Begin typing your search above and press return to search.

నెట్‌ఫ్లిక్స్ స‌రండోస్‌కి మ‌ళ్లీ కోటింగ్ ఇచ్చాడు!

నెట్ ఫ్లిక్స్ ఇండియా అధినేత స‌రండోస్‌కి క్రియేటివిటీ అంటే ఏమిటో తెలియ‌ద‌ని, టెక్ గురూల‌కు భార‌తీయ ర‌చ‌న‌లు అర్థం కావ‌ని అనురాగ్ క‌శ్య‌ప్ ప‌దే ప‌దే విమ‌ర్శిస్తున్నారు.

By:  Sivaji Kontham   |   29 Aug 2025 3:00 AM IST
నెట్‌ఫ్లిక్స్ స‌రండోస్‌కి మ‌ళ్లీ కోటింగ్ ఇచ్చాడు!
X

నెట్ ఫ్లిక్స్ తో ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కనిర్మాత అనురాగ్ క‌శ్య‌ప్ విభేధాల గురించి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ ఇండియా అధినేత స‌రండోస్‌కి క్రియేటివిటీ అంటే ఏమిటో తెలియ‌ద‌ని, టెక్ గురూల‌కు భార‌తీయ ర‌చ‌న‌లు అర్థం కావ‌ని అనురాగ్ క‌శ్య‌ప్ ప‌దే ప‌దే విమ‌ర్శిస్తున్నారు. ఇప్పుడు కూడా మ‌రోసారి టెక్ వ్య‌క్తుల‌కు సృజ‌నాత్మ‌క ర‌చ‌న‌ల‌పై అంత‌గా అవ‌గాహ‌న ఉండ‌ద‌ని విరుచుకుప‌డ్డారు అనురాగ్.

స్కామ్ 1992, పాతాళ్ లోక్ వంటి క‌థ‌లు నెట్ ఫ్లిక్స్ వాళ్ల‌కు అర్థం కావ‌ని, అవ‌న్నీ ఇత‌ర ఓటీటీల్లో వ‌చ్చి పెద్ద విజ‌యాలు సాధించాయ‌ని సూటిగా నెట్ ఫ్లిక్స్ ప్ర‌తినిధుల‌ను తూర్పార‌బ‌ట్టారు. స్కామ్ 1992 సోని లైవ్ ఓటీటీ ద‌శ దిశను మార్చేంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించింద‌ని వివ‌రించారు అనురాగ్. ఇదే క‌థ‌ను వినిపిస్తే నెట్ ఫ్లిక్స్ ఎగ్జిక్యూటివ్ నిర్ల‌క్ష్యం చేసార‌ని, దీంతో సోని లివ్ లో విజ‌యం చూశాక‌, ఈ వ్య‌క్తిని ఉద్యోగం నుంచి తొల‌గించార‌ని కూడా అనురాగ్ వెల్ల‌డించాడు.

హన్సల్ మెహతా జీవిత చరిత్ర ఆధారంగా థ్రిల్లర్ సిరీస్ `స్కామ్ 1992` విజయానికి నెట్‌ఫ్లిక్స్ ప్రతిస్పందన ఏమిటి? అంటే... అందులో ప‌ని చేసిన ఉద్యోగిని తొల‌గించ‌డ‌మేన‌ని అన్నారు అనురాగ్. ప్ర‌పంచంలో ఇత‌ర ప్రాంతాల్లో క్రియేట్ చేస్తున్న కంటెంట్ తో పోలిస్తే మ‌న ద‌గ్గ‌ర కంటెంట్ అంతంత మాత్ర‌మే. మ‌న సినిమాలు, షోలు త‌క్కువ స్థాయిలో ఉన్నాయ‌ని కూడా వేలెత్తి చూపించారు అనురాగ్. భార‌త‌దేశంలో నెట్ ఫ్లిక్స్ లేక‌పోయినా సేక్రెడ్ గేమ్స్ చూసేందుకు భార‌తీయ ప్ర‌జ‌లు స‌బ్ స్క్రిప్ష‌న్ల‌ను కొనుగోలు చేసార‌ని, ఓటీటీలలో ప్ర‌జ‌లు ఏం చూడ‌టానికి ఇష్ట‌ప‌డ‌తారో అలాంటి వాటిని మాత్ర‌మే తెర‌కెక్కించాల‌ని అన్నారు.

అనురాగ్ నేరుగా నెట్‌ఫ్లిక్స్ ని, నెట్ ఫ్లిక్స్ అధిపతి టెడ్ సరండోస్‌పై నేరుగా దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. గ‌త జూన్ లోను భార‌తీయ ద‌ర్శ‌కులు క‌థ‌లు చెప్పే విధానాన్ని నెట్ ఫ్లిక్స్ టెక్ గురూలు అర్థం చేసుకోద‌ని విమ‌ర్శించారు. వారికి భార‌త‌దేశం అర్థం కాదు. అందుకే ఇలాంటి చెత్త ప‌నులు చేస్తారు. టెడ్ స‌రండోస్ భార‌త‌దేశాన్ని అర్థం చేసుకోడు. భార‌త‌దేశంలో నెట్ ఫ్లిక్స్ ప్ర‌తినిధులు కేవ‌లం ఎద్దుల‌ను న‌మ్ముతారు... అని ఓ ఇంట‌ర్వ్యూలో తీవ్రంగా విమర్శించారు.

సేక్రెడ్ గేమ్స్ భార‌త‌దేశంలో ప్ర‌వేశించ‌డానికి మార్కెట్ అనువుగా లేద‌ని స‌రండోస్ అభిప్రాయం వ్య‌క్తం చేయ‌గా, అత్తా కోడ‌ళ్ల క‌థ‌ల‌తో అత‌డు భార‌త‌దేశంలో ఓటీటీల‌ను ప్రారంభించాల్సింద‌ని ఎద్దేవా చేసాడు. అనురాగ్ దర్శకత్వం వహించిన `నిషాంచి` సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.