రెండేళ్లు వృధా.. ఇండస్ట్రీలో ఎలా బతికేది?
అనురాగ్ కశ్యప్ ఇటీవల బాలీవుడ్ ని వదిలేసి సౌత్ లో సెటిలైన సంగతి తెలిసిందే. క్లీన్ సిటీ బెంగళూరులో నివశిస్తున్న అతడు నగర సౌందర్యానికి ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.
By: Sivaji Kontham | 24 Sept 2025 12:00 AM ISTఅనురాగ్ కశ్యప్ ఇటీవల బాలీవుడ్ ని వదిలేసి సౌత్ లో సెటిలైన సంగతి తెలిసిందే. క్లీన్ సిటీ బెంగళూరులో నివశిస్తున్న అతడు నగర సౌందర్యానికి ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. అతడు కన్నడం సహా ఇతర సౌత్ భాషల్లో అవకాశాలు అందుకుంటున్నాడు. అదే క్రమంలో దక్షిణాది చిత్రపరిశ్రమ గొప్పతనాన్ని అనురాగ్ కశ్యప్ ప్రశంసిస్తున్న తీరు విస్మయపరుస్తోంది.
బాలీవుడ్ వర్క్ కల్చర్ గురించి, అక్కడ వ్యక్తుల మనస్తత్వాల గురించి అనురాగ్ కశ్యప్ చెబుతున్న విషయాలు నిజంగా షాకింగ్ గా ఉన్నాయి. బాలీవుడ్ లో కార్పొరెట్ కల్చర్ సృజనాత్మకతను చంపేస్తుందని, క్రియేటర్లకు స్వేచ్ఛ లేదని కూడా అతడు విమర్శించారు.
అయితే సౌత్ లో ఈ పరిస్థితి భిన్నంగా ఉందని కితాబిచ్చిన అనురాగ్, ఇప్పుడు ప్రముఖ నటుడు-దర్శకుడు బాసిల్ జోసెఫ్ గురించి తన ఆవేదనను వ్యక్తపరిచారు. అతడు తన కెరీర్‌లో రెండు విలువైన సంవత్సరాలు వృధా చేసుకున్నాడు అని అనురాగ్ కశ్యప్ వెల్లడించారు. రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో `శక్తిమాన్ రీబూట్`ను తెరకెక్కించాలని ప్రయత్నించినా కానీ, ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది.
బాసిల్ ప్రతిభావంతుడు. మంచి సినిమాల్లో నటించాడు. `పోన్‌మాన్`లో బాసిల్ మల్టీట్యాలెంట్ ని కశ్యప్ ప్రశంసించారు. అతడు దర్శకత్వం వహించిన `మిన్నల్ మురళి` గురించి కూడా ప్రస్తావించారు. రెండు లేదా మూడు సంవత్సరాలలో అతడు చేసిన పాత్రల గురించి ప్రశ్నించాను. ఇలాంటి వైవిధ్యమైన పాత్రలను ఎలా మనేజ్ చేస్తున్నారో అతడిని అడిగాను. శక్తిమాన్ సినిమాను తీయడానికి ప్రయత్నిస్తూ తన జీవితంలో రెండు సంవత్సరాలు వృధా చేసుకున్నానని అతను నాకు చెప్పాడు.. అని అనురాగ్ తెలిపారు. దేవా ఈ పరిశ్రమలో ఎలా బతుకుతారు? అని ఆవేదన చెందాడు..అయితే నేను కూడా మేనేజ్ చేయలేక దూరంగా వచ్చేసాను అని అనురాగ్ కశ్యప్ ఆవేదనకు గురయ్యాడు.
శక్తిమాన్ సినిమా రీమేక్ రైట్స్ కోసం ఒరిజినల్ శక్తిమాన్ గా నటించిన ముఖేష్ ఖన్నా చుట్టూ తిరిగాడు రణ్ వీర్ సింగ్. ఎలాగైనా ఒప్పించి రైట్స్ కొనేయాలని చాలా ప్రయత్నించాడు. కానీ ముఖేష్ ఖన్నా అస్సలు అంగీకరించలేదు. పైగా రణ్ వీర్ సింగ్ లాంటి హీరో శక్తిమాన్‌గా నటించడానికి సరిపోడని విమర్శించారు.
