లువురు టాప్ స్టార్లు పెట్టుబ‌డులు పెట్టి సంగ‌తి తెలిసిందే.

ఇలా ఒకవైపు స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కుటుంబం విలాసవంతమైన నివాస గృహాలపై కోట్లు వెచ్చిస్తుంటే.. మరోవైపు స్టార్ సింగర్ సోను నిగమ్ కమర్షియల్ ప్రాపర్టీల రూపంలో బలమైన ఆర్థిక పెట్టుబడులు పెడుతున్నారు. సంపాదనతో పాటు భవిష్యత్తు సురక్షిత భద్రత కోసం ప్రముఖులు రియల్ ఎస్టేట్‌ను నమ్ముతుండటానికి ఈ రెండు తాజా ఉదాహరణలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ముంబై నగరంలో సెలబ్రిటీల భారీ పెట్టుబడులు ప్రస్తుతం ట్రేడింగ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారాయి.