ఈ బోల్డ్ మూవీ రిలీజ్ కష్టమేనా..?
బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కాస్త బ్రేక్ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
By: Ramesh Palla | 17 Sept 2025 3:00 PM ISTబాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కాస్త బ్రేక్ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గత ఏడాది ఈయన దర్శకత్వంలో రూపొందిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఆ లోటును ఈ ఏడాదిలో రెండు సినిమాలతో భర్తీ చేసేందుకు దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా అనురాగ్ కశ్యప్ 'బందర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందినట్లు చెబుతున్నారు. సుదీప్ శర్మ, అభిషేక్ బెనర్జీ రాసిన ఈ నిజ జీవిత సంఘటనల కథ నుంచి ప్రేరణ పొంది ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, సన్యా మల్హోత్రా ఈ సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా కొన్ని వివాదాస్పద పాయింట్స్‌తో సాగుతుందట.
అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో బందర్
ముఖ్యంగా ఇండస్ట్రీలోనే కాకుండా బయట ఈ మధ్య కాలంలో లైంగిక వేదింపుల ఆరోపణలు చేస్తున్న అమ్మాయిలు, స్త్రీలు చాలా మంది ఉన్నారు. గతంతో పోల్చితే ఇప్పుడు అమ్మాయిలు ధైర్యంగా మీడియా ముందుకు లేదా పోలీసుల ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెబుతున్నారు. అయితే ఇలా లైంగిక వేదింపుల ఆరోపణలు చేస్తున్న వారిలో కొందరు ఉద్దేశ్యపూర్వకంగా, ఎదుటి వారిని ఇబ్బందులకు గురి చేయడం కోసం, చట్ట పరంగా చిక్కుల్లో ఇరికించడం కోసం ఆరోపణలు చేస్తున్నారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇండస్ట్రీలో కూడా కాస్త అటు ఇటుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అనేది కొందరి అభిప్రాయం. ముఖ్యంగా అసత్య లైంగిక వేదింపుల ఆరోపణల వల్ల చాలా మంది ప్రముఖ నటీ నటులు, సాంకేతిక నిపుణులు కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సుదీప్ శర్మ, అభిషేక్ బెనర్జీ రాసిన కథ..
'బందర్' సినిమా కథ విషయానికి వస్తే.. రాజ్ మల్హోత్రా వయసు పైబడిన టీవీ స్టార్, అతని కీర్తి మసకబారుతోంది. ఆ సమయంలో తన మాజీ ప్రియురాలు గాయత్రి మళ్లీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తుంది. కానీ అప్పటికే రాజ్ మల్హోత్రా, ఖుషి అనే యువతితో రిలేషన్‌లో ఉంటాడు. తన కొత్త రిలేషన్‌తో చాలా సంతోషంగా రాజ్ ఉంటాడు. దాంతో గాయత్రితో కనీసం మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపించడు. దాంతో గాయత్రి ఆగ్రహంతో రగిలి పోతుంది. అతడి ఖ్యాతిని తగ్గించడం కోసం గాయత్రి అతనిపై అత్యాచారం ఆరోపణలు చేయడంతో పరిస్థితులు తీవ్ర మలుపు తిరుగుతాయి. గాయత్రి ఆరోపణలు, ఫిర్యాదు కారణంగా రాజ్ మల్హోత్ర అరెస్ట్ చేయబడుతాడు. వ్యవస్థలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఒక మహిళ అత్యాచార ఆరోపణలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించారట.
బాబీ డియోల్, సన్యా మల్హోత్ర ముఖ్య పాత్రల్లో...
ఇప్పటికే సినిమా ప్లాట్ తెలిసిన వారిలో చూడాలనే ఆసక్తి మొదలు అయింది. ఈ సినిమాను చూసిన సినీ విమర్శకురాలు సుచరిత త్యాగి స్పందిస్తూ... ఇది చాలా సాహసోపేతమైన ఎంపిక, అయితే ఈ సినిమా అంచనాలను అందుకుంటుందనే నమ్మకం లేదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది. మహిళలకు వ్యతిరేకంగా ఉన్న ఈ సినిమాను మహిళ సంఘాల వారు విడుదల కానిచ్చే అవకాశాలు లేదు అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న వారు ఈ మధ్య కాలంలో భయం లేకుండా బయటకు వచ్చి తమకు న్యాయం కావాలని అడుగుతున్నారు. ఇలాంటి సమయంలో అసత్య లైంగిక వేదింపులు అంటూ చెప్పడం ద్వారా నిజమైన బాధితులు ఖచ్చితంగా బాధింపబడుతారు అనే అభిప్రాయంను మహిళ సంఘాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల కావాల్సిన ఈ సినిమాకు ఖచ్చితంగా ఆ సమయంలో వివాదాలు తప్పేలా లేదు. అనురాగ్ కశ్యప్ ప్రతి సినిమా ఇలాంటి కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడం మనం చూస్తూనే ఉంటాం. మరి ఈ సినిమా ఇబ్బందులు ఎంత దూరం వెళ్తారు, వివాదం వల్ల అసలు సినిమా విడుదల అయ్యేనా అనేది చూడాలి.
