Begin typing your search above and press return to search.

పరదా.. ఇది మామూలు నమ్మకం కాదుగా!

ముఖ్యంగా అనుపమ తనవంతుగా ప్రమోషన్స్ తో సందడి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలోని నగర పర్యటనల నుంచి ప్రతి ప్రధాన ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

By:  M Prashanth   |   20 Aug 2025 12:12 AM IST
పరదా.. ఇది మామూలు నమ్మకం కాదుగా!
X

టాలెంటెడ్ బ్యూటీ, మలయాళం హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ పరదా రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. సోషల్ డ్రామాగా సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో మాలీవుడ్ నటి దర్శన, సంగీత కీలక పాత్రలు పోషిస్తున్నారు.

డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే పరదా చిత్రాన్ని సమర్పిస్తుండగా.. ఆనంద మీడియా పతాకంపై విజయ్ దొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందించగా, మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న సినిమా.. ఆగస్టు 22వ తేదీన రిలీజ్ కానుంది.

అయితే ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్ సహా ప్రమోషనల్ కంటెంట్ అంతా సూపర్ రెస్పాన్స్ సంపాదించుకుంది. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. మేకర్స్ కూడా మూవీ రిజల్ట్ పై ఫుల్ నమ్మకంతో ఉన్నారు. సినిమాను వినూత్నంగా ప్రమోట్ చేస్తున్నారు.

ముఖ్యంగా అనుపమ తనవంతుగా ప్రమోషన్స్ తో సందడి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలోని నగర పర్యటనల నుంచి ప్రతి ప్రధాన ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రీసెంట్ గా సినిమా బాగుందని రివ్యూలో చదివితే.. సినిమాకు వెళ్లండని వ్యాఖ్యానించారు. దీంతో టీమ్ అంతా చాలా నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు అదే నమ్మకంతో రెండు రోజుల ప్రీమియర్ షోస్ ను ప్లాన్ చేశారు మేకర్స్. ఆగస్టు 20 నుంచి పలుచోట్ల ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. నిజానికి చిన్న సినిమాలకు ప్రీమియర్స్ టైంలో పాజిటివ్ టాక్ వస్తే.. ఎంత ఉపయోగపడుతుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే పలు చిత్రాల విషయంలో ప్రూవ్ అయింది.

ఇప్పుడు పరదా మేకర్స్ కూడా కంటెంట్ పై ఉన్న నమ్మకంతో ప్రీమియర్స్ జోలికి వెళ్లినట్లు తెలుస్తోంది. నిజానికి ఇది రిస్క్ ఉండే నిర్ణయం అయినప్పటికీ కంటెంట్ పై మేకర్స్ కు ఉన్న హోప్ అలాంటిది. మరి పరదా మూవీ ఎలా ఉంటుందో.. ఎలాంటి హిట్ అవుతుందో.. ప్రీమియర్స్ ఎంతవరకు హెల్ప్ చేస్తాయో వేచి చూడాలి.