Begin typing your search above and press return to search.

కామెడీ ఉంది.. ఆ 'హ్యాపీ డేస్' ఏవీ?

అనుపమ పరమేశ్వరన్ ఒక ఇంటర్వ్యూలో 'హ్యాపీ డేస్' సినిమాను 30 నుంచి 50 సార్లు చూసుంటానని చెప్పారు.

By:  M Prashanth   |   13 Oct 2026 1:00 PM IST
కామెడీ ఉంది.. ఆ హ్యాపీ డేస్ ఏవీ?
X

అనుపమ పరమేశ్వరన్ ఒక ఇంటర్వ్యూలో 'హ్యాపీ డేస్' సినిమాను 30 నుంచి 50 సార్లు చూసుంటానని చెప్పారు. టీవీలో మధ్య నుంచి వచ్చినా ఛానల్ మార్చకుండా చూస్తానని కూడా అన్నారు. 2007లో వచ్చిన సినిమా గురించి ఇప్పటికీ ఇలా మాట్లాడుకోవడం వెనక కారణం ఉంది. కాలేజీ ఫ్రెండ్స్, చిన్న గొడవలు, ప్రేమలు, విడిపోవడాలు.. ఇవన్నీ నిజ జీవితంలో జరిగినట్లే అనిపించాయి. మరి ఇప్పుడు అలాంటి సినిమాలు ఎందుకు తక్కువగా కనిపిస్తున్నాయి అనే సందేహాలు వస్తున్నాయి.

అప్పట్లో 'హ్యాపీ డేస్' ఒక్కటే కాదు. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'లో కాలనీ యువత మధ్య అనుబంధాలు, 'కేరింత'లో ఫ్రెండ్స్ మధ్య ప్రేమలు, అభిప్రాయ భేదాలు చూపించారు. ఈ సినిమాల్లో అందరూ కలిసి నవ్వుకునే సీన్స్ ఉంటాయి. కానీ చివరికి ఎవరి జీవితంలో వాళ్లు ముందుకు వెళ్లాల్సి రావడం, కలిసి గడిపిన రోజులు గుర్తొచ్చే ఎమోషన్ కూడా ఉంటుంది. ప్రేక్షకులు ఆ పాత్రల్లో తమ ఫ్రెండ్స్‌ను చూసుకున్నారు.

ముఖ్యంగా శేఖర్ కమ్ముల ఆ ట్రెండ్ ను పక్కన పెట్టేశారు. అయితే యూత్ సినిమాలను దర్శకులు పూర్తిగా మానేశారని చెప్పలేం. 'ఈ నగరానికి ఏమైంది'లో కాలేజీ దాటిన నలుగురు స్నేహితుల ప్రయాణం చూపించారు. 'హుషారు'లోనూ నలుగురు ఫ్రెండ్స్ జీవితాన్ని కామెడీతో చెప్పారు. 'మ్యాడ్'లో మళ్లీ ఇంజినీరింగ్ కాలేజీకి తీసుకెళ్లారు. కానీ అక్కడ కథ కంటే ఫ్రెండ్స్ వేసుకునే పంచులు, కామెడీ సన్నివేశాలే ఎక్కువగా నడిచాయి. 'మ్యాడ్ స్క్వేర్'లోనూ అదే బ్యాచ్‌తో వినోదాన్ని కొనసాగించారు. ఫ్రెండ్షిప్ జానర్ పోలేదు. దాన్ని చెప్పే పద్ధతి మారింది.

మరోవైపు 'కమిటీ కుర్రోళ్లు'లో చిన్ననాటి స్నేహితులు పెద్దయ్యాక ఎదుర్కొన్న విభేదాలను తీసుకున్నారు. ఊరి జాతర, కులం, రాజకీయాలు కూడా వాళ్ల అనుబంధాల మధ్యకు వచ్చాయి. 'లిటిల్ హార్ట్స్' లాంటి సినిమాలు యువతను థియేటర్లకు రప్పించినా అక్కడ ఎక్కువగా ప్రేమకథకు ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఇప్పటి సినిమాల్లో యూత్ కనిపిస్తున్నారు. కానీ ఒక గ్యాంగ్‌తో నాలుగేళ్లు ప్రయాణించిన ఫీల్ ఇచ్చే కథలు మాత్రం అరుదుగా వస్తున్నాయి.

ఇటీవల వచ్చిన 'ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్'లోనూ ఇప్పుడు యువతకు దగ్గరైన పాయింట్ ఉంది. విదేశాల్లో చదువుకోవాలనే కుటుంబ ఒత్తిడితో లండన్ వెళ్లే యువకుడి కథ ఇది. కానీ ఆ తర్వాత సినిమా ఎక్కువగా హీరోహీరోయిన్ల ప్రేమ, సహజీవనం చుట్టూ తిరిగింది. విదేశీ చదువు, అక్కడి జీవితానికి సంబంధించిన అంశాలకంటే రిలేషన్‌షిప్‌కే ఎక్కువ చోటిచ్చారనే అభిప్రాయాలు వచ్చాయి. కథనంపైనా విమర్శలు వినిపించాయి.

ఈ మధ్య గుణశేఖర్ తీసిన 'యుఫోరియా' కూడా యువత గురించే. కానీ అది సరదా ఫ్రెండ్షిప్ సినిమా కాదు. డ్రగ్స్, నేరాలు, వాటి పరిణామాలపై తీసిన సోషల్ డ్రామా. ఇక నవంబర్ 19న తరుణ్ భాస్కర్ 'ఈఎన్ఈ రిపీట్'తో పాత ఫ్రెండ్స్ గ్యాంగ్‌ను మళ్లీ తెస్తున్నారు. దాంట్లో ఏం చూపిస్తారో చూడాలి. ఏదేమైనా ఒక ఫీల్ గుడ్ హ్యాపీ డేస్ లాంటి సినిమాను యూత్ మిస్ అవుతున్నారు. ఇప్పటి కాలేజీల్లో ప్లేస్‌మెంట్స్, విదేశీ చదువుల ప్లాన్స్, ఆన్‌లైన్ ఫ్రెండ్షిప్స్ లాంటి విషయాలు చాలానే ఉన్నాయి. మరి ఆ రూట్లో నేటితరం దర్శకులు ఏమైనా ఆలోచిస్తారేమో చూడాలి.