Begin typing your search above and press return to search.

అనురాగ్ (X) మ‌నోజ్‌: స్నేహితుల‌ మ‌ధ్య చెడిందా?

ప‌రిశ్ర‌మ‌ స్నేహాలు నీటి మూట‌లాంటివి అని అంటారు! ఎప్పుడు క‌రిగిపోతాయో తెలీదు.

By:  Sivaji Kontham   |   15 Sept 2025 9:54 AM IST
అనురాగ్ (X) మ‌నోజ్‌: స్నేహితుల‌ మ‌ధ్య చెడిందా?
X

ప‌రిశ్ర‌మ‌ స్నేహాలు నీటి మూట‌లాంటివి అని అంటారు! ఎప్పుడు క‌రిగిపోతాయో తెలీదు. కానీ కొన్ని స్నేహాలు అలా కాదు. ఒక‌రి విష‌యంలో ఒక‌రు ప్రేమ ఆప్యాయ‌త‌, నిజాయితీతో ఆద‌ర్శంగా నిలుస్తారు. అలాంటి స్నేహం బాలీవుడ్‌లో అనురాగ్ కశ్యప్, మనోజ్ బాజ్‌పేయిల మ‌ధ్య ఉంది. 90ల‌లో `సత్య` సెట్స్‌లో క‌లుసుకున్న ఈ ఇద్ద‌రూ, గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ (2012) లాంటి గేమ్ చేంజింగ్ సిరీస్ వ‌ర‌కూ క‌లిసి ప‌ని చేసారు. ఒక‌రి గురించి ఒక‌రు.. ఒక‌రి కోసం ఒక‌రుగా ఉన్నారు. నిజాయితీగా త‌మ స్నేహం గురించి మాట్లాడ‌తారు.

ఒక‌రి సినిమాల‌ను ఒక‌రు నిజాయితీగా విమ‌ర్శిస్తారు కూడా.ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మ‌నోజ్ భాజ్ పాయ్ త‌న స్నేహితుడు క‌శ్య‌ప్ గురించి ఎమోష‌న‌ల్ గా మాట్లాడాడు. ``అనురాగ్ కశ్యప్ చాలా మంది శత్రువులను సంపాదించుకున్నాడు.. కోపంతో తన చేతిని విరగ్గొట్టుకున్నాడు. నేను అతని కంటే ప్రాక్టిక‌ల్‌గా ఉన్నాను`` అని అన్నాడు. కొంత ప్రేమ, కొంత ఉద్రేకం... చాలా ఓపెన్ గా ఉండే స్వ‌భావం అనురాగ్ ది అని అన్నాడు. దీనికి స్పందిస్తూ, నేను అన‌వ‌స‌ర వివాదాల‌కు వెళ‌తాన‌ని, అర్థం లేని ఫైటింగుల‌కు దిగుతాన‌ని అనురాగ్ అంగీక‌రించాడు.

''నువ్వు ఎవరికోస‌మైనా ఎక్కడైనా నిలబడతావు. ఎవరూ నీ కోసం నిలబడరు.. నీకు అది కనిపించలేదా?'' అని మ‌నోజ్ భాజ్ పాయ్‌ని అనురాగ్ ప్ర‌శ్నించాడు. నా ముఖం మీద ఉన్న‌ది చెబుతాడు... స్నేహం అంటే అదే! అని అనురాగ్ అన్నారు. నా నిర్మాత‌లు, ఇత‌ర‌ స్నేహితులు కూడా మ‌నోజ్ చెప్పిందే చెబుతార‌ని, తాను మారడానికి ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని అనురాగ్ తెలిపారు. మ‌నోజ్ భాజ్ పాయ్ `జుగ్నుమా` ముంబై ప్రీమియర్‌లో అతిథి అనురాగ్ క‌శ్య‌ప్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు. ఆ ఇద్ద‌రి సింపుల్ స్నేహం ఈ వేదిక వ‌ద్ద మ‌రోసారి కనిపించింది.

మ‌నోజ్ బాజ్‌పేయి పాదాలను తాకడానికి అనురాగ్ తో పాటు జైదీప్, విజ‌య్ వ‌ర్మ కూడా క్యూలో నిల‌బ‌డ్డారు.. ఇది మ‌నోజ్ ని క‌దిలించింది. ఎమోష‌న‌ల్ గా మాట్టాడారు.2012లో గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సమయంలో బాజ్‌పేయి గేమ్ అనూహ్యంగా మారింద‌ని అనురాగ్ వెల్లడించారు. ఎంపిక చేసుకున్న పాత్ర కోసం భోజనం తినడం కూడా మానేస్తాడు. అదే క‌మిట్ మెంట్ ని 15 ఏళ్లుగా కొనసాగిస్తూనే ఉన్నాడు.. అందుకే ఈ స్థాయికి ఎదిగాడు! అని కశ్యప్ పేర్కొన్నారు. గత సంవత్సరం భయ్యా జీ ప్రమోషన్ల సమయంలో ఇద్ద‌రి మ‌ధ్యా చెడింద‌ని ప్ర‌చార‌మైంది. కానీ అది సామాజిక మాధ్యమాల కార‌ణంగా ఒక చిన్న అపార్థం మాత్రమే అని బాజ్‌పేయి తరువాత స్పష్టం చేశారు.