అనురాగ్.. తెలుగులో క్లిక్కయ్యేలా ఉన్నారే..
అనురాగ్ కశ్యప్.. బాలీవుడ్ దర్శకుడు కమ్ నటుడు అయిన ఆయన ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నారని చెప్పాలి.
By: M Prashanth | 30 Jan 2026 12:56 PM ISTఅనురాగ్ కశ్యప్.. బాలీవుడ్ దర్శకుడు కమ్ నటుడు అయిన ఆయన ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నారని చెప్పాలి. ఒకప్పుడు దర్శకత్వంతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. గత కొన్నేళ్లుగా నటనపై ఎక్కువ దృష్టి పెట్టారు. ముఖ్యంగా విలన్ పాత్రల్లో తనదైన స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు.
బాలీవుడ్ లో ఇప్పటికే నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనురాగ్.. ఇప్పుడు నార్త్ టు సౌత్ అనేక ఆఫర్లు అందుకుంటున్నారు. ముఖ్యంగా విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజ మూవీలో అనురాగ్ పోషించిన విలన్ రోల్ కు తెలుగులో కూడా మంచి స్పందన వచ్చింది. ఆయన యాక్టింగ్ లో కనిపించిన నేచురాలిటీ, స్క్రీన్ ప్రెజెన్స్ కు టాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు.
ఆ సినిమా తర్వాత ఆయనకు సౌత్ లో అవకాశాలు బాగా పెరిగినట్టు కనిపిస్తోంది. అదే సమయంలో టాలీవుడ్ లో కూడా మంచి ఛాన్స్ లు అందుకుంటున్నారు! ఇప్పటికే తెలుగులో తెరకెక్కుతున్న డెకాయిట్ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఆ మూవీ సినిమాలో ఆయన పాత్ర కథకు కీలకమని, నెగెటివ్ షేడ్స్ లో కొత్తగా కనిపించనున్నారని చిత్రబృందం చెబుతోంది. ప్రమోషనల్ కంటెంట్ ద్వారా అర్థమవుతుంది కూడా.
దీంతో తెలుగు ప్రేక్షకుల్లో ఆయన పాత్రపై ఆసక్తి పెరిగింది. అదే సమయంలో ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో అనురాగ్ పేరు వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో రూపొందనున్న మెగా 158 సినిమాలో ఆయన విలన్ గా నటించనున్నట్లు కొన్ని రోజులుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ పాత్ర కోసం అనురాగ్ ను సంప్రదించారని సమాచారం.
సినిమాలో చిరంజీవికి ధీటుగా నిలిచే పవర్ ఫుల్ ప్రతినాయకుడి పాత్రకు అనురాగ్ సరైన ఎంపిక అవుతారని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్స్ యాక్టింగ్ మెగాస్టార్ కు సరితూగేలా ఉంటుందని సినీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. ఆ కాంబినేషన్ నిజమైతే మెగా, బాబీ ప్రాజెక్టుపై అంచనాలు మరింత పెరగడం ఖాయం అంటున్నారు సినీ ప్రియులు.
అయితే బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకున్న అనురాగ్.. ఇప్పుడు దక్షిణాది భాషల్లోనూ వరుస అవకాశాలు అందుకుంటుండటం విశేషం. విలన్ పాత్రల్లో కొత్త స్టైల్ ను తీసుకువస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆయన.. టాలీవుడ్ లో కూడా క్లిక్ అయ్యేలా కనిపిస్తున్నారు. మొత్తంగా చూస్తే నటుడిగా అనురాగ్ ప్రయాణం తెలుగు సినిమాల్లో కూడా దూసుకెళ్లేలా ఉంది. మెగా 158లో ఆయన ఎంట్రీపై అధికారిక ప్రకటన వస్తే, టాలీవుడ్ లో మరో స్ట్రాంగ్ విలన్ కు స్వాగతం పలికినట్టే.
